వల్లభనేని వంశీకి వైఎస్ జగన్ ఓదార్పు రేపు!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 18న విజయవాడ జైల్లో కలిసి మాట్లాడనున్నారు.;
By : The Federal
Update: 2025-02-17 08:44 GMT
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 18న విజయవాడ జైల్లో కలిసి మాట్లాడనున్నారు. ఆయనతో ములాఖత్ కి జైలు అధికారులు మంగళవారం అనుమతి ఇచ్చినట్టు వైసీపీ వర్గాల కథనం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్‌పై దాడి, కిడ్నాప్ వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు అరెస్ట్ అయి విజయవాడ జైల్లో ఉన్నారు.
సరిగ్గా ఇదే సమయంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే వంశీ, ఆయన అనుచరులు చేసినట్టు చెబుతున్న ఆగడాలపై ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సత్యవర్ధన్ ను హైదరాబాద్ రాయదుర్గంలోని వంశీ ఇంటికి తీసుకెళ్లడం, మరుసటి రోజు కారులో విశాఖ తరలించడం, అక్కడి నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చిన దృశ్యాలు సైతం ఆయా ప్రదేశాల్లోని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా గుర్తిస్తున్నారు.
వంశీ ఫోన్ దొరక్కపోవడంతో మిగిలిన ఆధారాలపై దృష్టి పెట్టారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చగా, ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశారు. ఏ2గా కొమ్మా కోట్లు, ఏ3- భీమవరపు యతీంద్ర రామకృష్ణ అలియాస్ తేలప్రోలు రాము, ఏ5- ఓలుపల్లి రంగా, ఏ6- వజ్రకుమార్, ఏ9- ఎర్రంశెట్టి రామాంజనేయులు, ఏ11- చేబ్రోలు శ్రీను, ఏ12- వేణు ఆచూకీ కోసం రెండు బృందాలు హైదరాబాద్‌లో గాలిస్తున్నాయి. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడంతో బంధువులు, సన్నిహితులకు వచ్చే కాల్స్‌పై నిఘా పెట్టారు. వీరిలో కీలక నిందితులు రంగా, కోట్లు, రాము దొరికితే కేసు కొలిక్కివచ్చే అవకాశముంది.
సత్యవర్ధన్ ఏమి చెప్పారంటే...
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదును ఉపసంహరించుకునేలా సత్యవర్ధన్‌ను అతని బంధువు వజ్రకుమార్ ద్వారా ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. సత్యవర్ధన్ పోలీసులకు ఈ విషయాన్ని చెప్పారు. తనను కిడ్నాప్ చేశాక ఏరోజు ఎక్కడెక్కడ ఉంచింది, ఎలా తీసుకెళ్లింది వివరంగా చెప్పారు. పోలీసులు సత్యవర్ధన్ ను సోమవారం కోర్టుకు తీసుకెళ్లి న్యాయాధికారి సమక్షంలో మరోసారి వాంగ్మూలం రికార్డు చేయించనున్నారు.
హైదరాబాద్‌లోని వంశీ ఇంటికి వెళ్లిన ప్రత్యేక బృందం.. అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకుంది. అందులో వంశీ అనుచరులు సత్యవర్ధన్‌ను తీసుకొస్తున్న దృశ్యాలు ఉన్నాయి. వంశీ అనుచరులు రెండు కార్లలో ఈనెల 10న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సత్యవర్ధన్‌ను విజయవాడలోని నగర న్యాయస్థానాల సముదాయంలోకి తీసుకెళ్లారు. మూడో అంతస్తులోని ఎస్సీ, ఎస్టీ కోర్టు కిక్కిరిసి ఉండడంతో సత్యవర్ధన్ ను కిందే కారులో 3.30 వరకు ఉంచారు.
జనసంచారం తగ్గాక అతన్ని కోర్టులోకి పంపించి, తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత వెంటనే కారు ఎక్కించుకొని హైదరాబాద్ బయల్దేరారు. రాయదుర్గంలోని వంశీ ఇంటికి అర్ధరాత్రి సమయంలో తీసుకెళ్లినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైంది. మరునాడు.. 11న ఉదయం 9.52కు సత్యవర్ధన్‌ను వంశీ ఇంటి నుంచి కారులో బయటకు తీసుకెళ్లినట్లు రికార్డు అయ్యింది.
జగన్ పరామర్శకు అనుమతి...
ఇప్పుడు, ఈ కేసు మరింత హాట్ టాపిక్ అయింది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 18న విజయవాడ జైలుకు వెళ్లి, జైల్లో ఉన్న వల్లభనేని వంశీని కలవనున్నారు. జగన్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. మంగళవారం విజయవాడ చేరుకున్న తర్వాత, నేరుగా జైలుకు వెళ్లి వంశీని కలువనున్నారు. ఈ ములాఖత్ పై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే, జైలులోని వంశీకి భద్రతను పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జైల్లో వంశీ ఉంచిన సెల్ వద్ద భద్రతా గార్డులను నియమించారు. దీంతో పాటు, ఇతర ఖైదీల నుంచి వంశీకి ఏమైనా హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జైల్ సెల్ వద్ద అడ్డంగా వస్త్రాన్ని కట్టడం, అలాగే ఇతర ఖైదీలతో వంశీని కలసే అవకాశం నివారించడం వంటి చర్యలు అమలు చేస్తున్నారు.
జైల్లో గంజాయి కేసుల నిందితులు, బ్లేడ్ బ్యాచ్ సభ్యులు ఉన్నందున వంశీకి హాని లేకుండా జైలులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెల్ వద్ద అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
వంశీ అరెస్ట్ వివాదం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతోంది. ప్రజల మధ్య కూడా ఈ అంశంపై అనేక చర్చలు జరుగుతున్నాయి. వంశీ, వైసీపీ నేతగా, ఈ కేసులో జడ్జి వద్ద విచారణ పొందుతుండగా, రాజకీయ వర్గాల వాదనలు కూడా మరింత ఎక్సైటింగ్‌గా మారాయి.