‘ట్రిలియన్ డాలర్ల ఎకానమీ మా లక్ష్యం’.. నారా లోకేష్

ఆంధ్ర ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ ఆశయమని నారా లోకేష్ వెల్లడించారు. తమ ప్రభుత్వం వస్తే యువతకు ఉద్యోగావకాశాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Update: 2024-04-13 06:24 GMT
Source: Twitter

ఆంధ్రలో కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి జిల్లాల వారీగా పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ వాసులతో సమావేశమైన సందర్భంగా నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి విద్యావిధానంలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. అమరావతిని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. అటువంటి వ్యక్తికి ప్రజలు సరైన గుణపాఠం నేర్పాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలంతా ఏకైమై ఎన్‌డీఏ కూటమిని గెలిపించాలని కోరారు.

ట్రిలియన్ డాలర్ల ఎకానమీ

టీడీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ప్రత్యేక దృష్టి పెడుతుందని చెప్పారు లోకేష్. ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడమే కాకుండా అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర ఎకానమీని ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే టీడీపీ లక్ష్యమని లోకే ష్ వెల్లడించారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తామని, ఆంధ్ర ఆర్థిక వ్యవస్థను దేశంలోనే స్ఫూర్తి దాయకంగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

రాజధానితో మూడు ముక్కలాట

అనంతరం సీఎం జగన్‌పై లోకేష్ ధ్వజమెత్తారు. తాము తీసుకొచ్చిన అమరావతి రాజధానిని నాశనం చేసిన వ్యక్తి సీఎం జగనే అని వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో జగన్‌కే ఒక క్లారిటీ లేదని విమర్శించారు. ‘‘మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. దేశంలో గంజాయి, మాదకద్రవ్యాలకు ఆంధ్రను అడ్డాగా మార్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. పైగా ఉన్నవి కూడా రాష్ట్రాన్ని విడిచి వెళ్లాయి. కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి. ఇంటి, చెత్త పన్ను సామాన్యుడికి భారంగా మారింది’’అని జగన్ టార్గెట్‌గా లోకేష్ మండిపడ్డారు.

Tags:    

Similar News