అబ్బబ్బా.. నెల రోజుల్లో ఇంత మందెలా తాగార్రా అయ్యా!

మన దేశంలో సాధారణ సమయాల్లో అత్యధికంగా మందు తాగే రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఈ ఎన్నికల సమయంలో అక్కడ ఏప్రిల్ ఒక్క నెలలోనే దాదాపు 300 కోట్ల విలువైన మందును..

Update: 2024-05-24 11:42 GMT

మన దేశంలో సాధారణ సమయాల్లో అత్యధికంగా మందు తాగే రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఈ ఎన్నికల సమయంలో అక్కడ ఏప్రిల్ ఒక్క నెలలోనే దాదాపు 300 కోట్ల విలువైన మందును తాగేశారని అనధికారిక లెక్కలు చెప్తున్నాయి. అయితే మందు తాగడంలో ఆంధ్రప్రదేశ్.. అరుణాచల్ ప్రదేశ్ తలదన్నేలా తయారైంది. ఏప్రిల్ ఒక్క నెలలోనే ఆంధ్రలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో సుమారు 2860 లారీలా మద్యాన్ని ఖాళీ చేశారు మందుబాబులు. దీని విలువ సుమారు రూ.325 కోట్ల నుంచి రూ.400కోట్లు ఉంటుందని అనధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఏంటి నమ్మడం లేదా.. ఇవన్నీ ఉత్తుత్తి లెక్కలనుకుంటున్నారా. కాదండీ బాబూ.. ఇవన్నీ ఈ ఏప్రిల్‌లో మన మందుబాబులు సాధించిన రికార్డులే. ఉదాహరణకు నెల్లూరు జిల్లాను తీసుకుంటే.. అక్కడ ఏప్రిల్ ఒక్క నెలలో 221 లారీల మద్యం తాగేశారంట. ఈ మద్యంపై నెల్లూరు మహిళలు గతంలో పెద్ద పోరాటమే చేశారు. ఆ నెల్లూరులోనే ఇప్పుడు ఈ రేంజ్‌లో మద్యం ఏరులై పారుతుంటే ఏమీ చేయలేక వాళ్లు బాధ పడుతున్నారు. గత ఎన్నికల్లో సీఎం జగన్‌కు అధికారం తెచ్చిపెట్టిన వజ్రాయుద్ధం కూడా ఈ మద్య నిషేధమే. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం మందుబాబులు మద్యాన్ని మంచీళ్ల ప్రాయంగా.. కాదుకాదు.. అంతకన్నా దారుణంగానే తాగేశారు.

వద్దురా నాయనా.. అన్నా వినలేదుగా..

‘ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో ఫ్రీగా వచ్చిందనో, నా డబ్బు నా ఇష్టం అనో మద్యం తాగొద్దు. దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వడదెబ్బ తగిలే అవకాశాలు అధికంగా ఉంటాయి. మద్యానికి బదులు జూసులు, రసాలు వంటివి తాగండి. మద్యం తాగి అనారోగ్యంతో మంచాన పడి సాధించేది ఏమీ లేదు. అయినవారిని నొప్పించడం తప్పితే అంటూ ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్యులు, వైద్య శాఖలు కోడై కూశాయి. అంతేకాకుండా ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో మద్యంపై ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. కానీ ఎవరు చెప్పినా మేము వింటామా అన్నట్లు కోట్ల లీటర్ల మద్యాన్ని తాగేశారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక్క ఏప్రిల్ నెలలోనే రాష్ట్రమంతటా మద్యం వ్యాపారం ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది.

రూ.9కోట్ల నుంచి రూ.21 కోట్లు

సాధారణంగా ఒక్క నెల్లూరు జిల్లాలో నెలకు రూ.9కోట్ల మద్యం వ్యాపారం జరిగేది. కానీ ఈ ఏప్రిల్లో మాత్రం ఎన్నికల పండగ సందర్భంగా అందరూ మద్యం మత్తులో మునిగి తేలారు. ఈ ఒక్క ఏప్రిల్ నెలలోనే నెల్లూరు జిల్లాలో మూడు నెలల వ్యాపారం సాగింది. అంటే అక్షరాల రూ.21 కోట్ల విలువైన మద్యాన్ని అక్కడి ప్రజలు ఖాళీ చేసేశారు. ఈ నెల రోజుల్లో జిల్లా ప్రజలు 220 లారీల మద్యాన్ని మటుమాయం చేసేశారన్నమాట.

నెల్లూరు టౌనే నెంబర్.1

జిల్లాలో జరిగిన మద్యం అమ్మకాల్లో నెల్లూరు టౌన్ అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. ఎందులోనైనా పోటీ పోటీనే.. నెంబర్ 1 కావాల్సిందే అన్నట్లు ఏప్రిల్ ఒక్క నెలలో నెల్లూరు టౌన్‌లో 6 కోట్ల 87 లక్షల 81 వేల 701 రూపాయల మద్యం వ్యాపారం జరిగింది. ఆ తర్వాత 2 కోట్ల 12 లక్షల 68 వేల 829 రూపాయాల వ్యాపారంతో కోవూరు ఎక్సైజ్ సర్కిల్ రెండో స్థానాన్ని కౌవసం చేసుకుంది. రూ.1.51కోట్ల వ్యాపారంతో ఆత్మకూరు మూడో స్థానంలో నిలిచింది. మొత్తానికి బెంగళూరు నుంచి వచ్చిన చీప్ లిక్కర్‌తో కలుపుకుంటే.. ఏప్రిల్ ఒక్క నెలలో నెల్లూరు వాసులు రూ.25 కోట్ల విలువన మద్యాన్ని తాగేశారు.

ఇతర జిల్లాలు తక్కువేం కాదు

ఈ పరిస్థితి కేవలం నెల్లూరు జిల్లాలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర జిల్లాల్లో కూడా ఇలానే జరిగాయి మద్యం అమ్మకాలు. దాదాపు ప్రతి జిల్లా కూడా తమ రికార్డులను పటాపంచలు చేశాయి. ఎప్పుడూ లేని విధంగా లక్షల లీటర్ల మద్యాన్ని ఏరులై పారించారు ఓటర్లు. మళ్లీ మద్యం దొరకదు.. తాగేదంతా ఈ నెలలోనే తాగాలి అన్నట్లుగా మందుబాబులు మద్యం బాటిళ్లపై తమ ప్రతాపం చూపించేశారు.

ఈ బ్రాండ్‌లకే ఇలా ఉంటే..

ఈ లెక్కలను చూసిన వారు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం జగన్ పిచ్చి బ్రాండ్‌లు తెచ్చారు.. నాణ్యతలేని మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, దాంతో పాటుగా భారీగా రేట్లు పెంచేసి ప్రజలను జగన్ ప్రభుత్వం దోచుకుంటుందని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. ఇదే మాట అనేక ప్రాంతాల్లో ప్రజలు కూడా అన్న సందర్భాలు అనేకం. అయినా అలాంటి దారుణమైనా బ్రాండ్లు, ఇంత రేటు ఉంటేనే ఈ రేంజ్‌లో తాగారంటే.. అదే ఒకవేళ అవి మంచి నాణ్యమైన బ్రాండ్లు అయి ఉంటే ఇంక ఏ రేంజ్‌లో మద్యం వ్యాపారం ఉండేదని అందరూ అవాక్కవుతున్నారు. అంతేకాకుండా జగన్.. మద్యం ధరలు పెంచేశారని కూడా ప్రతిపక్షాలు హోరెత్తిస్తున్నాయి.

Tags:    

Similar News