డెలివరీ బాయ్ అవతారమెత్తి భంగపడ్డ జొమాటో సీఇవో గోయల్!

పాత "రాజు-పేద" సినిమా గుర్తుందా.. ఎన్టీరామారావు డబుల్ యాక్షన్ సినిమా. పేదల కష్టాలు తెలుసుకునేందుకు పేదోడి వేషం వేసి నానా అగచాట్లు పడతాడు. ఇప్పుడచ్చం అలాగే..

Update: 2024-10-07 12:46 GMT

పాత "రాజు-పేద" సినిమా గుర్తుందా.. ఎన్టీరామారావు డబుల్ యాక్షన్ చేసిన సినిమా. పేదల కష్టాలు తెలుసుకునేందుకు పేదోడి వేషం వేసి నానా అగచాట్లు పడతాడు. ఇప్పుడు అలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఆయనో ఫుడ్ డెలివరీ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి. సిబ్బంది కష్టాలు తెలుసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగాడు. సీఇవో వేషం నుంచి డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. ఓ అపార్ట్మెంట్లో ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లి లిఫ్ట్ నొక్కాడు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఈ సీఇవోకు నో చెప్పారు. ఫుడ్ డెలివరీ చేసేవాళ్లు సర్వీసు లిఫ్ట్ లోనో కాలినడకన మెట్లెక్కో పైకి పోవాలన్నారు. దాంతో ఆయన చేసేది లేక ఉసూరంటూ పైకెక్కి ఆహార పొట్లం ఇచ్చోచ్చేపాటికి తలప్రాణం తొక్కకి వచ్చింది. అరే.. ఇందులో ఇంత కష్టం ఉందా అని ఆశ్చర్యపోయాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆ సీఇవో పేరెన్నికగన్న జొమాటో సీఇవో. పేరు దీపీందర్ గోయల్. (Zomato CEO DEEPINDER GOYAL). డ్యూటీలో ఉండే తమ సంస్థ డెలివరీ ఏజెంట్లకు ఎదురయ్యే కష్టాలను తెలుసుకునేందుకు వెళ్లి చేదు అనుభవంతో వెనక్కి తిరిగొచ్చి తన అనుభవాన్ని Instagram, మరో సోషల్ మీడియా ఎక్స్ లో పెట్టారు.


గోయల్ తన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి డెలివరీ ఏజెంట్‌గా విధులు నిర్వహించడానికి బయలుదేరారు. ఆర్డర్‌ను కలెక్ట్ చేసుకోవడానికి ఓ మాల్‌లోకి వెళ్లారు. లిఫ్ట్‌ కాకుండా మెట్లు ఎక్కిపొమ్మని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. దీంతో చేసేది లేక మెట్లెక్కి వెళ్లారు. ఆ అనుభవాన్ని సోషల్ మీడియాలో పెడుతూ... ‘‘డెలివరీ పార్టనర్‌గా విధులు నిర్వహించిన సమయంలో నాకొక విషయం అర్థమైంది. మేం గురుగ్రామ్‌లోని ఒక మాల్‌లో హల్దీరామ్స్‌ నుంచి ఆర్డర్ కలెక్ట్‌ చేసుకోవడానికి వెళ్లాం. వేరే దారి నుంచి వెళ్లాలని నాకు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. అక్కడ ఎలాంటి ఎలివేటర్లు లేవు. ఈ విషయాన్ని కనుక్కుందామని మళ్లీ మెయిన్ గేట్ వద్దకు వచ్చాం. లిఫ్ట్‌కు అనుమతి లేదని చెప్పారు. మూడు అంతస్తులు మెట్లెక్కి వెళ్లాను. ఆర్డర్ కలెక్ట్ చేసుకునేప్పుడు కూడా మెట్లద్వారం వద్దే ఎదురు చూడాల్సివచ్చింది. పని వేళల్లో డెలివరీ పార్టనర్ల పరిస్థితులు మెరుగుపర్చడం కోసం మాల్స్‌ యాజమాన్యంతో మరింత కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రహించాను. మాల్స్‌ కూడా వారిపై మానవీయ దృక్పథంతో వ్యవహరించాలి’’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తర్వాత ఇతర ఏజెంట్లతో కాసేపు మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అయింది.

నెటిజన్ల స్పందన ఎలా ఉందంటే..
"మాల్స్ వద్దే కాదు.. కొన్ని కమ్యూనిటీల్లో కూడా మెయిన్ లిఫ్ట్ వాడేందుకు డెలివరీ ఏజెంట్లను అనుమతించరు. డెలివరీ పార్టనర్స్ కూడా అందరిలాగే మెయిన్ లిఫ్ట్ వాడేలా చూడాలి" అని నెటిజన్లు స్పందించారు.

లిఫ్ట్ లు వాడకంలో వివక్ష ఎందుకని గోయల్ ప్రశ్నించినా గెటెడ్ కమ్యూనిటీలలో ఉండే వారు మాత్రం మెయిన్ లిఫ్టుకు బదులు సర్వీసు లిఫ్టే వాడాలని తెగేసి చెబుతున్నారు. ఆమేరకు సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు కూడా ఇస్తున్నారు. గతంలో కూడా ఆయనో వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. గురుగ్రామ్ వీధుల్లో ఆర్డర్లు డెలివరీ చేస్తూ తన రైడ్‌ను ఎంజాయ్ చేశారు. వినియోగదారులకు ఫుడ్ డెలివరీ చేయడాన్ని ఇష్టపడతానంటూ తన భార్యతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు షేర్ చేశారు. అవి కూడా బాగా వైరల్ అయ్యాయి.
Tags:    

Similar News