ట్రంప్ పై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ
సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ వృద్దిరేటు సాధించిందని ప్రశంసలు;
By : The Federal
Update: 2025-09-02 09:49 GMT
భారత్ పై 50 శాతం సుంకాలు విధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ ఆర్థిక స్వార్థం వల్ల సవాళ్లు ఉత్పన్నమైనప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతం పెరిగింది’’ అని ఆయన మంగళవారం అన్నారు.
చైనాలో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం నుంచి వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం అయ్యారు. ఇది వార్తల్లో పతాకశీర్షికలకెక్కింది.
‘‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఆందోళనలు, ఆర్థిక స్వార్థం నుంచి ఉత్పన్నమయ్యే సవాళ్లు ఉన్న సమయంలో భారత్ 7.8 శాతం వృద్దిని సాధించింది’’ అని మోదీ అన్నారు.
‘‘కొన్నిరోజుల క్రితమే ఈ సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. మరోసారి భారత్ అంచనా కంటే మెరుగ్గా పనిచేసింది’’ అని ప్రధాని చెప్పారు.
భారత్ పై నమ్మకం పెరుగుతోంది..
2021 లో తన ప్రభుత్వం సెమికాన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిందని, 2023 నాటికి భారత్ లో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంట్ కు ఆమోదం లభించిందని ప్రధాని పేర్కొన్నారు.
‘‘2025 లో మేము ఐదు అదనపు ప్రాజెక్ట్ లను ఆమోదించాము. మొత్తం మీద పది సెమీకండక్టర్ ప్రాజెక్ట్ లలో రూ.1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. ఇది భారత్ పై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నమ్మకాన్ని చూపిస్తుంది.
మేము జాతీయ సింగిల్ విండో వ్యవస్థను అమలు చేసాము. దీనిద్వారా కేంద్ర, రాష్ట్రాల నుంచి అన్ని అనుమతులు ఒకే వేదికపై అందుతున్నాయి. ఫలితంగా మా పెట్టుబడిదారులు భారీ కాగితపు పని నుంచి విముక్తి పొందారు’’ అని మోదీ అన్నారు.
భారత్ సెమీ కండక్టర్ హబ్ గా మారుతోందని, భారత చిప్ ప్రపంచాన్ని నడిపించే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. దేశపు ప్రయాణం ఆలస్యంగా ప్రారంభమైందని, అయిన ఇప్పుడు ఈ వేగాన్ని ఏ శక్తి ఆపలేదని పేర్కొన్నారు.
ఆవిష్కరణ.. యువశక్తి..
సెమీకాన్ ఇండియాలో కార్యక్రమంలో 40 నుంచి 50 దేశాల ప్రాతినిధ్యంతో సెమీకండక్టర్ రంగ నిపుణులు పాల్గొంటున్నారని, ఇందులో దేశ ఆవిష్కరణ, యువశక్తి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.
‘‘ఈ ప్రత్యేక కలయిక స్పష్టమైన సందేశాన్ని పంపుతుంది’’ ఆయన అన్నారు. ప్రపంచం భారత్ ను విశ్వసిస్తుందని, ప్రపంచం భారత్ తో సెమీకండక్టర్ భవిష్యత్ ను నిర్మించడానికి సిద్దంగా ఉందన్నారు.
కాగితం నుంచి విముక్తి..
పెట్టుబడిదారులకు కాగితపు పని నుంచి విముక్తి కలిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇకముందు ఇదే విధానంతో పనిచేస్తోందని చెప్పారు. జాతీయ సింగిల్ విండో వ్యవస్థను అమలు చేశారని, కేంద్రం, రాష్ట్రాలు, రెండింటి నుంచి అన్ని అనుమతులను ఒకే వేదికపై పొందేందుకు వీలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు.
ఈ చర్య ఫలితంగా పెట్టుబడిదారులు విస్తృతమైన కాగితపు పనుల నుంచి విముక్తి పొందారని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ పార్కులను ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాల నమూనా కింద అభివృద్ది చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రభుత్వ ప్రకటనలో తెలిపారు.
ఇది భూమి, విద్యుత్ సరఫరా, పోర్టు, విమానాశ్రయ కనెక్టివిటీ వంటి సౌకర్యాలను అందిస్తోంది. ఇవన్నీ కలిస్తే పారిశ్రామిక వృద్ది అనివార్యమని, భారత్ ఎండ్ టూ ఎండ్ సామర్థ్యాలను అందిస్తోందని ఆయన అన్నారు.