అమరావతిలో 4,665 కోట్లతో ఐదు ఐకానిక్ టవర్లు
అమరావతి నిర్మాణం పనులకు త్వరలో టెండర్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు 45,249 కోట్ల మేర అమరావతి నిర్మాణ పనులకు సీఆర్‌డిఏ ఆమోదం లభించింది.;
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రకియ త్వరలో ప్రారంభం కానుంది. మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పట్టాలెక్కనుంది. తాజాగా రూ. 24,276 కోట్ల అమరావతి నిర్మాణ పనులకు సీఆర్‌డిఏ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం రూ. 45,249 కోట్ల పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది. ఈ నిధులతో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్లను నిర్మించనున్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సోమవారం అమరావతి నిర్మాణంపై సీఆర్‌డిఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మూడు రోజుల్లో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్ల నిర్మాణాల పనులకు సీఆర్‌డిఏ ఆమోదం లభించిందని తెలిపారు. నిర్మాణాల వివరాలను వెల్లడిస్తూ.. అమరావతిలో రూ. 10,48 కోట్లతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నామని, ఆ మేరకు సీఆర్‌డీఏ ఆమోదం లభించిందన్నారు. అసెంబ్లీ భవనానికి రూ. 765 కోట్ల పనులకు సీఆర్‌డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 4,665 కోట్లతో అమరావతిలో ఐదు ఐకానిక్ టవర్లను నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనాన్ని 103 ఎకరాల్లో దాదాపు రూ. 765 కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఏడాదిలో అసెంబ్లీ జరిగేది కేలవం 40 రోజుల నుంచి 50 రోజులు మాత్రమేనని, తక్కిన రోజుల్లో ప్రజలు సందర్శకులు అసెంబ్లీ భవనాన్ని చూడొచ్చు. అసెంబ్లీ భవనం టవర్‌ను చూడొచ్చు. టవర్‌పైకెక్కి నగరమంతా చూడొచ్చని మంత్రి నారాయణ వెల్లడించారు. దాదారు రూ. 768 కోట్లు అసెంబ్లీ భవనం టవర్ నిర్మాణానికి ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.