మధ్యప్రదేశ్ దొంగల ముఠా దొరికింది
పగలు రెక్కీ నిర్వహించడం.. రాత్రి పూట చోరీలకు పాల్పడటం ఈ ముఠా స్పెషాలిటీ. నాలుగు రాష్ట్రాల పోలీసులు వీరి కోసం గాలిస్తున్నారు.;
By : The Federal
Update: 2025-02-09 12:53 GMT
అనంతపురం పోలీసులు చాకచక్యం ప్రదర్శించారు. దేశంలోనే మోస్ట్ వాంటెన్ గ్యాంగ్‌ను పట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. దొంగ తనాలు చేసి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నమధ్రప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠాను పట్టుకుని వారి నుంచి ప్రజలకు విముక్తి కలిగించారు. దీంతో అనంతపురంతో పాటు పలు రాష్ట్రాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ‘ధార్ గ్యాంగ్’ దేశంలోనే మోస్ట్ వాంటెడ్ ముఠా. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో వీరు దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ముఠా మీద పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతో పాటు గుజరాత్ రాష్ట్రాల్లో ఈ ముఠా చాలా ఫేమస్. ఈ గ్యాంగ్ పేరు చెబితే ప్రజలు హడలి పోతారు. ఈ రాష్ట్రాలలో దాదాపు 32కు పైగా దొంగ తనాల కేసులు ఈ ముఠాపై ఉన్నాయి. తాళాలు వేసిన ఇళ్లే వీరి టార్గెట్. తాళాలు పగులగొట్టడం.. దొంగతనాలకు పాల్పడటం.. చాకచక్యంగా పారిపోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.
దక్షిణ భాతర దేశంలోనే పేరు గాంచిన ఈ ధార్ గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలకు పాల్పడటం మొదలెట్టింది. ఈ క్రమంలో దాదాపు 18 రోజుల క్రితం అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలోని తాళాలు వేసి ఉన్న ఓ ఇంట్లో చోరి జరిగింది. ఈ ఇంట్లో భారీ ఎత్తున దొంగతనానికి పాల్పడ్డారు. దీనిపైన ఫిర్యాదులు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దొంగతనం జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతపురం పోలీసులు.. దక్షణాదిని గడగడలాడిస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు.
దీనిని ఎలాగైనా ఛేదించాలని పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఈ దొంగతనాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అనంతపురం ఎస్పీ జగదీష నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. ఇక రంగంలోకి దిగిన ఆ పోలీసు బృందాలు కరుడు కట్టిన ధార్ గ్యాంగ్ కోసం గాలింపులు చేపట్టారు. మధ్యప్రదేశ్‌కు వెళ్లి జల్లెడ పట్టడం మొదలు పెట్టారు. మారుమూల గ్రామాల్లో సైతం వదిలి పెట్టకుండా తీవ్రంగా గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో టెక్నాలజీని ఉపయోగించారు. దీని సహాయంతో ఈ మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఠా మొత్తం దొరక లేదు. గ్యాంగ్‌లోని ముగ్గురు నిందుతులు మాత్రమే పోలీసులకు దొరికారు. అరెస్టు అయిన వారిలో గ్యాంగ్ లీడర్ నారూ పచావార్ కూడా ఉన్నాడు.
పట్టుబడిన ముగురు నిందితుల నుంచి రూ. 90లక్షల విలువ చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా మరో రూ. 19.35లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ గ్యాంగ్‌పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో 32కుపైగా కేసులు ఉన్నాయి. తాళ్లం వేసిన ఇళ్లను చూసుకొని టార్గెట్ చేసుకుంటారు. ఆ ప్రాంతాల్లో పగటి పూట రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి పూట దొంగతనాలతో రెచ్చి పోతుంటారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. అలా రాత్రులు దొంగతనాలు చేసిన తర్వాత వీరు చాకచక్యంగా పారిపోతుంటారు. ఎవ్వరికీ అనుమానాలు తలెత్తకుండా బైక్‌లపైన ప్రయాణం చేస్తుంటారు. మామూలు వ్యక్తులుగా సంచరిస్తూ స్థావరాలను మారుస్తుంటారని తెలిపారు. ఈ ధార్ ముఠాను పట్టుకున్న పోలీసు బృందాలను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు.