జ్ఞానవాపీ వజుఖానాను కూడా సర్వే చేయిస్తాం: హిందూపక్ష లాయర్
జ్ఞానవాపీ కేసులో వజుఖానా ప్రాంతాన్ని కూడా త్వరలోనే సర్వే చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని లాయర్ విష్ణుకుమార్ జైన్ ప్రకటించారు.
వారణాశిలోని జ్ఞానవాపీ మసీదు కింద ఒకప్పుడు గుడి ఉందని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) నివేదిక స్పష్టం చేసిందని, అయితే సీల్ చేసిన వజుఖానాపై కూడా కోర్టులో కేసు వేసి సర్వే చేయిస్తామని ఈ కేసులో హిందూ పక్షాల తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ విష్ణుకుమార్ జైన్ ప్రకటించారు.
ప్రస్తుతం మసీదు గా చెబుతున్న ప్రాంగణంలో దేవీ,దేవతల విగ్రహలు ఉన్నాయని, అలాగే పాత గుడికి సంబంధించిన అనేక అవశేషాలు ముఖ్యంగా పియర్స్ కోసం పాత గుడి రాతి స్తంభాలను వాడినట్లు కూడా నివేదికలో పొందుపరిచారని ఆయన వెల్లడించారు.
కోర్టుకు ఏఎస్ఐ సమర్పించిన 839 పేజీల నివేదిక లోని పలు విషయాలను ఆయన వెల్లడించారు. 17 శతాబ్దంలో ఇక్కడున్న ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేశాక పర్షియన్ భాషలో ‘మహముక్తి’ చేశామని రాసిన ఒక రాయి సైతం కనుగొనబడిందని వివరించారు.
ఇక్కడ ఒకప్పుడు గుడి ఉండేదని గ్రౌండ్ పెనిట్రింగ్, రాడార్ సర్వే ద్వారా శాస్త్రీయంగా నిరూపితమైందని ఆయన అన్నారు. ప్రస్తుతం జ్ఞానవాపీ మసీదు పశ్చిమభాగం లో ఉన్న గోడ మొత్తం కూడా హిందూ గుడి అవశేషాలే అని ఆయన పేర్కొన్నారు. పాత గుడి గోడను అలాగే ఉంచి దానిపై మసీద్ గుమ్మటాలు కట్టారని చెప్పారు. ఇప్పటికి వాటిపై పెద్ద గంట గుర్తులు, స్వస్తిక్ చిహ్నలు బయటకు కనిపిస్తున్నాయని చెప్పారు.
గుడిలోని అవశేషాలను చూసినట్లు అయితే ఉత్తర భారతంలో కనిపించే నగారా శైలిలో ఉన్నాయని ఇది కచ్చితంగా అక్రమ నిర్మాణమేనని అన్నారు. ఇవన్నీ కూడా ఒకటే చెబుతున్నాయని, ఒకప్పుడు ఇక్కడ హిందూవులు పవిత్రంగా చూసే కాశీ విశ్వేశ్వరుని గుడి ఉండేదని, దానిని మొఘల్ మతోన్మాద ఔరంగజేబు ధ్వంసం చేశాడనే సత్యం ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపితమైందని అన్నారు.
ఈ నివేదిక ఇరుపక్షాలకు చెందిన 11 మంది పిటిషన్ దారులకు కోర్టు త్వరలో అందించనుంది. ఫిబ్రవరి ఆరున తదుపరి విచారణ ఉందని, ఆ సందర్భంగా ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామని ఆయన వెల్లడించారు.
జ్ఞానవాపీ కట్టడంలోని ఉన్న శృంగార గౌరి సహ ఇతర దేవతా ప్రతిమలకు పూజ చేయడానికి అనుమతి ఇవ్వాలని యూపీకి చెందిన రేఖా సింగ్ అనే మహిళ తో పాటు మరో ఆరుగురు వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఏఎస్ఐ సర్వే చేసింది.
మొదట వజూఖానా(మసీదు లో నమాజ్ కు ముందు మహ్మదీయులు కాళ్లు, చేతులు కడిగే స్థలం) లోని బావిలో శివలింగాన్ని పోలిన ఆకారం ఉందని తేలింది. తరువాత దీనిని ముస్లింపక్షాలు ఫౌంటెన్ గా చెప్పాయి. అయితే దీనిపై కార్బన్ డేటింగ్ పరీక్షలు చేయాలని కింది కోర్టులు ఆదేశించగా, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. స్కంద పురాణం ప్రకారం కాశీ విశ్వేశ్వర ఆలాయనికి ఈశాన్య దిక్కులో జ్ఞానవాపీ అనే బావి ఉంటుంది. వాపీ అంటే సంస్కృతంలో బావి అని అర్థం.
కాశీ ఆలయం చాలా సార్లు ధ్వంసం చేయబడినట్లు కాశీ చరిత్రలో నిక్షిప్తమైంది. మొదట బానిస వంశం స్థాపించిన కుతుబుద్దీన్ ఐబక్, కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. తరువాత దీనిని పున: నిర్మించారు. చివరగా 1669 లో ఔరంగబేబు ఆదేశాలతో కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని కూల్చివేసి ప్రస్తుతం ఉన్న కట్టడం నిర్మించారు. దీనిపై బ్రిటిష్ హయాంలోనే తీర్పు వచ్చింది. 1930 లో అప్పటి కోర్టు దీన్ మహ్మద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది. జ్ఞానవాపీ మసీదు అనేది అక్రమ కట్టడం అని, అది వక్ఫ్ కిందకి రాదని తీర్పు చెప్పింది.