చంద్రబాబువల్లే నాడు తిరుమల, నేడు సింహాచలం దుర్ఘటనలు
చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే భక్తుల మరణాలు సంభవిస్తున్నాయని, నాడు తిరుమల, నేడు సింహాచలంలో ప్రమాదాలు జరిగాయని జగన్ అన్నారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రంలోని ఆలయాల్లో ఎన్నో దుర్ఘటనలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన నిర్లక్ష్యం వల్లే తరచూ భక్తులు మరణిస్తున్నారని ధ్వజమెత్తారు. నాడు తిరుమలలో వైకుంఠ ఏకాదశి, నేడు సింహాచలం చందనోత్సవంలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించిన నేపథ్యంలో బుధవారం వారి కుటుంబాలను పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..?
మీడియాతో మాట్లాడుతున్న జగన్
వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది? చందనోత్సవం ఏరోజు జరుగుతుందో చంద్రబాబుకు తెలియదా? అయినా తగు జాగ్రత్తలు తీసుకుకోకుండా భక్తులను పొట్టన పెట్టుకుంటున్నారు. తిరుమలలో ఒక్కసారిగా గేట్లు ఎత్తివేయడం వల్ల తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులను బలిగొన్నారు. ఇప్పుడు చందనోత్సవం రోజు కూడా లక్షల మంది వస్తారని తెలిసి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. కూలిన గోడ ఆరు రోజుల క్రితం మొదలు పెట్టి నాలుగు రోజుల్లో పూర్తి చేశారు. 70 అడుగుల పొడవు గోడ 10 అడుగుల ఎత్తున కట్టిన ఈ గోడలో ఎక్కడా కాలమ్స్ లేవు. రీఇన్‌ఫోర్స్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట ఫ్లై యాష్ ఇటుకలతో కట్టారు. టెండర్లు కూడా పిలవకుండా కట్టేశారు. చందనోత్సవం జరుగుతుందని తెలిసినపపుడు ముందే ఎందుకు గోడ కట్టించలేదు? రెండు రోజుల క్రితమే గోడ పూర్తయిందని తెలుసు.. వర్షం కురుస్తుందని తెలుసు. భక్తులు ఈ గోడ పక్కనే క్యూలో నిలబడేలా ఎలా చేశారు.