వివేకా హత్య కేసుపై బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు
ఇప్పటికే సీబీఐ విచారణకు హాజరైన బిటెక్ రవి. తాను జైలుల్లో ఉన్నప్పుడు శ్రీకాంత్‌రెడ్డి రావడం వాస్తవమే అని విచారణలో చెప్పారు;
By : The Federal
Update: 2025-02-12 15:40 GMT
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు, మరో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు మీద టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా వేంపల్లి మండలం ముసలరెడ్డిగారి పల్లెలో మినీ గోకులం షెడ్డును ప్రారంభించిన అనంతరం బీటెక్ రవి మాట్లాడారు. వివేకా హత్య కేసులో రాజీలేని పోరాటం చేస్తున్న వివేకా కూతురు సునీత విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
వివేకా హత్య కేసులో పురోగతి కనిపిస్తోందన్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు స్పందించారని అన్నారు. దస్తగిరిని సాక్షిగా పరిగణలోకి తీసుకున్నారు.. ఇది నైతికంగా తప్పు అంటూ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డిలు పిటీషీన్ వేశారని, దీనిపైన దస్తగిరికి, సీబీఐ వాళ్లకు కూడా నోటీసులు వచ్చాయని అన్నారు. అవినాష్‌రెడ్డి, బాస్కరరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని వివేకా కూతురు సునీత సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
అయితే జగన్ ప్రభుత్వం కోర్టులను, అధికారులను తప్పు దోవ పట్టించి మోసం చేసింది. దీని వల్ల అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డిలకు బెయిల్ లభించింది. అయితే సాక్షులను ప్రభావితం చేయకూడదు, ప్రలోభాలాకు గురి చేయడకూడదు అనే కండిషన్ల మీద వారికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాజా పరిణామాలు చూస్తే.. సాక్షులను బెదిరింపులకు పాల్పడటం, ప్రలోభాలకు గురి చేయడం వంటి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కొడుకు చైతన్యరెడ్డి దస్తగిరి ఉన్న జైలుకెళ్లి దస్తగిరిని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటి మీద దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిపైన విచారణ జరుగుతోంది. చైతన్య రెడ్డి జైలుకు రావడం వాస్తవమేనని నాడు రిమాండ్ మీద జైలులో ఉన్న తాను జరిగిన విషయాలను పోలీసులకు చెప్పానని చెప్పారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ కలిసి అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డిల బెయిల్ రద్దయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని బీటెక్ రవి అన్నారు.