నా ఏడు ప్రశ్నలకు జవాబు చెప్తావా జగన్!

ప్రజాగళం యాత్రలో చంద్రబాబు.. సీఎం జగన్‌పైకి ఏడు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని నిలదీశారు.

Update: 2024-03-28 11:14 GMT
Source: Twitter

‘‘నా ఏడు ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పగలరా’’అని చంద్రబాబు నాయుడు ప్రశ్నాస్త్రాలు సంధించారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. రాప్తాడు నిర్వహించిన ‘ప్రజాగళం’ యాత్రలో భాగంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ పనైపోయిందని, జగన్‌ను ఇంటికి పంపడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. సీఎం జగన్.. రాళ్లసీమగా మార్చిన రాయలసీమను గోదావరి నీళ్లు తీసుకొచ్చి హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని భరోసా ఇచ్చారు. అలా చేసే బాధ్యత తనదని, గత ఎన్నికలపై ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ వాటిలో అనేక హామీలను అధికారం రాగానే అటకెక్కించేశారని ఆరోపించారు.

జగన్‌కు చంద్రబాబు ప్రశ్నలు
ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చానని చెప్పుకుంటున్న జగన్ తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని చంద్రబాబు సవాల్ చేశారు. ప్రత్యేకహోదా, సీపీఎస్ రద్దు, మద్య నిషేధం, ఏటా జాబ్ కాలెండర్, కారెంట్ ఛార్జీల తగ్గింపు, మెగా డీఎస్‌సీ, పోలవరం వంటి హామీల్లో ఎందుకు వెనకడుగు వేశారో చెప్పాలని, వీటితో పాటు మరెన్నో హామీలను కూడా ఎందుకు నెరవేర్చలేదో జగన్ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తన హయాంలో ఆంధ్రను రాజకీయ హత్యలతో సైకో రాజ్యంగా మార్చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఏం ఒరగబెట్టింది
‘‘ఎన్నికల సమయంలో అనేక బెదిరింపులు వచ్చినా, అక్రమ కేసులు నమోదయినా ఎవరూ భయపడకండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటాన్ని గుర్తుంచుకోండి. 2019 ఎన్నికల్లో రాయలసీమలో ఉన్న 52 స్థానాల్లో వైసీపీని 49 సీట్లలో గెలిపించారు. ఈ ఐదేళ్లలో వాళ్లు ఒరగబెట్టింది ఏమైనా ఉందా? వాళ్లు చేసిందల్లా లూటీ మాత్రమే. జగన్ లాంటి అవినీతి పరుడు, అసమర్థుడిని ప్రజలంతా కలిసికట్టుగా ఇంటికి పంపించేయాలి. జగన్ గూండా రాజకీయాలకు ఎవరూ భయపడకండి.. అన్నింటినీ ధైర్యంగా ఎదర్కోండి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మనం పోరాడాలి’’అని కార్యకర్తలు, ప్రజలు ఉద్దేశించి పిలుపునిచ్చారు.
జగన్‌ను నిలదీసిన బాబు
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని ఆరోపించారు చంద్రబాబు. ‘‘జగన్ పాలనలో తెచ్చిన కల్తీ మద్యం వల్ల అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. మద్యం రేట్లు కూడా విపరీతంగా పెంచారు. విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఆఖరికి ఇసుకను కూడా వదలకుండా జగన్ దోపిడీ చేశారు. జగన్ దెబ్బకు భవన నిర్మాణ రంగం కుదేలైంది. పనులు ఆగిపోవడంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో కల్లబొల్లికబుర్లు చెప్పిన జగన్.. అధికారంలోకి రాగానే వారిని నిలువునా ముంచేశారు. ఐదేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారు. 2019 ఎన్నికలప్పుడు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు. అది ఏమైంది. కేంద్రానికి మనతో అవసరం లేదు కాబట్టి ఏం చేయలేంటూ చేతులెత్తేసినట్లు చెప్పకనే చెప్పారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధిక ధరలకు కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. మద్యపాన నిషేధం చేయకుంటే 2024లో ఓట్లు అడగడానికి కూడా రానని అన్నారు. మరి ఇప్పుడు జగన్ ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. సీపీఎస్ రద్దు చేశారా? జాబ్ క్యాలెండర్ ఒక్కసారైనా విడుదల చేశారా? మెగా డీఎస్‌సీ ఇచ్చారా? పోలవరం పూర్తి చేశారా?’’ అంటూ చంద్రబాబు ప్రశ్నలు వర్షం కురిపించారు. వీటికి జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు.
Tags:    

Similar News