రాయలసీమలో బూడిద కోసం కొట్లాట..చంద్రబాబుకు తలనొప్పిగా మారిన వివాదం
రాయలసీమలో కూటమి నేతల మధ్య ఆదిపత్య పోరు తీవ్ర రూపం దాల్చింది. పెరిగి పెద్దది కావడంతో ఉండవల్లి రావాలని నేతలను సీఎంవో ఆదేశించింది.
By : The Federal
Update: 2024-11-29 05:25 GMT
రాయలసీమలో బూడిద వివాదం తాజాగా తెరపైకొచ్చింది. బూడిద తరలింపుల్లో కూటమి నేతల వర్గీయుల మధ్య చెలరేగిన వివాదం రాష్ట్రంలో సంచలనంగా మారింది. లోకల్ ఆధిపత్య పోరులో భాగంగా చెలరేగిన ఈ వివాదం ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరింది. దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. శుక్రవారం సీఎంను కలవాలని బూడిద తరలింపులకు పాల్పడుతున్న ఆ ముగ్గురు నేతలకు సీఎంవో కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆ ముగ్గురిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చ నీయాంశంగా మారింది.
కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ) బూడిద తరలింపులలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది. బూడిద తరలింపుల్లో వాటాల కోసం ఈ వివాదం తెరపైకొచ్చింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులే దీనిని తరలించుకుని పోతున్నారని, దీనిలో తమకు వాటా కావాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డం తిరిగారు. వాటా ఇస్తేనే వాహనాల్లో బూడిదను నింపుతామని పట్టుబట్టారు. మరో వైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు తాడిపత్రిలో చెలరేగిపోయారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయుల బూడిద లారీలను తాడిపత్రి రాకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు అడ్డగించారు.
చినికి చినికి గాలివానలా మారిన ఈ వివాదం కాస్త ముదిరి పెద్దది అయ్యింది. ఇరువర్గాల మధ్య ఈ వివాదం ముదరడంతో ఆర్టీపీపీ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. కడప–తాడిపత్రి నేషనల్ హైవేలోని కడప జిల్లా కొండాపురం మండలం కే సుగుమంచిపల్లె చెక్‌పోస్టు వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టాల్సి వచ్చింది. కొండాపురం, తాళ్లప్రొద్దుటూరు పోలీసు స్టేషన్‌ల పరిధిలో 144 సెక్షన్‌కు కూడా విధించాల్సి వచ్చింది. దీంతో ఈ బూడిద వివాదం కాస్త కడప, రాయలసీమను దాటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు పాకింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఈ వివాదం సీఎం చంద్రబాబు నాయుడుకి తలనొప్పిగా మారింది. దీంతో సీఎం చంద్రబాబు ఆ ముగ్గురి నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. శుక్రవారం తన నివాసానికి వచ్చిన తనను కలవాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, భూపేష్‌రెడ్డిలను ఆదేశించినట్లు తెలిసింది.