ఏపీలో ఉప ఎన్నికలు.. నామినేటెడ్ పోస్టుల హడావిడి షురూ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ఎన్నికలు సిద్ధమవుతోంది. అవే ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇప్పటికే వీటి షెడ్యూల్ కూడా విడుదలైపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ఎన్నికలు సిద్ధమవుతోంది. అవే ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇప్పటికే వీటి షెడ్యూల్ కూడా విడుదలైపోయింది. ఎమ్మెల్యే కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అతి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు సీట్లకు భారీ పోటీ నెలకొంది. అనేక మంది నేతలు తమకు టికెట్ ఇవ్వాలంటే తమకే టికెట్ ఇవ్వాలంటూ పోటీ పడుతున్నారు. దీంతో ఈ ఉపఎన్నికలు టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిలా మారుతున్నాయి. రెండు సీట్లకే ఉపఎన్నికలు జరగనుండగా పోటీ పడుతున్న నేతలు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నారు. దీంతో సీట్లు ఎవరికి ఇవ్వాలి అన్న అంశంపై పార్టీ అధిష్టానం తర్జనబర్జన పడుతోంది. ఇప్పటికే ఈ విషయంపై పార్టీ పెద్దలతో కూడా చంద్రబాబు చర్చలు చేస్తున్నట్లు సమాచారం.
అందుకేనా ఇంత పెద్ద క్యూ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ.. జనసేన, బీజేపీలతో కూటమి కట్టింది. దీంతో అనేక సీట్లలో మూడు పార్టీల నుంచి భారీగా ఆశావాహులు బయటకు వచ్చారు. వారిలో కొందరు టికెట్ కోసం పార్టీ జంప్ కాగా మరికొందరు పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేసి మిన్నకుండిపోయారు. మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో ఆ సమయంలో టికెట్ లభించలేదని ఎవరూ భంగపడొద్దని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా తాము చూసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తమ పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. అదే ఇప్పుడు వాళ్లకు తలనొప్పులు తెచ్చిపెట్టాయినిపిస్తోంది. ఎందుకంటే త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న రెండు ఎమ్మెల్సీ సీట్ల టికెట్ కోసం భారీ సంఖ్యలో హేమాహేమీలు సైతం పోటీ పడుతున్నారు.
టీడీపీకే ఛాన్స్
రెండు స్థానాలకే ఉపఎన్నికలు జరగనున్న క్రమంలో కూటమిలో ఉన్న మూడు పార్టీల్లో ఏ పార్టీ ఈ సీట్లకు కైవసం చేసుకుంటుందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే సంఖ్యాబలం ప్రకారం చూస్తే ఈ రెండు సీట్లు కూడా టీడీపీ సొంతం అవుతాయని అర్థమవుతోంది. అందుకే ఈ అంశంపై జనసేన, బీజేపీ నేతలు అసలు మాట్లాడటం లేదని, టికెట్ కోసం పోటీ కూడా పడటం లేదని విశ్వసనీయ వర్గాలు చెప్తున్న మాట. తర్వాత జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు పార్టీ నేతలకు పూర్తి న్యాయం జరుగుతుందని మరోసారి తమ పార్టీ నేతలకు కూటమి పార్టీలు భరోసా కల్పిస్తున్నాయని తెలుస్తోంది. జనసేనలో నాదెండ్ల మనోహర్ ఇదే పనిలో ఉన్నారని, అందుకే పార్టీ నేతలతో ఒక మీటింగ్ కూడా నిర్వహించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
అసలెందుకీ ఉపఎన్నిక
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయింపులు భారీగానే జరిగాయి. అందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్సీలు మహ్మద్ ఇక్బాల్, సీ రామచంద్రయ్యలు.. వైసీపీకి టాటా చెప్పి సైకిల్ ఎక్కేశారు. పార్టీ ఫిరాయించిన కారణంగా శాసనమండలి అధ్యక్షుడు వారిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేశారు. రద్దు వల్ల శాసనమండలిలో రెండు స్థానాలు ఖాళీ కావడంతో వాటి భర్తీ కోసం ఉపఎన్నిక నిర్వహించాలని నిశ్చయించారు. ఈ ఉపఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఇప్పుటు ఆ రెండు స్థానాల టికెట్ రేస్ జోరుగా సాగుతోంది. ఈ రెండు సీట్లు టికెట్ ఇచ్చే విషయంలో టీడీపీ ముఖ్యంగా కొందరికి పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది.
వారికే ప్రాధాన్యత
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి కోసం తమ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్‌ను త్యాగం చేసిన నేతలకే టీడీపీ ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగానే ఈ రెండు టికెట్లలో ఒకదానికి పిఠాపురం టీడీపీ నేత శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడు వర్మ.. కూటమి గెలుపుకోసం పాటుపడుతూ తాను టికెట్ ఆశించకుండా ఒక నేతగానే పవన్ గెలుపుకు తన పూర్తి సహకారం అందించారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ల విషయంలో పెద్దపీట వేయాలని టీడీపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మళ్ళీ వారికే అవకాశం!
రెండు సీట్ల కోసం భారీ పోటీ జరుగుతున్న వేళ మరో వాదన కూడా జోరుగా సాగుతోంది. ఏ ఇద్దరు నాయకులైతే టీడీపీలో చేరడం వల్ల ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయో మళ్ళీ వారికే అవకాశం కల్పించాలని కూడా టీడీపీ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై టీడీపీ ఇప్పటివరకు ఏ విషయం చెప్పలేదు. కానీ ప్రస్తుతానికి ఈ రెండు సీట్ల కోసం జరుగుతున్న రేసులో వర్మతో పాటు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, రావి వెంకటేశ్వరరావు, దేవినేని ఉమ, ముద్రబోయిన వెంకటేశ్వరావు ఉన్నారు. మరి వీరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.