పహల్గామ్ దాడిపై విచారణ చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఇది సున్నిత విషయమన్న న్యాయస్థానం, పిటిషన్ కొట్టివేత;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-01 11:33 GMT
పహల్గాం ఉగ్రవాద ఘటనపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో కూడా దేశ భద్రతా బలగాలను స్థైర్యాన్ని దెబ్బతీసే ఇలాంటి పిటిషన్లు ఎందుకు దాఖలు చేస్తారని పిటిషనర్ కు గట్టిగా తలంటింది.
మీరు కూడా భారతీయులే అని, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. ఉగ్రవాద ఘటనపై విచారించడానికి న్యాయస్థానంలోని జడ్జీలు నిపుణులు కాదని తేల్చింది.
ఇతర రాష్ట్రాల్లోని కాశ్మీరీ విద్యార్థులకు ఈ ఘటన తరువాత టార్గెట్ గా మారే అవకాశం ఉందని, దీనిని విచారించి తగిన ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. అయితే సుప్రీంకోర్టు ఈ విజ్ఞప్తిని తిరస్కరించింది. తగిన కోర్టులను ఆశ్రయిస్తే మీకు ఉపశమనం లభిస్తుందని పిటిషన్ ను కొట్టివేసింది.
పహల్గామ్ ఉగ్రవాద ఘటనలో బైసరన్ లోయలో ఉన్న 26 మంది హిందూ పర్యాటకులను టార్గెట్ చేసిన ఇస్లామిక్ ఉగ్రవాదులు తలపై తుపాకీతో కాల్చి చంపారు. కేవలం ఇస్లామేతరులనే కారణంతో వారిని చంపివేశారు.
ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబీకింది. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తాన్ సైన్యంలో స్పెషల్ ఫోర్స్ కు చెందిన వారని, వారికి ఉగ్రవాదుల ముసుగు తొడిగి భారత్ లోకి చొరబడ్డారని ఎన్ఐఏ తెలిపింది.
ప్రస్తుత వీరి కోసం దక్షిణ కాశ్మీర్ అడవుల్లో మొత్తం జల్లెడపడుతున్నారు. మూడుసార్లు భద్రతా దళాల చేతికి చిక్కినట్లు చిక్కి తప్పించుకున్నారు.
సరిహద్దుల్లో కాల్పులు..
ఏప్రిల్ 22 తరువాత పాకిస్తాన్ ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే భారత పోస్టులపైకి దాడులు చేస్తోంది. ఇప్పటికి వారం నుంచి కాల్పులు, ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్- పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ హాట్ లైన్ ద్వారా మాట్లాడుకున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణమాలు ఉంటాయని భారత్ హెచ్చరించింది. అయినప్పటికీ పాక్ దళాలు కాల్పులు కొనసాగించాయి.
భారత ఎయిర్ స్పేస్ మూసివేత..
ఇస్లామాబాద్ భారత్ కమర్షియల్ విమానాలకు అనుమతి నిరాకరించన నేపథ్యంలో న్యూఢిల్లీ కూడా నిన్న రాత్రి నుంచి ఇలాగే పాక్ విమానాలకు అనుమతి నిరాకరించింది. అలాగే వాఘ సరిహద్దు దగ్గర బోర్డర్ ను మూసివేసింది. ఇంతకుముందు భారత్ దాని జీవనాడి సింధుజలాల ఒప్పందం కూడా సస్పెండ్ చేసింది.
ఎన్ఎస్ఏబీ పునరుద్దరణ
పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందనే ఊహగానాల మధ్య సరిహద్దు సంబంధాల దృష్ట్యా కేంద్రం జాతీయ భద్రతా సలహబోర్డు ను కూడా పునరుద్దరించింది.
ఎన్ఎస్ఏబీ చైర్మన్ గా రీ సెర్చ్ అండ్ అనాలాసిస్ వింగ్ చీఫ్ అలోక్ జోషి నియమించినట్లు తెలిసింది. ఎన్ఎస్ఏబీ అనేది జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ కు ఇన్ ఫుట్ లను అందించే సలహా సంస్థ.