ష్.. సార్ మద్యం సేవిస్తున్నారు, మర్యాదగా రేపు రండి!!
పరువు తీసిన తహశీల్దారు తీరు, మీడియాను చూసి పరుగో, పరుగు..;
By : The Federal
Update: 2025-08-08 04:04 GMT
సారు.. ఫీల్డ్ కి వెళ్లి అలసిపోయారు.. మందు కొడుతున్నారు, మీరెవ్వరూ డిస్ట్రబ్ చేయవద్దు.. ఇదేంటనేగా మీ అనుమానం. ఇది ఓ తహశీల్దార్ గారి నిర్వాకం.. ఆయన మద్యం తాగడానికి ఎంచుకున్న ఎత్తు ఇది.. విజయనగరం జిల్లా వంగర మండల తహశీల్దారు ఈ పనికి పాల్పడ్డారు. జనానికి సేవ చేయమని ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే ఆయన మందు కొట్టి మంచమేదో, కుర్చీ ఏదో తెలియక కింద పడి దొల్లాడుతూ గురకపెట్టి నిద్రపోయారు. బయట జనమేమో తమ సమస్యలంటూ కాగితాలు పట్టుకుని కార్యాలయం చుట్టూ తిరిగి పోతున్నారు. అసలు విషయం తెలిసి ప్రజలు కోపతాపాలతో ఆయన మీద విరుచుకుపడ్డారు. మీడియా హడా విడి చేసింది. ఇప్పుడాయనపై విచారణ జరుగుతోంది.
అసలేం జరిగిందంటే...
విజయనగరం జిల్లా వంగర మండల తహసీల్దార్ హరిరమణారావు తన చాంబర్‌ను పానశాలగా మార్చారు. ఎక్కడెక్కడికి వెళ్లి వచ్చారో గాని వస్తూ ఓ మద్యం సీసా తెచ్చుకున్నారు. పూటుగా తాగారు, తూలారు. కార్యాలయ సిబ్బందితో ‘నేను లోపలే ఉంటాను.. మీరు బయట వ్యక్తులను లోపలకు రానివ్వకుండా తాళం వేయాలి’ అంటూ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. తాగి తూలుతూ మత్తులోకి జారుకున్నారు. ఈ తతంగాన్ని వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వ్యక్తులు గమనించి మీడియాకు సమాచారం అందించారు. మీడియా సిబ్బంది అక్కడకు చేరుకుని సిబ్బందితో గది తాళాలు తీయించారు. ఊగిపోతూ కనిపించిన తహసీల్దార్‌ను చూసి అవాక్కయ్యారు.
ఇటీవల ఏఎంసీ వైస్ చైర్మన్ పదవి దక్కించుకున్న అరసాడ గ్రామానికి చెందిన లచ్చుభక్తు ధనలక్ష్మిని కలిసేందుకు గురువారం తాహసీల్దార్ తన సిబ్బందితో వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తహసీల్దార్ తన చాంబర్‌కు వెళ్లి మద్యం తాగారు. ఆఫీసు బయట జనం అర్జీలతో నిలబడి ఉన్నారు. సారు.. ఊళ్లో లేరు అని సిబ్బంది చెబుతుంటే ఎవరికో అనుమానం వచ్చి కిటికీలో నుంచి తొంగిచూశారు. అంతే అందరికీ చెప్పారు. మీడియా వాళ్లను పిలిపించారు.
తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే ఆయన బెంచీ కింద నక్కేందుకు పడరాని పాట్లుపడుతూ కిందపడిపోయారు. ఈలోగా గ్రామ రెవెన్యూ సహాయకుడు (వీఆర్ఏ) వచ్చి తహశీల్దారు హరి రమణారావును స్కూటర్ పై ఎక్కించుకుని వెళ్లిపోయారు.
ఈ విషయాన్ని ఆర్డీఓ ఆశయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్పందించారు. వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీచేశారు.
ఇదండీ సంగతి.. ఉద్యోగం వచ్చే దాకా ఓ పద్ధతి, వచ్చిన తర్వాత ఇంకో పద్ధతి..