ఏపీ సీఎం చంద్రబాబు ప్రోగ్రాం కోఆర్టినేటర్‌కు క్యాబినెట్ ర్యాంకు
గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేక పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెందుర్తి వెంకటేశ్‌కు క్యాబినెట్ పదవి దక్కింది.
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ భలే చాన్స్ కొట్టేశారు. ఏకంగా క్యాబినెట్ ర్యాంకును దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ను కూటమి ప్రభుత్వం నియమించింది. కేవలం సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్‌గానే కాకుండా ఆయనకు ఏకంగా క్యాబినెట్ ర్యాంకు ఇచ్చింది. ఆ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కార్యక్రమాల నిర్వహణ వ్యవహారాలను పెందుర్తి వెంకటేశ్ పర్యవేక్షించనున్నారు. పెందుర్తి వెంకటేశ్ తూర్పుగోదావరి జిల్లా వాసి. సీతానగరం ఆయన స్వస్థలం. ఉన్నత విద్యావంతుడు.1988లో బీటెక్ పూర్తి చేశారు. తొలి నుంచి ఆయన టీడీపీలోనే ఉన్నారు. అదే పార్టీ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రాజానగరం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక సారి అంటే 2009, రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో మరో సారి రాజానగరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టూరి రవీంద్రపై 6,936 ఓట్లతోను, 2014లో సమీప ప్రత్యర్థి జక్కంపూడి విజయలక్ష్మిపై 8887 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మూడో సారి టీడీపీ అభ్యర్థిగా రాజానగరం నుంచి బరిలోకి దిగిన పెందుర్తి వెంకటేశ్ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. 31,772 ఓట్ల తేడాతో ఓటమిని చవి చూశారు. గత ఎన్నికల్లో ఈ సీటును పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించారు. 2024లో బత్తుల బాలకృష్ణ జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే నేటికీ ఆయనే రాజానగరం టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడుకు, ఇటు నారా లోకేష్‌కు పెందుర్తి వెంకటేశ్ నమ్మిన బంటుగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేక పోవడంతో సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా పెందుర్తి వెంకటేశ్‌కు అవకాశం కల్పించారు.