వైఎస్‌ఆర్‌సీపీకి న్యాయస్థానాల్లో బిగ్ షాక్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి న్యాయస్థానాల్లో షాక్‌ తగిలింది. మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఏఏజీ సుధాకర్‌రెడ్డి పిటీషన్‌లను కొట్టేశాయి.

Update: 2024-10-14 15:06 GMT

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌ న్యాయస్థానాల్లో చుక్కెదురైంది. ఆ పార్టీకి చెందిన వ్యక్తుల పిటీషన్‌లను న్యాయస్థానాలు కొట్టేశాయి. వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ పిటీషన్‌ను గుంటూరు జిల్లా న్యాయస్థానం కొట్టివేయగా, మాజీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటీషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు డిస్మిస్‌ చేసింది.

వెలగపూడి మహిళ హత్య కేసులో నిందితుడుగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా న్యాయస్థానంలో పిటీషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం సురేష్‌ బెయిల్‌ పిటీషన్‌ను సోమవారం కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి ఇది వరకు మంగళగిరి న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించడంతో నందిగం సురేష్‌ ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్నారు.
తనకు భద్రత కల్పించాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాది, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా పని చేసిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి భద్రత కల్పించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన న్యాయస్థానం, సుధాకర్‌రెడ్డి పిటీషన్‌ను డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Tags:    

Similar News