ఏఎస్సై కుమారుడని.. కార్ల చోరీ కేసును కప్పిపుచ్చారా?

పల్నాడులో కార్ల దందా కలకలం: పోలీసులు, నేతలే ఖరీదైన కార్ల కొనుగోలుదారులా?

Update: 2025-12-15 10:42 GMT
పోలీసులు, నేరస్తులు చేతులు కలిపితే ఏమవుతుందో ఇటీవల బయటపడిన కార్ల చోరీ కేసు అద్దం పడుతోంది. పల్నాడు జిల్లాలో వెలుగు చూసిన కార్ల దొంగతనాల కేసు ఇప్పుడు పోలీస్ శాఖ గుండెల్లోనే కార్లు పరిగెత్తిస్తోంది. 'మన ఏఎస్సై కుమారుడే కదా' అని కార్లు కొన్నవాళ్లు, అమ్మిన వాళ్లు ఇప్పుడు హడలెత్తుతున్నారు. పోలీసు అధికారి కుమారుడని నమ్మినవారికి ఇప్పుడు వెంకట నాయుడు చెమటలు పట్టిస్తున్నాడు.

డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్సైగా పని చేసిన శ్రీను కుమారుడు వెంకట నాయుడు. ఇతని నేతృత్వంలోని ముఠా- తెలంగాణలో అపహరించిన ఖరీదైన కార్లను- పల్నాడు జిల్లాలో తక్కువ ధరకే విక్రయించినట్లు, వాటిని పలువురు పోలీసులు, రాజకీయ నాయకులు కొనుగోలు చేసినట్లు బయటపడింది. దీంతో ఈ కేసు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సంచలనంగా మారింది.
ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందన్న భయంతో కొందరు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని సమాచారం. ఎలాగైనా ఈ కార్ల వ్యవహారం బయటకు రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చిలకలూరిపేట వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో నిందితులను రిమాండ్‌కు పంపించడంతో కథను ముగించాలని కొందరు పోలీసులే రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకే ముఠా.. వందల కార్లు…
అరెస్టైన వెంకటనాయుడు బృందంలో అయిదుగురితో పాటు నకరికల్లు మండలం నర్సింగపాడు చెందిన భాను, నరసరావుపేటలో నివసిస్తున్న అంజి కలిసి తెలంగాణలో వందల కార్లు అపహరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కార్లను పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, వారి అనుచరులకు విక్రయించినట్లు తెలుస్తోంది. సస్పెండైన ఎస్సై రహ్మతుల్లా వద్ద నాలుగు కార్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గుంటూరులోని ఓ షెడ్డులో విక్రయానికి సిద్ధంగా ఉంచిన తొమ్మిది కార్ల జాడ కూడా దొరికింది.
నకరికల్లు మండలం త్రిపురాపురానికి చెందిన వ్యక్తి పేరుతో ఫాస్ట్‌ట్యాగ్‌లు తీసుకుని వాహనాల్లో తిరిగినట్లు టోల్‌గేట్ డేటా ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని పిలిపించి విచారించారు. ముఠాలో కీలక సభ్యులైన భాను, అంజిలు ఇంకా పరారీలో ఉన్నారు.
ఏఎస్సైకి నిందితుడితో నేర సంబంధాలా?
విశ్వసనీయ సమాచారం ప్రకారం చిలకలూరిపేట ఎస్సై రహ్మతుల్లాకు ప్రధాన నిందితుడు వెంకటనాయుడు ముఠాతో నేర సంబంధాలు ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. కాల్‌డేటా విశ్లేషణలో వెంకటనాయుడితో పాటు ముఠాలోని మరో ఇద్దరితో ఎస్సై రహ్మతుల్లా ఫోన్ సంభాషణలు జరిపినట్లు గుర్తించారు. ఈ నెల 4న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సమయంలో తన పరిధి కాకపోయినా రహ్మతుల్లా ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఫోన్ లొకేషన్ డేటా స్పష్టం చేస్తోంది.
రోడ్డు ప్రమాదంతో బయటపడిన నేర చిట్టా..
అయ్యప్ప మాలలు ధరించిన విజ్ఞాన్ యూనివర్శిటీ విద్యార్థులు ఆరుగురు భజనకు వెళ్తుండగా నాదెండ్ల మండలం గణపవరం బైపాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. కంటెయినర్‌ను ఢీకొట్టిన కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదమే వెంకటనాయుడు ముఠా నేర సామ్రాజ్యానికి తెరతీసింది. ప్రమాదానికి కారణమైన కారు, దాని వెనుక ఉన్న అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
పోలీసులే అండగా నిలిచారా?
వెంకటనాయుడు ముఠా జాతీయ రహదారుల వెంబడి అక్రమ వసూళ్ల దందా నడిపిందని, ఇందుకు కొందరు సీఐలు, ఎస్సైలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అండగా నిలిచారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కార్లను ఎరగా వేసి పోలీసు అధికారులను తమవైపు తిప్పుకున్నారని, దొంగతనాల విషయం బయటకు రాకుండా ఉన్నతాధికారులతో బేరసారాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గురజాల సబ్‌డివిజన్ పరిధిలోని ఓ సీఐకి రెండు కార్లు, ఎస్పీ కార్యాలయంలో పని చేసే ఓ సీఐకి ఒక కారు, చిలకలూరిపేట ఎస్సై రహ్మతుల్లాకు రెండు కార్లు తక్కువ ధరకు విక్రయించినట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. ఏఎస్సై కుమారుడి ఇంటివద్ద ఐదు కార్లు ఉండేవని, ఘటన తర్వాత అవి మాయమైనట్లు అధికారులు గుర్తించారు.
తండ్రి పాత్రపై విచారణ ఉంటుందా?
మరోవైపు డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్సైగా పనిచేస్తున్న ప్రధాన నిందితుడి తండ్రి శ్రీనును వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. కానీ కుమారుడి నేర సామ్రాజ్యంలో తండ్రి పాత్ర ఏమిటి? ఆయనకు ఎంతవరకు సమాచారం ఉంది? అన్న అంశాలపై విచారణ జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
వెంకటనాయుడు ముఠా అరాచకాలు పూర్తిస్థాయిలో బయటపడాలంటే సిట్ లేదా సీఐడీతో సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేనిపక్షంలో ఈ కేసు కూడా రోడ్డు ప్రమాదాల జాబితాలో చేరిపోయే ప్రమాదం ఉంది.
ఈ కేసు ఒక కారు దొంగతనాల వ్యవహారమే కాదు. ఇది పోలీసు వ్యవస్థలోని లోపాలు, నేర, అధికారాల కుమ్మక్కు, బాధ్యతారాహిత్యానికి అద్దం పట్టే ఘటనగా మారుతోంది.
Tags:    

Similar News