ఏపీలో వడగాల్పులు
గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 39డిగ్రీలకుపై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.;
By : The Federal
Update: 2025-03-07 05:20 GMT
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ముదిరాయి. మే నెల రాకముందే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మార్చి మొదటి వారం నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. ఉదయం పది గంటల ప్రాంతంలోనే ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గురువారం పలు ప్రాంతాల్లో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు మండలల్లా వడగాల్పులు వీచే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 84 మండలాల్లో వడగాల్పులు వీచనున్నాయి.
శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే మార్చి 7 శుక్రవారం రాష్ట్రంలోని 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా 9, విజయనగరం 13, పార్వతీపురం మన్యం 11, అల్లూరి సీతారామరాజు 9, అనకాపల్లి 1, కాకినాడ 4, తూర్పుగోదావరి 8, పశ్చిమగోదావరి 1, ఏలూరు 8, కృష్ణా 7, గుంటూరు 8, బాపట్ల జిల్లాలోని 5 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.
శనివారం 80 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం జిల్లాలో 12, పార్వతీపురం మన్యం జిల్లాలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7, తూర్పు గోదావరి జిల్లాలో 10, ఏలూరు జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 7, ఎన్టీఆర్ జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 5, పల్నాడు జిల్లాలో 4 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండనుంది.
గురువారం అనకాపల్లి జిల్లా నాతవరంలో 39.9 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో 39.9డిగ్రీలు, చిత్తూరు జిల్లా సింధురాజపురంలో 39.7డిగ్రీలు, నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 39.5డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కూర్మనాథ్ వెల్లడించారు. గురువారం 7 మండలాల్లో తీవ్ర, 68 మండలాల్లో వడగాల్పులు వీచాయని పేర్కొన్నారు.
ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.