ఢిల్లీ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం రావాలని కోరుకున్నాం: సీతారామన్
ఆర్బీఐ డైరెక్టర్ల సమావేశంలో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి;
By : The Federal
Update: 2025-02-08 09:55 GMT
ఢిల్లీ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం రావాలని తాము కోరుకున్నామని ఎన్నికల్లో ప్రజలు అదే రకమైన తీర్పు ఇచ్చారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీ పీఠంపై దాదాపు 27 సంవత్సరాల తరువాత కమల పతాకం ఎగిరింది. దీనిపై కేంద్ర మంత్రి స్పందించారు.
రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత సీతారామన్ విలేకరులతో మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి దేశ రాజధాని ప్రాంతంలో దాని ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని తాను కోరుకున్నాని చెప్పారు.
‘‘ ప్రధాని మోదీ నాయకత్వంలో ఢిల్లీ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం రావాలని మేము చాలా కోరుకుంటున్నాం. అది జరిగిందని తెలిసి సంతోషంగా ఉంది’’ అన్నారు.
ప్రధానమంత్రి దేశం కోసం నిర్దేశించిన రోడ్ మ్యాప్ కచ్చితంగా ఢిల్లీని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని, మానవ అభివృద్ది సూచిక సహా సంబంధిత అన్ని సమస్యలకు, ప్రాథమిక మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రజల ఆరోగ్య సంరక్షణకు అన్ని కోణాల నుంచి ప్రజలకు సేవ చేయాలని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని మంత్రి అన్నారు.