మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం పరారీలో ఉందా?

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కేసు పేర్ని నాని కుటుంబానికి చుట్టుకుంది. ఆయన సతీమణి జయసుధపై కేసు నమోదు చేశారు.

Update: 2024-12-14 07:54 GMT

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కేసులో అరెస్టు చేస్తారేమో అనే భయంతో వైఎస్‌ఆర్‌సీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, పేర్ని నాని, ఆయన కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేసు నమోదైన నాటి నుంచే పేర్ని నాని ఫ్యామిలీ పరారీలో ఉందని, ఎవ్వరికీ కనబడకుండా అజ్ఞాతంలోకి వెళ్లి తల దాచుకుంటున్నట్లు కూటమి వర్గాలతో పాటు పోలీసు వర్గాల్లో కూడా చర్చగా మారింది. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడ్డారనే కారణంతో పేర్ని నాని కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాని మచిలీపట్నంలో సొంతంగా ఓ గోడౌన్‌ను నిర్మించి దానిని పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఈ గోడౌన్‌ను గతంలో పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరుతో నిర్మించారు. లావా దేవీలన్నీ ఆయన సతీమణి పేరుతోనే జరుగుతున్నాయి.

అయితే రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే కారణంగా పేర్ని నానికి సంబంధించిన గోడౌన్‌ను కూడా అధికారులు తనిఖీ చేశారు. ఇందులో కొంత మొత్తంలో రేషన్‌ బియ్యం నిల్వలు మాయమయ్యాయని అధికారులు గుర్తించారు. ఈ గోడౌన్‌లో దాదాపు 3,708 బస్తాల రేషన్‌ బియ్యం మాయయ్యాయని పౌరసరఫరాల శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో పేర్ని నాని సతీమణి జయసుధ మీద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ కోసం జిల్లా కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను విచారణ నిమిత్తం 9వ అదనపు జిల్లా కోర్టుకు జిల్లా జడ్జి అరుణ సారిక బదిలీ చేశారు. ఈ కేసును ఈ నెల 16కి వాయిదా వేశారు. అయితే ఈ కేసు తెరపైకి వచ్చిన తర్వాత మచిలీపట్నం అసెంబ్లీ నియోజక వర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జిగా ఉన్న పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టూ కూడా కనిపించక పోవడంతో నాని కుటుంబం అంతా అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. అయితే పేర్ని నాని కుటుంబం పరారీలో లేదని మచిలీపట్నంలోనే ఉన్నారని వైఎస్‌ఆర్‌సీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News