చంద్రబాబును అసభ్యంగా ట్రోల్ చేసిన అర్జున్ రెడ్డి అనుహ్య అరెస్ట్
జగన్ సమీప బంధువు, వైసీపీ సోషల్ మీడియాలో క్రియాశీలంగా వ్యవహరించిన అర్జున్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు
By : The Federal
Update: 2025-12-16 03:25 GMT
జగన్ సమీప బంధువు, వైసీపీ సోషల్ మీడియాలో క్రియాశీలంగా వ్యవహరించిన అర్జున్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన చంద్రబాబును, ఆయన కుటుంబసభ్యులను, పవన్ కల్యాణ్ ను ఆయన కుటుంబ సభ్యులను అసభ్యంగా ట్రోల్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీప బంధువు అర్జున్‌రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో గుడివాడ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సామాజిక మాధ్యమ విభాగంలో సజ్జల భార్గవ్‌రెడ్డితో కలిసి అర్జున్‌రెడ్డి క్రియాశీలకంగా పనిచేశారు.
చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నారా లోకేశ్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, వైసీపీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారంటూ గతేడాది నవంబరులో అతనిపై గుడివాడలో కేసు నమోదైంది. అప్పట్లో అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా, అంతలోనే విదేశాలకు పారిపోయాడు. తర్వాత పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. సోమవారం సాయంత్రం అర్జున్‌రెడ్డి విదేశాల నుంచి తిరిగి రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని గుడివాడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఏపీ నుంచి వెళ్లిన బృందాలు అతన్ని అదుపులోకి తీసుకుని సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసులు అందజేశాయి. అయితే, అర్జున్‌రెడ్డి అప్పటికే తన న్యాయవాదుల్ని ఎయిర్‌పోర్టుకు రప్పించుకున్నారు. అతనిపై ఉమ్మడి కడప సహా పలు జిల్లాల్లో కేసులున్నాయి.
వైఎస్ జగన్‌కు బాబాయి వరుసయ్యే వైఎస్ ప్రకాశ్‌రెడ్డి మనవడే అర్జున్‌రెడ్డి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్‌తో, హత్య జరిగిన రోజు రాత్రి అర్జున్‌రెడ్డికి ఫోన్ సంభాషణలు జరిగినట్లు అభియోగాలున్నాయి. ఈ అంశంపై దర్యాప్తు చేసి అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేయాలని హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ఇటీవల సీబీఐని ఆదేశించింది.
కడప విమానాశ్రయంలో మరో వైసీపీ కార్యకర్త ...
ఇదే సమయంలో ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త బత్తల శ్రీనివాసులురెడ్డిని కడప విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బద్వేలు నియోజకవర్గానికి చెందిన శ్రీనివాసులురెడ్డి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేసినట్టు సమాచారం.
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీనివాసులురెడ్డి గల్ఫ్‌కు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం తిరిగి రాగా కడప విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.