రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ తెస్తాం.. చంద్రబాబు కీలక హామీ

కొవ్వూరు ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక హామీలు ఇచ్చారు. రైతు కూలీలను ఆదుకోవడానికి అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ తెస్తామన్నారు.

Update: 2024-04-04 15:31 GMT
Source: Twitter

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు కూలీలను ఆదుకోవడానికి ప్రత్యేక కార్పొరేషన్ తీసుకురావడానికి వెనకాడమని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో సీఎం జగన్‌పై బాబు ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో రాష్ట్రానికి మేలేమీ జరగలేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రను వైసీపీ ప్రభుత్వం.. డ్రగ్స్, గంజాయికి అడ్డాగా మార్చిందని మండిపడ్డారు. రాష్ట్రం దుస్థితి మారాలంటే మళ్లీ కూటమి ప్రభుత్వం రావాలని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే ఆంధ్ర సంక్షేమం సాధ్యమని, వైసీపీతో కేవలం మోసపూరిత మాటలు, అంధకారమే పెరుగుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి దానిని ప్రజలకు పంచుతామని చెప్పారాయన.

రైతు కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్
‘‘కూటమి ప్రభుత్వం వస్తే రాష్ట్ర సంపదను అనతి కాలంలో గణనీయంగా పెంచుతాం. పెరిగిన సంపదను ప్రజల కోసమే వెచ్చిస్తాం. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి, జే బ్రాండ్ మద్యం విముక్త ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తాం. ఇసుక కొరతను అంతమొందిస్తాం. విద్యుత్ ఛార్జీలకు చెక్ పెడతాం. చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇంకా కొన్ని కొత్త పథకాలను కూడా తీసుకొస్తాం. రైతు కూలీల సంక్షేమం కోసం పాటుపడతాం. అందులో భాగంగా అవసరం అయితే రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటాం. ఇది నా హామీ. తప్పక నెరవేరుతుంది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పేద ప్రజలకు రెండు సెంట్ల స్థలం ఇస్తాం. ఇప్పటికే ఇచ్చిన స్థలాల్లో పక్కా ఇల్లు కట్టిస్తాం’’అని హామీల వర్షం కురిపించారు చంద్రబాబు.
వాలంటీర్లకు వ్యతిరేకం కాదు
తమ హామీలను వెల్లడించిన అనంతరం సీఎం జగన్, వైసీపీపై చంద్రబాబు ధ్వజమెత్తారు. మీ పార్టీ గుర్తు మార్చుకో అంటూ జగన్‌కు సూచించారు. ‘‘నేను వాలంటీరు వ్యవస్థకు వ్యతిరేకం కాదు. వాళ్లు రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడానికే వ్యతిరేకం. వాళ్లు రాజకీయ పార్టీల కార్యకర్తలుగా కాకుండా ప్రజలకు సేవ చేసేలా పనిచేయాలి. మా ప్రభుత్వం వచ్చాక వాలంటీరు వ్యవస్థను కొనసాగించడమే కాదు. మరింత మెరుగుపరుస్తాం. ప్రతి వాలంటీరు ఐదంకెల జీతం అందుకునేలా చేస్తాం. ఇక పెన్షన్ల విషయానికి వస్తే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వొచ్చు. మండుతున్న ఎండలో సచివాలయానికి వచ్చి ఇప్పటికే ఇద్దరు మరణించారు. అలా జరగకుండా చర్యలు తీసుకుంటూ ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఒక వేళ పెన్షన్లు ఇవ్వడం వైసీపీ వల్ల కాకుంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికీ రూ.4వేలు పెన్షన్ ఇస్తాం. వైసీపీని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని గొడ్డలితో బెదిరిస్తున్నారు. జగన్.. మీ పార్టీ గుర్తుగా గొడ్డలి పెట్టుకో. అది సరిగ్గా సరిపోతుంది. అంతేకానీ రాష్ట్రాన్ని స్మశానంగా మార్చొద్దు. ఫ్యాన్‌ను ముక్కలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’అని చంద్రబాబు అన్నారు.
Tags:    

Similar News