వర్షాలపై సీఎం సమీక్ష.. ప్రజలకు లోకేష్ జాగ్రత్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుంటే.. ఇంకొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడుతున్నాయి.

Update: 2024-08-31 08:37 GMT

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుంటే.. ఇంకొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలు అంతా జాగ్రత్తగా ఉండాలని, 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రయాణాలు చేస్తున్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా వర్షాలు పడుతున్న సమయంలో చెట్ల కింద, మైదాన ప్రాంతాల్లో ఉండటం చేయొద్దని కూడా అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అధికారులు.

పరీక్షలు వాయిదా..

భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవుగా ప్రకటించారు. అదే విధంగా పలు పరీక్షలను కూడా వాయిదా వేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తే ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. పర్యాటక ప్రాంతాల్లో కూడా పలు ఆంక్షలను విధిస్తూ వారు ఉత్తర్వులు ఇచ్చారు. సముద్రతీర ప్రాంతాలకు వెళ్లొద్దని, మత్స్యకారులు కూడా చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.

కాగా రాష్ట్రంలో వర్షాల పరిస్థితి సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

సిబ్బంది సిద్ధంగా ఉండాలి..

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు.. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వారికి దిశా నిర్దేశం చేశారు. అత్యవసర సహాయక చర్యలకు తీసుకోవడానికి ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సీఎం హెచ్చరించారు. ‘‘మ్యాన్‌హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికంగా వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించాలి. వాగులు, వంకల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలి’’ అని ఆదేశించారు.

డ్రోన్ టెక్నాలజీ వాడాలి..

‘‘వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తతతో ఉంటే ప్రజల ఇబ్బందులు తగ్గించొచ్చు. భారీ వర్షాల నేపథ్యంలో ఇరిగేషన్, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని పరిశీలించాలి. పట్టణాల్లో రోడ్లపై నీరుచేరి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలి. అదే విధంగా వర్షాల సమయంలో వైరల్ ఫీవర్, విషజ్వరాలు ప్రబలకుండా వైద్యఆరోగ్య శాఖ చర్యలు చేపట్టాలి. జ్వరాల బారిన పడిన గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలి. కాల్వలు, వాగులు దాటడానికి ప్రజలను అనుమతించొద్దు. వాట్సాప్ ద్వారా సమన్వయంతో పనులు చేపట్టాలి. విపత్కర పరిస్థితుల్లో డ్రోన్ల టెక్నాలజీని విరివిగా వినియోగించుకోవాలి. వర్షాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మెసేజ్ రూపాన పంపాలి. ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న భరోసా ప్రజలకు కల్పించాలి’’ అని చెప్పారు.

వాటిపై స్పెషల్ ఫోకస్..

రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్సీలతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు అంశాలపై చర్చించారు. ‘‘రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడా కూడా తాగునీరు, ఆహార కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అదే విధంగా నీరు, ఆహారం కలుషితం కాకుండా కూడా చర్యలు చేపట్టాలి. అల్లూరి జిల్లాలో కలుషిత ఆహారం వల్ల పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు జరపాలి. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థంగా పనిచేయాలి’’ అని చెప్పారు.

అనవసరంగా బయటకు రావొద్దు: లోకేష్

రాష్ట్రంలోని వర్షాలపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. వరద ప్రాంతాల్లోని ప్రజలకు కీలక సూచనలు చేశారు. వరద ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎవరూ కూడా అవసరం లేకుండా బయటకు రావొద్దని హెచ్చరించారు. ‘‘ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ మెసేజ్‌లు గమనించి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి. కొండచరియలు విరిగిపడే, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి టీడీపీ నేతలు, కార్యకర్తలు పూర్తి సహకారం అందించాలి. విపత్తుల కష్ట సమయంలో టీడీపీ అండగా ఉంటుందనే భరోసా ప్రజలకు కల్పించాలి’’ అని మంత్రి నారా లోకేష్ చెప్పారు.

Tags:    

Similar News