భీమిలి తీరంలో పూర్తికాని కూల్చివేతలు.. నోరెళ్లబెడుతున్న అధికారులు..
భీమిలి తీరంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డికి చెందిన నిర్మాణాల కూల్చివేత ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకు అధికారులు చెప్తున్న కారణం ఏంటంటే..
భీమిలి సముద్రతీరంలో నిర్మించిన అక్రమ కట్టడాలపై శనివారం మరోసారి కూల్చివేతలు చేపట్టింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డికి చెందిన నిర్మాణాలు కావడం ఇప్పుడు కీలకంగా మారింది. ఆమెకు చెందిన నిర్మాణాల ప్రహరీ గొడను గతంలో కూడా ఒకసారి జీవీఎంసీ అధికారులు కూల్చారు. ఈ కూల్చివేత పనులను ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో వారం వరకు ఈ కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది మరోసారి రాజకీయ దుమారానికి దారి తీసింది. కేవలం అధికారం ఉందన్న అహంకారంతోనే చంద్రబాబు, టీడీపీ క్యాడర్ ఈ చర్యలకు పాల్పడుతోందని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడుతున్నారు. చంద్రబాబుపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే అసలు భీమిలీ బీచ్‌కు అతి చేరువలో నేహా రెడ్డికి ఎకరాలకు ఎకరాల స్థలం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రికి ఉన్న అధికార బలంతోనే ఆమె ఈ స్థలాన్ని సొంతం చేసుకున్నారా? అన్న అనుమాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో జీవీఎంసీ ఏమంటోంది.
బాబూ వీటికి బదులివ్వు: విజయసాయిరెడ్డి
‘‘వైజాగ్ ఎంపీ శ్రీభరత్ మత్తుకుమిల్లి, నారా లోకేష్ తోడల్లుళ్లు కుమ్మకై రాజకీయ కక్షతో భీమిలిలో మా ప్రైవేట్ స్థలంలో ఈరోజు మళ్ళీ రెండవసారి ప్రహరీ పగలగొట్టడం పిల్లచేష్టలుగా భావిస్తున్నా! నారా చంద్రబాబు నాయుడు నివసిస్తున్న కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కొంపను ఆ చట్టం, ఆ నిబంధనల ప్రకారమే కూల్చమని పలుసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. బుద్ధిహీనత వల్ల మీరు అది చెయ్యలేరు.
నారా చంద్రబాబు నాయుడు నిఖార్సయిన నాయకుడైతే క్రింది ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి!
తిరుమల వెయ్యికాళ్ల మండపం ఎందుకు కూల్చావు.
విజయవాడలో 50కు పైగా గుళ్ళు ఎందుకు కూల్చావు.
దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు ఎందుకు చేసావు.
బూట్లు వేసుకుని ఎందుకు పూజలు చేస్తావు.
రాష్ట్రంలో విగ్రహాలు ధ్వంసం చేసి మాపై నిందలు ఎందుకు వేశావు.
పవిత్రమైన ప్రసాదం లడ్డు మీద ఎందుకు విషప్రచారం చేసావు.
నీలాంటి దుర్మార్గుడిని బహిష్కరిస్తే గానీ సమాజం బాగుపడదు.
ప్రసాదం స్వీకరించే ప్రతి భక్తుడు నిన్ను చీ కొడుతున్నాడు.
ప్రసాదంలో ఏ కల్తీ లేదు, కల్తీ అంతా నీ బుర్ర, మనసు నీ చరిత్ర, నీ మానసిక రుగ్మత.
ఆరోపణలే తప్ప నీ జీవితం లో నిరూపణలు వుండవు.
బట్ట కాల్చి ముఖానవేసి ప్రత్యర్థిని తుడుచుకో అంటావు.
నీ అధికారం నీ డబ్బు సంపాదన కోసమే తప్ప ప్రజలకోసం మాత్రం కాదు.
ఆ డబ్బుతో వ్యవస్థలను మానేజ్ చేస్తావు.
విలువలకు ఎన్నడో వలువలు ఊడ్చిన నువ్వు ఒక మనిషివేనా!
దేవదేవుడు నిన్ను ఎప్పటికి క్షమించడు.
కలియుగంలో నీ అంత పాపం ఎవరూ చేసి ఉండరు.
నీ ప్రవర్తనతో రావణాసురుడు, కంసుడు, కీచకుడు సిగ్గుపడేలా చేశావు.
నీలాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు జాతి దురదృష్టం’’ అంటూ మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
హైకోర్టు ఆదేశాల మేరకే కూల్చివేత
నేహా రెడ్డికి చెందిన నిర్మాణాలు తీర ప్రాంత పరిరక్షణ నియమాలు(సీఆర్‌జెడ్)ను ఉల్లంఘించాయి. ఈ నేపథ్యంలోనే సాగరతీరంలో నిర్మించిన కాంక్రీట్ కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ నేపథ్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు రెండు వారాల క్రితమే ఈ కూల్చివేత పనులను జీవీఎంసీ అధికారులు చేపట్టారు. కాగా ఇందులో భాగంగానే ఈరోజు పూర్తిస్థాయి కూల్చివేతలు చేశారు. అంతేకాకుండా ఈ కూల్చివేతలకు అయిన ఖర్చును నేహా రెడ్డి నుంచి వసూలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. నేహా రెడ్డికి చెందిన అక్రమ కట్టడాలు భీమిలి సర్వే నెంబర్ సర్వే నెం:1516,1517 1519, 1523 పరిధిలో సుమారు నాలుగు ఎకరాలు స్థలంలో ఉన్నాయి. పర్యావరణ శాఖలు నుండి ఎటువంటి అనుమతులు పొందకుండానే ఆమె నక్షత్ర హోటల్‌ను నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హోటల్ నిమిత్తం మిగిలిన శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఎందుకింత ఆలస్యం..
ఒక హోటల్‌కు చెందిన ప్రహరీ గోడ కూల్చివేత పనులకు జీవీఎంసీ అధికారులు దాదాపు రెండు వారాలుగా శ్రమించడం కాస్తంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే మరో వారం రోజుల వరకు ఈ ప్రహరీ కూల్చివేత పనులు కొనసాగొచ్చని అక్కడి అధికారులు చెప్తున్నారు. సముద్రతీరంలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగానే కట్టినా అత్యంత పటిష్టంగా కట్టారని, దాదాపు భూమిలో 12 అడుగుల లోతు వరకు గిడ్డర్లు వేసి మరీ ఈ నిర్మాణం చేశారని అధికారులు చెప్తున్నారు. అందువల్లే ఆలస్యం అవుతుందని, ఇప్పటి వరకు 25శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనిని కూడా శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వారు వివరించారు.
జనసేన కార్పొరేటర్ పిటిషన్‌తో
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అధికారుల సహాయంతో విజయసాయిరెడ్డి ఈ నిర్మాణాలు చేపట్టారంటూ ఈ వ్యవహారంపై జనసేన కార్పోరేటర్ పీతలమూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. విచారణ జరిపింది. విచారణ క్రమంలో రక్షణ కల్పించాలంటూ విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డి కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మహావిశాఖ నగరపాలక సంస్థ అభిప్రాయాన్ని కోరింది. కోర్టు ఆదేశాల మేరకు స్పందించిన జీవీఎంసీ తన నివేదిక ఇచ్చింది. ఇందులో తీరప్రాంతంలో నిర్మించిన కట్టడం పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగానే ఉందని స్పష్టం చేసింది. దీంతో 15 రోజుల్లో చర్యలు చేపట్టాలని జీవీఎంసీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జీవీఎంసీ చర్యలు చేపట్టి.. సదరు కట్టడాలను(ప్రహరి గోడ) గతంలోనే అధికారులు కూల్చివేశారు. అయితే ఈరోజు మళ్ళీ ఈ ప్రహరీ గోడను కూల్చడం కీలకంగా మారింది.
తండ్రి అధికారమే అండా?
భీమిలీ తీరంలో జీవీఎంసీ చేపడుతున్న కూల్చివేతలతో అసలు విశాఖతో సంబంధం లేని వ్యక్తికి.. ఇక్కడ ఎకరాలకు ఎకరాల భూమిలి ఎలా వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. తన తండ్రి అధికారంలో ఉండటంతో అదే అదునుగా ఇక్కడ భూమిని తక్కువ ధరకే సొంతం చేసుకున్నారా? ఆమెకు ఈ స్థలాన్ని అందించడంలో అధికార పక్షం అండగా నిలిచిందా? ఎంపీ హోదాలో ఉన్న తండ్రి తన అధికార బలాన్ని వినియోగించి భీమిలి సముద్ర తీరంలో ఎకరాల స్థలాన్ని కూతురుకు ఎటువంటి అడ్డంకులు రాకుండా అందించారా? ఇలా మరెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా సముద్రతీరంలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.