‘‘పహల్గామ్ గడ్డి మైదానాలు తుపాకులతో కాదు.. నవ్వులలో కళకళలాడాలి’’
ఉగ్రవాద దాడికి నిరసనగా కాశ్మీర్ పత్రికల సంఘీభావం, మొదటి పేజీని నలుపు రంగులోకి మార్చి వార్తల ప్రచురణ;
Translated by : Chepyala Praveen
Update: 2025-04-23 07:39 GMT
జమ్మూకాశ్మీర్ లోని అమాయక హిందూ పర్యాటకులపై ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన మారణకాండకు అక్కడి పత్రికలు నిరసన తెలిపాయి. ఉగ్రవాద దాడిని నిరసిస్తూ అనేక వార్త పత్రికలు తమ మొదటి పేజీని నలుపు రంగుకి మార్చి వార్తలను ప్రచురించాయి.
వార్తాపత్రికలు ప్రకటించిన ఈ నిరసనలో నలుపు రంగులో పేజీని తీసుకురావడంతో వార్తలన్నీ తెలుపు లేదా ఎరుపు, ముదురు రంగు హెడ్ లైన్లతో దర్శనం ఇచ్చాయి. ఈ నిరసన ఇక్కడ ప్రజల ఐక్యతను తెలియజేసింది. అమానవీయ హింస నేపథ్యంలో మీడియా, కాశ్మీరీ సమాజం రెండు తన సానుభూతి, ఐక్యతను ఇలా తెలియజేస్తున్నట్లు సంపాదకీయాలు రాశాయి.
గ్రేటర్ కాశ్మీర్, రైజింగ్ కాశ్మీర్, కాశ్మీర్ ఉజ్మా, ఆఫ్తాబ్, తైమీల్ ఇర్షాద్ వంటి ప్రముఖ ఆంగ్ల, ఉర్దూ దినపత్రికలు మొదటి పేజీని నలుపు రంగులోకి మార్చి వార్తలు ప్రచురించాయి.
దు:ఖంలో సంఘీభావం..
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక గ్రేటర్ కాశ్మీర్ ‘‘భయంకరమైంది: దహించబడిన కాశ్మీర్’’ అని పతాక శీర్షికల్లో వార్తలను ప్రచురించింది. ‘‘కాశ్మీరీలు దు:ఖిస్తున్నారు’’ అని నల్లని పేజీలో తెలుపు రంగులో వార్తలను పబ్లిష్ చేసింది. హెడ్ లైన్ కింద ఎరుపు రంగులో ఉన్న ఉపశీర్షికను లో ‘‘పహల్గామ్ లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు’’ అని పేర్కొంది.
‘‘గడ్డి మైదానంలో ఊచకోత- కాశ్మీర్ ఆత్మను రక్షించండి’’ అనే శీర్షికలతో పత్రికలన్నీ వార్తలు, సంపాదకీయాలు ప్రచురించాయి. అందులో ఉగ్రవాదులపై చాలా తీవ్రమైన పదాలను వాడాయి.
తాజా ఉగ్రవాద దాడి జమ్మూకాశ్మీర్ పై మరోసారి భయంకరమైన ఉగ్రవాదపు నీడ పడిందని తెలిపాయి. భూమిపై ఉన్న స్వర్గం అనే వారసత్వాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతం అని వార్తాపత్రిక పేర్కొంది.
‘‘ఈ హేయమైన చర్య కేవలం అమాయక జీవితాలపై దాడి మాత్రమే కాదు. కాశ్మీర్ గుర్తింపు, విలువలకు దాని ఆతిథ్యం, దాని ఆర్థిక వ్యవస్థ, దాని దుర్భలమైన శాంతికి ఉద్దేశపూర్వకమైన దెబ్బ.
కాశ్మీర్ ఆత్మ ఈ క్రూరత్వాన్ని నిస్సందేహాంగా ఖండిస్తుంది. అందాన్ని కోరుకుని విషాదాన్ని కనుగొన్న బాధితుల కుటుంబాలకు హృదయాపూర్వక సానుభూతిని తెలియజేస్తుంది’’ అని సంపాదకీయం పేర్కొంది.
ఐక్యతకు పిలుపు
నడిచి లేదా గుర్రం ద్వారా మాత్రమే చేరుకోగల పర్యాటక ప్రదేశంలో భద్రతా లోపాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని కూడా సంపాదకీయాలు పేర్కొన్నాయి. భదత్రా, నిఘా సంస్థల మధ్య మెరుగైన నిఘా సేకరణ, గట్టి సమన్వయం అవసరమని సంపాదకీయం హైలెట్ చేసింది.
నిఘా పెంచడంతో పాటు సమాజాన్ని అందులో భాగం చేయడం, ఉగ్రవాదాన్ని నిర్ణయాత్మక అణిచివేతతో సహ బలమైన నివారణ వ్యూహాలను అమలు చేయాలని కోరింది.
‘‘కాశ్మీర్ ప్రజలు చాలాకాలంగా హింసను చూస్తున్నారు. అయితే వారి స్ఫూర్తి చెక్కు చెదరకుండా ఉంది. ఈ దాడి విభజనను తీసుకురాకూడదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనల్ని ఏకం చేయాలి. ప్రభుత్వం, భద్రతా సంస్థలు, పౌరసమాజం, పౌరులందరూ కలిసి కట్టుగా ఉండాలి’’ అని వార్తపత్రికలు కోరాయి.
మన సంకల్పం ద్వారా మాత్రమే భవిష్యత్ ను కాపాడుకోగలమని, పహల్గామ్ గడ్డి మైదానాలు తుపాకీ కాల్పులతో కాదు, నవ్వులతో ప్రతిధ్వనించేలా చూసుకోవాలని, కాశ్మీర్ శాంతి, శ్రేయస్సుకు దారితీసేలా చూసుకోవాలని సంపాదకీయాలు రాశాయి.