ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను తాకిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యలు

నా మాటలు, ఆలోచలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిస్టులకు 30 ఏళ్లు పట్టింది’’ అని నవ్వుతూ చంద్రబాబు అన్నారు ఎందుకామాట అన్నారో చదవండి..;

Update: 2025-03-26 11:21 GMT
చంద్రబాబు, కూనంనేని సాంబశివరావు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు ఏజెంటని, ఆయనకు టూరిజం తప్ప మరే ఇజమూ తెలియదని ఒంటి కాలి మీద లేచే కమ్యూనిస్టులకు ఆయన్ను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది. తెలంగాణ శాసనసభలో సీపీఐ సభ్యుడు, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మార్చి 25 మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు టూరిజాన్ని ఆకాశానికి ఎత్తారు. చంద్రబాబును గతంలో కమ్యూనిస్టులు ఆక్షేపించడం తప్పేనన్న అర్థంలో మాట్లాడారు. ఆ వ్యాఖ్యల్ని మార్చి 26న ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబే స్వయంగా ప్రస్తావిస్తూ తన దృష్టి అంతా ప్రజా సంక్షేమమే అన్నట్టుగా మాట్లాడారు. చంద్రబాబు ఎంతో దూరదృష్టి కలవారంటూ ఓ పక్క ఆయన పార్టీ నాయకులు యన సమక్షంలోనే పొగడ్తలతో ముంచెత్తారు. ఆ మాటలకు చంద్రబాబు ముసిముసి నవ్వుతూ చిందిస్తూ.. నేనంటే మాటలా, నా విజన్ నే తప్పుబడతారా.. అనే అర్థం వచ్చేలా కలెక్టర్లను విస్మయపరిచారు.
అసలేం జరిగిందంటే...
తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రస్తావించారు. ‘‘గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు.. ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారు.. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది.. కానీ, నిజంగా ఖర్చులేని ఇజం ఏదైనా ఉందంటే అది టూరిజమే’’ అని కూనంనేని అన్నారు. చంద్రబాబు నాడు చెప్పిన మాటే నిజమంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన దూరదృష్టిని కీర్తించారు. అది జరిగిన 24 గంటల తర్వాత కూనంనేని వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు.
‘‘ఏ ఇజం లేదని నేను అంటే కమ్యూనిస్టులు నాపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఖర్చు లేని ఇజం టూరిజమేనని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. నా మాటలు, ఆలోచలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది’’ అని నవ్వుతూ చంద్రబాబు అన్నారు. అయితే.. ఇప్పుడంత సమయం లేదని, త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని సీఎం పేర్కొన్నారు.
‘‘రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టాలి. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి కల్పించే రంగం టూరిజమే’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
కూనంనేని వ్యాఖ్యలకు సొంత పార్టీలోనే చిటపటలు మొదలయితే ఆయన మాటలకు చంద్రబాబు చిరునవ్వులు చిందించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నిక కాగా సీపీఐ ఏపీ శాఖకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక్క సీటూ లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చంద్రబాబు పార్టీకి అంతేవాసిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
Tags:    

Similar News