టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇస్తే తప్పా!

టిప్పర్ డ్రైవర్లతో జరిగిన ముఖాముఖిలో సీఎం జగన్.. టీడీపీ చీఫ్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. టిప్పర్ డ్రైవర్‌.. అసెంబ్లీలో అడుగు పెట్టకూడదా అని ప్రశ్నించారు.

Update: 2024-04-04 11:15 GMT
Source: Twitter

టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం జగన్ మరోసారి నిలదీశారు. ‘‘జగన్.. తన దగ్గర అభ్యర్థులు లేక టిప్పర్ డ్రైవర్‌కు సీటు ఇచ్చారు’’అన్న బాబు వ్యాఖ్యలను సీఎం జగన్‌మోహన్ రెడ్డి తప్పుబట్టారు. టిప్పర్ డ్రైవర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తప్పేంటని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఈరోజు తిరుపతి జిల్లా చిన్నసింగమలలో కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్.. అక్కడి టిప్పర్, ఆటో డ్రైవర్లతో ముఖాముఖి అయ్యారు. వాళ్ల సంక్షేమం కోసమే తాను టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చానని వెల్లడించారు. టిప్పర్ డ్రైవర్ల అభ్యున్నతి కోసం పాటు పడాలంటే వారి కష్టం బాగా తెలిసిన వ్యక్తి అధికారంలో ఉండాలన్న ఆశయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

అవహేళన చేయడానికి ఏముంది?
తాను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వీరాంజనేయులు టీడీపీ హయాంలో బీఈడీ చదివిన వ్యక్తి అని, కానీ అప్పట్లో ఉద్యోగం రాక తన కుటుంబాన్ని చూసుకోవాలన్న ఉద్దేశంతో టిప్పర్ డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించారని జగన్ చెప్పారు. ‘‘టీడీపీ హయాంలో బీఈడీ చదివిన వ్యక్తులు కూడా ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్లుగా మారారు. అలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదని, అందుకోసం ఓ టిప్పర్ డ్రైవర్‌ను శాసన సభలో కూర్చోబెట్టాలని వైసీపీ ఆలోచించింది. అందుకే వీరాంజనేయులుకు టికెట్ ఇచ్చాం. అయినా టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇచ్చామని చంద్రబాబు అవహేళన చేస్తున్నారు. ఇందులో తప్పేముంది. టిప్పర్ డ్రైవర్.. శాసనసభలో అడుగు పెట్టకూడదా? వీరాంజనేయులు వేలిముద్రగాడంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఒక విషయం చెప్పదలచుకున్నా.. వీరాంజనేయులు ఆ చంద్రబాబు ప్రభుత్వ హాయంలోనే ఎకనామిక్స్‌లో బీఈడీ పూర్తి చేసి ఉద్యోగం దొరక్క టిప్పర్ డ్రైవర్‌గా మారారని గుర్తు చేస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.
మాకూ మీకూ అదే తేడా
ఎంతైనా వైసీపీ, టీడీపీ మధ్య చాలా తేడా ఉందని జగన్ అన్నారు. ‘‘ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే పార్టీ వైసీపీ అయితే స్వార్థం, స్వలాభం కోసం పనిచేసే పార్టీ టీడీపీ. మేము ప్రజల మంచి కోరి ఒక టిప్పర్ డ్రైవర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. కానీ మీరు మీ టికెట్లు అన్నింటినీ కోట్లకు పడగలెత్తిన వారికే ఇచ్చారు. ఆటో, ట్యాక్సీ, టిప్పర్ డ్రైవర్లకు తోడుగా ఉంటామని అన్నందుకు మమ్మల్ని అవహేళన చేస్తున్నారు బాబు. వైసీపీ హయాంలో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.50వేలు అందించాం. వాహన మిత్ర ద్వారా రూ.1296 కోట్లు అందించాం. మాకూ మీకూ మధ్య తేడా ఇదే. మేము వారి సంక్షేమం చూస్తూ మీరు కోటీశ్వరుల సంక్షేమం చూస్తారు’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు మీలాంటి వారికి తగిన గుణపాఠం నేర్పుతారని, వైసీపీకే ప్రజలు మళ్లీ పట్టం కడతారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
Tags:    

Similar News