2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు

2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆంధ్ర హైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Update: 2024-03-13 08:13 GMT
Source: Twitter

2018లో ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్‌సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష విషయంలో ఆంధ్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ పరీక్షను, పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2018 గ్రూప్-1 పరీక్షల జవాబు పత్రాల మాన్యువల్ విధానంలో అవకతవకలు జరిగాయంటూ కొందరు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. జవాబు పత్రాలను రెండు సార్లు దిద్దారని, తొలిసారి వచ్చిన మార్కులను తొక్కి పట్టి రెండోసారి, మూడోసారి పత్రాలను మూల్యాంకనం చేసి నచ్చిన వారికి ఎక్కువ మార్కులు వేశారని పలువురు ఆరోపించారు. తమకు నచ్చిన వారిని ఎంపిక చేస్తూ గ్రూప్-1 పరీక్షల ఫలితాలను విడుదల చేసిందని ఆరోపిస్తూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం దీనిపై విచారణ ప్రారంభించింది.

ఈ కేసులో హైకోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించింది. మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని న్యాయస్థానం తెలిపింది. అనంతరం 2018 గ్రూప్-1 పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ ఆ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, ఈ పరీక్షకు ఎంపిక ప్రక్రియ ఆరు వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆందోళన వద్దు

2018 పరీక్షను రద్దు చేయడంతో అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ఉద్యోగాలు చేస్తున్న వారి ప్రయోజనాలను తాము కాపాడతామని, వారి తరపున ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. హైకోర్టు తీర్పుపై పైకోర్టులో అప్పీలు చేస్తామని, ఈ పరీక్ష ద్వారా ఎంపికైన వారి ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Tags:    

Similar News