మణిపూర్, కాశ్మీర్ లో హింస చివరి దశలో ఉంది: ప్రధాని మోదీ
మణిపూర్ హింస, జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదం చివరి దశలో ఉన్నాయని, వాటిని అంతం చేయడానికి బహుముఖ వ్యూహాలు అమలు చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.
By : The Federal
Update: 2024-07-03 12:28 GMT
దేశాన్ని కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్న మణిపూర్, జమ్మూకాశ్మీర్ సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యసభలో ఈ అంశం గురించి మాట్లాడిన ప్రధాని, మణిపూర్ లో చెలరేగిన జాతుల హింస తగ్గుముఖం పడుతోందని, రాష్ట్రంలోని చాలా పాఠశాలలు పున: ప్రారంభం అయ్యాయని, సంపూర్ణంగా శాంతి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని సమాధానమిస్తూ, మణిపూర్‌లో 500 మందికి పైగా అరెస్టు చేశామని, 11,000 మందికి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు.
రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతరులతో కలిసి పనిచేస్తోందని ఆయన తెలిపారు. మణిపూర్ కూడా వరద పరిస్థితిని ఎదుర్కొంటుందని ప్రస్తావిస్తూ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్)కి చెందిన రెండు బృందాలను కేంద్రం, రాష్ట్రానికి పంపిందని మోదీ చెప్పారు.
చివరి దశలో జమ్మూ, కాశ్మీర్ లో ఉగ్రవాదం..
జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉగ్రవాదం చివరి దశలో ఉందన్నారు. మిగిలిన ఉగ్రవాద నెట్ వర్క్ ను నాశనం చేయడానికి బహుముఖ వ్యూహాలను అవలంభిస్తున్నామని మోదీ వివరించారు.
గడిచిన 10 ఏళ్లలో కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని ప్రధాని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం అంతం అవుతున్నాయని, జమ్మూ కాశ్మీర్ పౌరులు ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారని ఆయన అన్నారు.
“జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా పోరాటం, చివరి దశలో ఉంది. అక్కడ మిగిలిపోయిన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అంతమొందించేందుకు బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నాం’’ అని మోదీ అన్నారు.
కాశ్మీర్‌లో పర్యాటకం పుంజుకుంది
గత కొన్ని దశాబ్దాలుగా షట్‌డౌన్‌లు, సమ్మెలు, ఉగ్రవాద బెదిరింపులు, పేలుళ్లకు పాల్పడే ప్రయత్నాలు ప్రజాస్వామ్యంపై చీకటి నీడలా కమ్ముకున్నాయని ప్రధాని అన్నారు. “ఈసారి, ప్రజలు రాజ్యాంగంపై అచంచల విశ్వాసంతో తమ విధిని నిర్ణయించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ఓటర్లను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను' అని ఆయన అన్నారు. పర్యాటక కార్యకలాపాలు పెరుగుతున్నాయని, అవి కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయని, పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు.
ఓటింగ్ గణాంకాలు
జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ గణాంకాలు గత నాలుగు దశాబ్దాల రికార్డులను బద్దలు కొట్టాయని మోదీ హైలైట్ చేశారు. “వారు భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని, భారత ఎన్నికల సంఘాన్ని అంగీకరించారు. ఇది భారీ విజయం'' అని అన్నారు.
ఆగష్టు 2019 లో, BJP నేతృత్వంలోని NDA ప్రభుత్వం రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసింది, ఇది జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను మంజూరు చేసింది (ఇప్పుడు లడఖ్ జమ్మూ- కాశ్మీర్ యొక్క UTలుగా విభజించారు).
దర్యాప్తు సంస్థలకు "పూర్తి స్వేచ్ఛ"
అవినీతి, నల్లధనం గురించి మాట్లాడుతూ, అణిచివేతలను కొనసాగించాలని ఆయన ప్రతిజ్ఞ చేశారు, అవినీతిపరులపై బలమైన చర్య తీసుకోవడానికి దర్యాప్తు సంస్థలకు ప్రభుత్వం "పూర్తి స్వేచ్ఛ" ఇచ్చిందని అన్నారు.ఎవరినీ విడిచిపెట్టేది లేదని ప్రధాని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా చర్య తీసుకోవడం ఎన్‌డిఎ ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల లాభాలకు సంబంధించిన విషయం కాదని మోదీ చెప్పారు.
" అవినీతిపరులు చట్టం నుంచి తప్పించుకోలేరు"
“అవినీతి, అవినీతికి వ్యతిరేకంగా బలమైన చర్య తీసుకునేందుకు ఏజెన్సీలకు నేను పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని సంకోచం లేకుండా చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోదు’’ అని ప్రధాని అన్నారు. “అవును, వారు (ప్రోబ్ ఏజెన్సీలు) నిజాయితీగా పని చేయాలి. అవినీతిలో కూరుకుపోయిన ఏ వ్యక్తి కూడా చట్టం నుంచి తప్పించుకోలేడు. ఇది మోదీ హామీ’’ అని ప్రధాని అన్నారు.
యూపీఏ హయాంలో సీబీఐ
ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్న ప్రతిపక్ష సభ్యుల ఆరోపణను ప్రస్తావిస్తూ, యుపిఎ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను ఉపయోగించుకుందని ఆరోపించిన దివంగత ములాయం సింగ్ యాదవ్ వంటి ప్రతిపక్ష నాయకులు చేసిన ప్రకటనలను మోదీ ఉదహరించారు. సుప్రీంకోర్టు కూడా సీబీఐని పంజరంలో బంధించిన చిలుకగా అభివర్ణించిందని ఆయన అన్నారు.
కాంగ్రెస్, ఆప్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై సాక్ష్యాధారాలతో మొదట తీవ్రమైన ఆరోపణలు చేసి, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నందుకు కాంగ్రెస్‌పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ రుజువులు నిజమో, అబద్ధమో కాంగ్రెస్ ఇప్పుడు సమాధానం చెప్పాలని అన్నారు.
“AAP మద్యం కుంభకోణానికి పాల్పడుతుంది, AAP అవినీతికి పాల్పడుతుంది, AAP పిల్లల కోసం తరగతి గదులు నిర్మించడంలో స్కామ్‌కు పాల్పడుతుంది, AAP నీటి కుంభకోణానికి కూడా పాల్పడుతుంది... ఇలా అనేక అంశాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆప్ పై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఆప్‌ని కోర్టుకు లాగింది. వారి పై చర్య తీసుకుంటే, ఇప్పడు ఇద్దరు కలిసి మోదీని దుర్భాషలాడారు” అని ప్రధాని అన్నారు. ఇప్పుడు ఆప్, కాంగ్రెస్‌లు భాగస్వాములుగా మారాయని, కాంగ్రెస్ నుంచి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
"అవినీతిపై చర్యలు మా లక్ష్యం"
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని, అవినీతి, నల్లధనంపై చర్యలు తీసుకుంటామని మోదీ హామీ ఇచ్చారు. “అవినీతిపై తగిన చర్య తీసుకోవడమే మా లక్ష్యం. ఎన్నికల్లో గెలుపు ఓటము అనేది మాకు ముఖ్యం కాదు' అని ప్రధాని ఉద్ఘాటించారు.