చీనాబ్ వంతెన ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..
ఏప్రిల్ 19 న ప్రారంభించి, జాతికి అంకితం ఇవ్వనున్న ప్రధాని;
By : The Federal
Update: 2025-03-31 11:19 GMT
కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన చీనాబ్ వంతెనను అధికారికంగా ప్రారంభించడానికి తేదీ నిర్ణయమైపోతోంది. వచ్చే నెల్ 19(ఏప్రిల్) న ప్రధాని మోదీ ఈ వంతెన ప్రారంభించి జాతికి అంకితం ఇస్తారని పీఎంఓ వర్గాలు తెలిపాయి.
ఉధంపూర్ - శ్రీనగర్- బారాముల్లా లింక్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ వంతెన ప్రారంభించారు. ఈ లింక్ మొత్తం దూరం 272 కిలోమీటర్లు. అందులో భాగంగానే ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ వంతెన్ నిర్మాణం చేపట్టారు. ఇదే రోజు ఈ మార్గంలో వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. కాట్రా నుంచి ఈ రైలు పట్టాలపైకి వెళ్లనుంది.
ప్రస్తుతం జమ్మూ రైల్వే స్టేషన్ లో పునరుద్దరణ పనులు జరుగుతున్నందున జమ్మూ- కత్రా- శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మొదట కాట్రా నుంచి నడుస్తుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు లింక్ గత నెలలోనే పూర్తయింది.
కాట్రా- బారాముల్లా మార్గంలో రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. జనవరిలోనే కాట్రా- కాశ్మీర్ మధ్య రైలు సర్వీస్ కు రైల్వే భద్రతా కమిషనర్ ఆమోదం తెలిపారు.
ప్రస్తుతం ఈ మార్గం గుండా వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ జమ్మూ- శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, ఈ ప్రాంతానికి ఆధునిక, సమర్థవంతమైన రైలు సేవలు అందిస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు.
జమ్మూలో విలేకరులతో మాట్లాడిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘‘ప్రధాని మోదీ ఏప్రిల్ 19న ఉధంపూర్ చేరుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన సందర్శించి దానిని ప్రారంభిస్తారు. తరువాత కాట్రా నుంచి వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు’’ అని ఆదివారం చెప్పారు.
కాశ్మీర్ కు ప్రత్యక్ష రైలు అనుసంధానం కోసం చాలా కాలంగా చేస్తున్న డిమాండ్ చేస్తున్న వారి కల ఏప్రిల్ లో నెరవేరబోతోంది. ప్రస్తుతం లోయలోని సంగల్దాన్, బారాముల్లా, కాట్రా నుంచి మాత్రమే వివిధ రైలు సర్వీసులు నడుపుతారు.
రెండు దశాబ్దల కంటే ముందే ప్రారంభం..
జమ్మూకాశ్మీర్ లోని కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలను కనెక్ట్ చేయడానికి ఉద్దేశించిన ఈ రైలు ప్రాజెక్ట్ 1997 లో ప్రారంభించారు. అయితే కష్టమైన భౌగోళిక స్వరూపం, వాతావరణం ఈ ప్రాజెక్ట్ ను 27 ఏళ్ల పాటు సాగేలా చేశాయి.
ఈ ప్రాజెక్ట్ లో 119 కిలోమీటర్ల పొడవునా 38 సొరంగాలు ఉన్నాయి. వాటిలో అతిపొడవైనది 12. 75 కిలోమీటర్లు. ఇది టన్నెల్ టీ-49 గా పిలుస్తారు. ఇది దేశంలోనే అతి పొడవైన రవాణా సొరంగంగా ప్రసిద్దికి ఎక్కింది.
అలాగే ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మొత్తం 927 వంతెనలు నిర్మించాల్సి వచ్చింది. ఇవి కూడా మొత్తం 13 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. వాటిలోనే ఐకానిక్ చీనాబ్ వంతెన ఉంది. ఇది 1315 మీటర్ల పొడవు, 467 మీటర్ల ఆర్చ్ స్పాన్ ఉంది. అలాగే నదీగర్భం నుంచి ఎత్తులో చూసుకున్నట్లయితే 359 మీటర్ల ఎత్తులో ఉంది.
ఇది ప్రపంచ ప్రఖ్యాత ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ చీనాబ్ వంతెన ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆర్చ్ రైల్వే వంతెనగా రికార్డులకెక్కింది.