నేటి రాత్రి విశాఖలో చంద్రబాబు బస
ఉండవల్లి నుంచి గన్నవరం చేరుకొని ప్రత్యేక ఫ్లైట్‌లో ముంబాయి వెళ్తారు. అక్కడ నుంచి నేరుగా విశాఖకు వెళ్లి అక్కడే బస చేస్తారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి విశాఖలో బస చేయనున్నారు. సీఎం చంద్రబాబు టూర్‌లో భాగంగా తొలుత గురువారం మధ్యాహ్నం ముంబాయి వెళ్లనున్నారు. ఉండవల్లి తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ముంబాయి వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మరో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ముంబాయిలోని ఆజాద్ గ్రౌండ్‌లో ముచ్చటగా మూడో సారి ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ఎన్టీఏ పెద్దలు హజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా వీరి పక్కన ఆసీనులు కానున్నారు. ప్రస్తుత ఎన్టీఏ ప్రభుత్వంలో కీలక నేతగా మారడంతో చంద్రబాబుకు ఎనలేని గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. అది ముగిసిన అనంతరం గురువారం రోజు సాయంత్రం సీఎం చంద్రబాబు బయలుదేరి రానున్నారు. అయితే ఉండవల్లి తన నివాసానికి బదులు ముంబాయి నుంచి నేరుగా విశాఖకు వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రికి అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం రోజు విశాఖలో చంద్రబాబు వివిధ సమావేశాలతో బిజీ బిజీగా గడపనున్నారు. విశాఖలో శుక్రవారం డీప్ టెక్నాలజీస్ సమ్మిట్ 2024 జరగనుంది. దీనిలో సీఎం పాల్గొననున్నారు. తర్వాత విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట అథారిటీ ప్రాజెక్టుకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. తర్వాత ఉండవల్లికి తిరిగి రానున్నారు.