కలిసి కట్టుగానే కూటమి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఖరారు చేశారు.;
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చాలా ఒద్దికగా అడుగులు వేస్తోంది. 2014–19 కాలంలో కూటమి కలయిక మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలి పోయినా.. ఈ సారి మాత్రం కూటమి బలం చాలా దృఢంగానే కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల కేటాయింపులు, సర్దుబాట్ల నుంచి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవుల కేటాయింపుల వరకు ఎలాంటి అలకలు, ఆధిపత్య దోరణులు లేకుండానే సమస్యలను పరిష్కిరించుకోగలిగారు. తర్వాత వచ్చిన రాజ్య స్థానాల విషయంలో కూడా కలిసే చర్చించుకున్నారు.. కలిసి కట్టుగానే పంచుకున్నారు.
నాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య సభ సభ్యులుగా ఉన్న బీదా మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వీరిలో టీడీపీ నుంచి బీదా మస్తాన్‌రావుకు తిరిగి రాజ్య సభ స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు మరో స్థానాన్ని సానా సతీష్‌బాబుకు కేటాయించారు. ఇక బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యను రాజ్య సభ స్థానానికి తిరిగి ఎంపిక చేశారు. అలా టీడీపీకి రెండు, బీజేపీకి ఒకటి చొప్పున రాజ్య సభ స్థానాలను కలిసి పంచుకున్నారు. అయితే ఈ మూడు స్థానాల్లో ఒక స్థానం జనసేకు కేటాయిస్తారని, తద్వారా నాగబాబును రాజ్య సభకు పంపుతారనే టాక్ వినిపించింది. అయితే అది కార్యరూపం దాల్చ లేదు.