చింతలపూడి బొగ్గు గనులకు ఎట్టకేలకు మోక్షం

అక్టోబర్ 27 వరకు టెండర్ల దాఖలుకు తుది గడువు, నవంబర్ చివర్లో వేలం;

By :  A.Amaraiah
Update: 2025-09-17 02:00 GMT
ఆంధ్రప్రదేశ్ లో బొగ్గు గనుల తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఏలూరు జిల్లా చింతలపూడి సెక్టార్ లోని బొగ్గు గనుల వేలానికి తొలి అడుగు పడింది. దీంతో ఈ ప్రాంతం ‘ఆంధ్రా సింగరేణి’గా మారనుంది.
కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 80 కొత్త బొగ్గు గనుల వేలం జాబితాలో చింతలపూడి సెక్టార్లు A–1 (SW), A–1 (SE)లకు కూడా చోటు కల్పించింది. ఫలితంగా సుమారు 60 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రేచర్ల బొగ్గు బ్లాక్‌ను వేలం దశకు తీసుకొచ్చింది.

ఈ బ్లాక్ 22.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండి, యర్రగుంటపల్లి, సీతానగరం, లింగగూడెం, రాఘవాపురం వంటి గ్రామాలను కవర్ చేస్తుంది. ఇక్కడ సుమారు 2.225 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారిక అంచనా.
సుదీర్ఘ చరిత్ర, విస్తృత పరిశోధన..
చింతలపూడి బొగ్గు గనుల చరిత్ర చాలా పాతది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఇక్కడ అన్వేషణ ప్రారంభమైంది. 1964 నుంచే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ), ఇతర సంస్థలు ఇక్కడ సర్వేలు ప్రారంభించాయి. 2006 నుంచి 2016 వరకు మరో దశలో అధునాతన డ్రిల్లింగ్ పద్ధతులు ఉపయోగించి విస్తృత పరిశోధనలు జరిపారు. లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ 2013లో సమర్పించిన నివేదికలో, చింతలపూడి మండలంలో అత్యంత నాణ్యమైన గ్రేడ్–1 బొగ్గు భూగర్భంలో 500 మీటర్ల లోతులోనే విస్తారంగా లభిస్తుందని స్పష్టంచేసింది.

గతంలోనే వేలంలో చోటు దక్కినా...!
చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి చింతలపూడి వరకు 2వేల మిలియన్‌ టన్నుల నుంచి 3వేల మిలియన్‌ టన్నుల బొగ్గు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణలోని సింగరేణి తరహాలో ఇక్కడ బొగ్గు తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి 2015లో ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎండీసీ) లేఖ రాసింది. దానిపై కేంద్రం స్పందించలేదు.
కానీ, గతంలో కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో ప్రస్తుతం ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవరం, తడికలపూడితో పాటుగా చింతలపూడి బ్లాక్‌లోని జంగారెడ్డిగూడెం కూడా ఉన్నాయి. ఈ వేలంలో సింగరేణి సంస్థ పోటీలో లేక పోవడంతో బొగ్గు గనుల వేలం వాయిదా పడింది.

తాజాగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దేశవ్యాప్తంగా నూతన బొగ్గు గనుల వేలం జాబితాను ప్రకటించగా, చింతలపూడి సెక్టార్‌ ఏ–1 (ఎస్‌డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్‌ ఏ–1 (ఎస్‌ఈ)లకు చోటు దక్కింది. దీంతో బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు.
60 ఏళ్ల నుంచి అన్వేషణ..
ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో బొగ్గు గనులను కనుగొనేందుకు జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ)తోపాటు వివిధ సంస్థలు 60 ఏళ్ల నుంచి సర్వేలు చేశాయి. తొలి దశలో 1964 నుంచి 2006 వరకు నాలుగు దఫాలుగా సర్వేలు నిర్వహించారు. 2006 నుంచి 2016 వరకు మళ్లీ సర్వేలు కొనసాగాయి. అన్ని సర్వేల్లోనూ చింతలపూడి ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు గనులు ఉన్నట్లు గుర్తించారు. ఆయా సర్వే సంస్థల నివేదికల్లో కొన్ని స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ చింతలపూడి మండలంలో 30 కిలో మీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు దాదాపు అన్ని సంస్థలు అంచనా వేశాయి.
చాట్రాయి మండలం సోమవరం నుంచి చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇతర రాష్ట్రాల్లో లభించే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన గ్రేడ్‌–1 రకం బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అది కూడా భూ ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని లక్నోకు చెందిన బీర్బల్‌ సహానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలియో బోటనీ అనే సంస్థ వెల్లడించింది.
సౌత్‌ వెస్ట్‌ పినాకిల్‌ సంస్థ మరో సంస్థతో కలిసి చింతలపూడి ప్రాంతంలో 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్‌ చేపట్టింది. ఈ 120 పాయింట్ల ద్వారా సుమారు 65,000 మీటర్ల లోతున బొగ్గు అన్వేషణ చేపట్టి సుమారు 40,000 మీటర్ల పనులు పూర్తి చేసింది.
ఇక సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ ఆధునాతన రిగ్గులతో 120 పాయింట్లలో డ్రిల్లింగ్ జరిపి, 65,000 మీటర్ల లోతు వరకు బొగ్గు నిల్వలను నిర్ధారించింది. అన్ని అంచనాల ప్రకారం, ఈ ప్రాంతంలో 2,000–3,000 మిలియన్ టన్నుల వరకు బొగ్గు ఉన్నట్టు గుర్తించారు.
ఇప్పుడేం జరుగుతోంది...
గత వారంలో లాంఛనాలు పూర్తి చేసి టెండర్‌కు సన్నద్ధమయ్యారు. ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం రేచర్ల బొగ్గు బ్లాక్‌తో పాటు దేశవ్యాప్తంగా మరో 13 బ్లాక్‌లకు కలిపి టెండర్లకు ఆహ్వానించారు. 22.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో రేచర్ల కేంద్రీకృతంగా యర్రగుంటపల్లి, సీతానగరం, మేడిశెట్టివారిపాలెం, లింగగూడెం, రాఘవాపురం తదితర గ్రామాల్లో బొగ్గు నిల్వలను నిర్ధారించారు.
ఆంధ్రా– తెలంగాణ సరిహద్దు సమీపంలో ఉన్న రేచర్ల బొగ్గు బ్లాక్‌ పరిధి 22.24 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ జీ–13 గ్రేడ్‌ బొగ్గు లభిస్తుందని, 623 మీటర్ల లోతు నుంచి గరిష్టంగా 1,123 మీటర్ల లోతులో నిల్వలు ఉన్నాయని, 2,225.63 మిలియన్‌ టన్నుల నిల్వలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని అంచనా వేసి టెండర్లను ఆహ్వానించారు.

సెప్టెంబర్ 15న ప్రీబిడ్ సమావేశం పూర్తయింది. వచ్చే నెల 27 వరకు టెండర్లను దాఖలు చేసుకోవచ్చు. అక్టోబర్ 28న టెక్నికల్ బిడ్లు తెరిచి, నవంబర్ చివరి వారంలో ఈ–ఆక్షన్ ద్వారా గని కేటాయింపు జరగనుంది.
బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని అంచనా. అధికారులు అంచనా వేస్తున్న దాని ప్రకారం, ఈ నిల్వల ఆధారంగా సంవత్సరానికి సుమారు 8,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి 60 ఏళ్ల పాటు సాధ్యమవుతుంది.
స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా కలిగే అవకాశం ఉంది. అనుబంధ పరిశ్రమలు, ట్రాన్స్‌పోర్ట్, చిన్న వ్యాపారాలు కూడా ఈ ప్రాంతంలో పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా ఈ అభివృద్ధి దిశలో ఎదురుచూస్తున్నారు.
నవ్యాంధ్ర అభివృద్ధికి ఊతం
తెలంగాణలోని సింగరేణి కోల్ మైన్స్ తరహాలోనే చింతలపూడి గనులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతమివ్వనున్నాయి. ఏపీఎండీసీ ఇప్పటికే 2015లోనే ఈ గనుల తవ్వకాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ, ఆ సమయంలో స్పందన రాలేదు. ఇప్పుడు మళ్లీ టెండర్ దశకు చేరడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆశావహంగా ఎదురు చూస్తున్నారు.
చింతలపూడి బొగ్గు గనుల వేలం ఆంధ్రప్రదేశ్ ఖనిజరంగ చరిత్రలో ఒక కీలక మలుపు. ఇది కేవలం జిల్లాకు మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువత ఉపాధి అవకాశాలకు ఒక కొత్త దిశను చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రేచర్ల గనుల ఫాక్ట్ ఫైల్
మొత్తం నిల్వలు (Recharla Block): 2.225 బిలియన్ టన్నులు
లోతు: 623–1,123 మీటర్లు
విద్యుత్ ఉత్పత్తి: 8,000 మెగావాట్లు/ఏటా
ఎన్నేళ్లు – 60 ఏళ్లు
వేలం టైమ్‌లైన్
టెండర్ దాఖలు: అక్టోబర్ 27
టెక్నికల్ బిడ్‌లు: అక్టోబర్ 28
ఈ–వేలం: నవంబర్ చివరి వారం 2025
దీనివల్ల ఏమి మేలు జరుగుతుందంటే..
-వేలాది యువతకు ఉద్యోగాలు, ఉపాధి
-స్థానిక వ్యాపారాలకు ఊతం
-చింతలపూడి = ఆంధ్రా సింగరేణి
స్థానికుల సంబరం...
“ఏళ్ల తరబడి మా నేల కింద బొగ్గు ఉందని వింటూ వచ్చాం. ఇప్పుడు గనులు మొదలైతే మా పిల్లలకు ఊర్లోనే ఉద్యోగాలు వస్తాయి.” అని యర్రగుంటపల్లికి చెందిన రైతు రమేష్ సంబరపడ్డారు. తమకు ఈ ప్రాంతంలోనే ఉపాధి లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓపక్క సంతోషపడుతున్నా మరోపక్క విచారమూ వ్యక్తమవుతోంది. బొగ్గు గనులున్న ప్రాంతాలు ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏర్పడిన కాలుష్య భూతాన్ని గుర్తుచేసుకుంటున్న వారూ ఉన్నారు.
లింగగూడెం గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు లక్ష్మీ ఏమన్నారంటే.. “అభివృద్ధి బాగానే ఉంది కానీ పర్యావరణ రక్షణకు చర్యలు తప్పనిసరి. పొలాలు, నీరు కాపాడకపోతే ప్రమాదం ఎక్కువ.”

బొగ్గు గనులుండే ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఫలితంగా మనీ సర్కులేషన్ లోకి వచ్చి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుందనే భావన పెరిగింది. స్థానిక రాజకీయ నాయకుడు టి. జగదీశ్వర్ అభిప్రాయంలో “చింతలపూడి ఆంధ్రా సింగరేణిగా మారబోతోంది. ఇది కేవలం మైనింగ్ ప్రాజెక్ట్ కాదు, రాష్ట్ర ఆర్థికానికి మలుపు.”
ఆంధ్రా సింగరేణిగా ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతం వెలుగొందనుంది. నల్ల బంగారు గనులతో రాష్ట్రానికి కాసుల పంట పండించనుంది. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశం, నవ్యాంధ్ర అభివృద్ధికి ఊతం కానుంది.
Tags:    

Similar News