పేర్ని కేసుపై ముగిసిన వాదనలు..30న తుది తీర్పు
మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు బెయిల్ మంజూరవుతుందా? లేదా? అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.
రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నాని భార్య పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటీషన్‌పై వాదనలు ముగిసాయి. పేర్ని జయసుధ దరఖాస్తులు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌పై మచిలీపట్నం జిల్లా కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పిటీషనర్ తరపున న్యాయవాది వరదరాజులు తమ వాదనలు కోర్టులో వినిపించారు. తమ గోడౌన్‌లో రేషన్ బియ్యం బస్తాల సంఖ్య తగ్గినట్లు మాజీ మంత్రి పేర్ని నాని గుర్తించారు. ఆ మేరకు నవంబరు 27న ప్రభుత్వానికి లేఖ రాశారు. రేషన్ బియ్యం బస్తా సంఖ్య తగ్గాయని, దీనిపై విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు. అయితే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు డిసెంబరు 3, 4 తేదీల్లో తనిఖీలు చేపట్టారు. డిసెంబరు 10న డిమాండ్ నోటీసు ఇచ్చారు. డిసెంబరు 12న కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గోడౌన్‌లో బియ్యం బస్తాలు మాయమైన విషయాన్ని తామే ముందు గుర్తించి ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేశామని, ఆ తర్వాతనే పౌరసరఫరాల శాఖ అధికారులు మేల్కొన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తూకం సమస్య కూడా తలెత్తిందని, తూకం మిషన్‌లో సాంకేతిక సమస్యల కారణంగా తూకంలో తేడాలు వచ్చాయనే విషయాన్ని కూడా కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో పిటీషనర్ పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.