ఉపయోగించే ఇస్త్రీ పెట్టెలు, బల్లలు వంటి సామానంతా తడిచి పోయాయి. అన్నీ పాడైపోయాయని ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగించే గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నుంచి గురువారం వరకు ఆరు రోజుల పాటు వదర నీటిలో ఉండటంతో పాడై పోయాయి. వాసన పట్టేసింది. బట్టలు కూడా పనికి రాకుండా పోయాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు ఇద్దరు పిల్లలని పని కడుపు కూటి కోసం పని చేసుకునే ఇస్త్రీ సామానంతా ముగిని పోవడంతో కుటుంబ పోషణ ఎలా చేయాలనేది అర్థం కావడం లేదని, దిక్కుతోచని స్థితిలో ఉన్నామని చెప్పారు.
కట్టు బట్టలతో కట్టపైకి వచ్చేశామని చెదల మందు కొట్టే పనికెళ్లే సర్థార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కష్టపడి కొనుకున్న ఫ్రెజ్ ఒక్కటే కట్ట మీదకు తెచ్చుకుని కాపాడుకోగలిగాము. మంచాలు, పరుపులు, దుప్పట్లు, బియ్యం, పప్పులు, వంట సామాను, టీవీ అన్నీ వరదలో మునిగి పోయాయి. రోజూ కూలీకెళ్తే వచ్చే సంపాదనతో తన ఇద్దరి పిల్లలను చదివించుకుంటూ, కడుపు మాడ్చుకొని వస్తువులు కొనుకున్నాం. ఇప్పుడు అవన్నీ పనికి రాకుండా పోయాయి. ఏమీ చేయాలో అర్థం కావడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే దుర్గారావు పరిస్థితి అయితే ఇంకా దారుణం. కట్టు బట్టలే మిగిలాయి. ఇంట్లో ఫ్రెజ్, మంచాలు, బట్టలు, బియ్యం, పప్పులు, సరుకులు, ఏమీ సామాను కట్టపైకి తెచ్చుకోలేక పోయమని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇన్ని నీళ్లు వస్తాయనుకోలేదు. రక్షణ గోడ కట్టారనే ధైర్యంతో ఉన్నాం. అందుకే సామాను కట్టపైకి తీసుకొని రాలేక పోయాం. చివరికి అదే కొంప ముంచింది. కళ్ల ముందే వరద నీరు వచ్చి పడి పోయింది. ఎందుకైనా మంచిదని కొంత సామాను ఇంట్లో అరలపైన సర్థుకున్నాం. అవి కూడా తడిచి పోయాయని ఆదేవన వ్యక్తం చేశారు.
రీటైనింగ్ వాల్ ఉంది కదా. వరద రాదనుకున్నాం. సామాను తీసే వాళ్లు ఉండి కూడా కట్టపైకి తెచ్చుకోలేక పోయామని కూలీ పని చేసుకునే దేవ కన్య చెప్పారు. మంచాలు, ఫ్రెజ్‌లు, బట్టలతో సహా అన్నీ పోగొట్టుకున్నాం. ఎప్పుడు ఇలాంటి వరద లేదని, కూలీ పనులకెళ్లి కష్టపడి సమకూర్చుకున్న సామానంతా ఒక్క సారిగా తడిచి ముద్దై పోవడంతో ఏమి చేయాలో అర్థం కావడం లేదని ఆదేవన వ్యక్తం చేశారు.
ఇది విజయవాడ నగరంలో వదర ముంపునకు గురైన భూపేష్ గుప్తా నగర్, తారకరామ నగర్ వాసుల ఆవేదన. కృష్ణా నది వరద ముంపునకు గురి కావడంతో ఈ కాలనీ వాసుల జీవనం అస్తవ్యస్తంగా మారి పోయింది. హృదయ విదారక పరిస్థితులు ఏర్పడ్డాయి. గీతా నగర్ నుంచి వారధి వరకు ఈ కాలనీలు విస్తరించి ఉంటాయి. దాదాపు 10వేల కుటుంబాలకు పైగా నివసిస్తుంటారు. రెక్కాడితే డొక్క నిండని బక్క జీవులు. అందరూ చిన్నా చితకా పనులు చేసుకొని జీవనం సాగించే వారే. కొంత మంది ఆటోలు నడుపుకొని జీవన సాగిస్తుండగా, ఎక్కువ మంది రోజు వారీ కూలీలుగా పనులకు వెళ్తుంటారు. వచ్చిన కూలీలతో తమ పిల్లలను చదివించుకుంటూ కాస్తో కూస్తో కూడబెట్టుకున్న డబ్బులతో చిన్న చిన్న ఇళ్లు కట్టుకొని జీవనం సాగిస్తుంటారు. ఈ వరదల వల్ల ప్రతి ఇంట్లో రూ. 50వేల నుంచి రూ. లక్ష వరకు నష్టం వాటిల్లి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
భూపేష్ గుప్తా నగర్ కృష్ణా నది వరదలో ముంపునకు గురైతే తారకరామ నగర్ వాసుల పరిస్థితి ఇంకా దారుణం. మురుగు నీరుతో ఇళ్లు మునిగి పోయాయి. రాణిగారి తోటతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు తారకరామ నరగ్‌లో తాండం చేయడంతో ఇళ్లన్నీ మురుగు కూపాలుగా మారి పోయాయి. ఈ సారి వరదల వల్ల ఏమీ పైకి తెచ్చుకోలేక పోయామని, చివరికి ఏడో తరగతి చదువుతున్న తన మనవడి పుస్తకాలు కూడా కాపాడుకోలేక పోయామని తారకరామ నగర్‌కు చెందిన కృష్ణారావు ఆదేవన వ్యక్తం చేశారు.