ఏపీలో భారీ వర్షాలు.. పొంగి పొర్లిన వాగులు, వంకలు
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కాల్వ గట్లు తెగాయి. జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
ఎడతెరపి లేకండా ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్లు చెరువులు, చప్టాలు, వంతెనలు కొట్టుకొని పోయాయి. పలు జిల్లాల్లో జనజీవనం స్థంభించి పోయింది. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం భారీగానే పెరిగింది. రాజమండ్రి వద్ద గోదావరి ఉదృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం భారీగా పెరిగింది. దాదాపు 11 అడుగులకు చేరుకుంది. లక్షలాది క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కోనసీమ జిల్లా దేవీపట్నం గుండిపోశమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన మండలాల్లో వరద ముంచెత్తుతోంది. ఏజెన్నీ ప్రాంతంలోని అలివేరు, జల్లేరు, బైవేరు, వాగు, అశ్వారావుపేట, పడమటి వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఏలూరు జిల్లాలోని పలు ఏజెన్నీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు స్థంభించి పోయాయి. అనకాపల్లి జిల్లా తాండవ, వరహ నదుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. రైవాడ, కొనాం జలాశయాల్లోకి కూడా భారీగానే వరద నీరు వచ్చి చేరుతోంది. అనకాపల్లి జిల్లాలోని తాండవ జలాశయం నీటి మట్టం 370 అడుగులకు చేరుకుంది. అల్లూరి సీతారామారాజు జిల్లా వట్టిగెడ్డ జలాశయం ఉధృతంగా ప్రవహిస్తోంది.