బాబాయినే చంపించిన నీకు ఈ పండుటాకులొక లెక్కా?
సీఎం జగన్‌పై టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్.. తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. జగన్ జీవితమంతా హత్యా రాజకీయాలు చేడమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో సంభవించిన పెన్షన్ దారుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని, వీటికి సీఎం జగన్ సమాధానం చెప్పి తీరాలంటూ తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు చంద్రబాబు. 2009లో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణిస్తే దాన్ని కూడా తన రాజకీయ లబ్ధి కోసం వినియోగించున్న వ్యక్తి జగన్ అని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. పెన్షన్ల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాక.. వారికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని దుయ్యబట్టారు. వాలంటీరు వ్యవస్థను తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు.
‘‘తండ్రి మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకున్నారు. ఆ తర్వాత 2019లొ బాబాయ్‌ను చంపేసి మళ్లీ హత్యా రాజకీయాలు చేశావు. ప్రజల దగ్గర సింపతీ కొట్టేసి సీఎం సీటు ఎక్కావ్. ఇప్పుడు పెన్షన్ దారులపైన పడ్డావా. రాష్ట్రంలో పెన్షన్‌పై భారీ కుట్రలు జరుగుతున్నాయి. వాటిలో అధికారులు కూడా భాగస్వాములు కావడం అత్యంత దుర్మార్గం. దారుణం. ఓడితామని తెలియడంతోనే జగన్ ప్రభుత్వం రూ.13 వేల కోట్లను కాంట్రాక్టర్లకు దోచి పెట్టింది. అందుకే పెన్షన్‌లు ఇవ్వడానికి వాళ్ల దగ్గర డబ్బులు లేవు. అయినా లబ్దిదారులకు పెన్షన్‌లను ఇంటికి తీసుకువెళ్లి ఇవ్వొద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదు. నిజంగా పెన్షన్లు ఇవ్వాలని కానీ, ఇవ్వడానికి నగదు కానీ ఉండి ఉంటే వాటిని ముందే విత్‌డ్రా చేసుకుని ఉంచాలి కదా? వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించుకుని తమ తరపు ప్రచారం చేయించుకోవడం కోసం వైసీపీ వాళ్లు పన్నిన పన్నాగం ఇది. మీ స్వార్థం కోసం వృద్ధులను ఇబ్బంది పెడతారా? వాలంటీర్లపై కేసులు పెడితే ఉద్యోగాలు ఎలా వస్తాయి? మీ గెలుపు కోసం వాలంటీర్లను బలి పశువులను చేస్తారా?’’అని చంద్రబాబు మండిపడ్డారు.