PAWAN KALYAN|పవన్ కల్యాణ్, వీధి వ్యాపారులకు ఇచ్చిన హామీని మరిచారా?
వీధి (చిరు) వ్యాపారుల హక్కుల పరిరక్షణకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి మరో లేఖ రాశారు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఏఎస్ శర్మ.
By : The Federal
Update: 2024-11-17 09:21 GMT
రాష్ట్రంలో వీధి (చిరు) వ్యాపారుల (STREET VENDORS) హక్కుల పరిరక్షణకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) కి మరో లేఖ రాశారు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఏఎస్ శర్మ. రాష్ట్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. 2014లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అమలు కావడం లేదని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2024 ఏప్రిల్ 3న పిఠాపురం వద్ద, అంతకు ముందు 2019లో వీధి వ్యాపారుల సమస్యలను తమ సమస్యలుగా పరిగణించి సరైన పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీని పవన్ కల్యాణ్ కి గుర్తుచేశారు. ఈమేరకు శర్మ నవంబర్ 17న పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. 2024 ఆగస్టు 4న రాసిన లేఖను కూడా జత చేశారు. లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది..
ప్రియమైన పవన్ కల్యాణ్ గారికి,
ఉపముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం.
రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ఆధారంగా 2014లో కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల "జీవనోపాధి" హక్కును గుర్తించి వారి రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చింది. [The Street Vendors (Protection of Livelihood and Regulation of Street Vending) Act, 2014] ఆ చట్టం ప్రకారం మున్సిపాలిటీలు వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేయించకూడదు. వారి అవసరాలకు అనుగుణంగా వారి సమ్మతితో, నగరాలలో వారి దుకాణాలకు తగిన స్థలం కేటాయించాలి.
కావాల్సిన ఆర్థిక సహాయం అందించడం కోసం కేంద్రప్రభుత్వం- ప్రధానమంత్రి "సహాయనిధి"ని ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద నిధులను ఏటా రాష్ట్రానికి కేటాయిస్తున్నది. వీధి వ్యాపారుల సమస్యలకు పరిష్కారం కోసం, ప్రతి మునిసిపాలిటీ లో, వారి ప్రతినిధులతో కూడిన కమిటీలను నియమించి, ఆ కమిటీల సహాయంతో వారి సంక్షేమాన్ని పర్యవేక్షించే బాధ్యత మున్సిపల్ కమిషనర్లకు ఉంది.
చట్టం ఇంత స్పష్టంగా ఉన్నా బాధాకరమైన విషయమేమిటంటే... ప్రభుత్వం కానీ మునిసిపాలిటీలు గాని మానవత్వంతో వ్యవహరిస్తున్నట్టు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనం విశాఖపట్నం మున్సిపాలిటీలో నవంబర్ 16న జరిగిన సంఘటనే. జీవీఎంసీ అధికారులు పోలీస్ సాయంతో విశాఖపట్నం 22వ వార్డ్ లో వీధివ్యాపారుల షాపులను తెల్లవారుజామున బలవంతంగా తీసివేయించారు.
గమనించవలసిన విషయమేమిటంటే ఇంతటి కష్టకాలంలోనూ నిర్వాసితులైన చిరువ్యాపారులు నిన్న మీ (పవన్ కల్యాణ్) పేరు తలుచుకున్నారు. మీ ప్రతినిధులు కాని, జీవీఎంసీ అధికారులు కాని కేంద్రం ప్రవేశపెట్టిన వీధి వ్యాపారుల పరిరక్షణ చట్టాన్ని అర్థం చేసుకోలేదని అనిపిస్తోంది. అర్థం చేసుకుని ఉంటే ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ఉండరు. అందువల్ల నిష్పాక్షికంగా దర్యాప్తు చేయించండి. నిజానిజాలు వెలికితీయించండి. చిరు వ్యాపారులు మిమ్మల్ని నమ్ముకున్నారు.
వీధి వ్యాపారులు SC/ST/OBC వంటి వెనుకబడిన జాతుల వారు. వారిమీద బలప్రదర్శన చట్టవిరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం. ప్రత్యామ్నాయం చూపించకుండా వారిని నిర్వాసితులు చేయడం కేంద్ర చట్ట ఉల్లంఘనగా పరిగణించాలి.
మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.. ఆరు నెలలలో ప్రతి మునిసిపాలిటీ లో వీధి వ్యాపారులనందరినీ 2014 చట్టం క్రింద గుర్తించి రిజిస్టర్ చేయాలి.
ప్రతి మునిసిపాలిటీలో కనీసం మూడు నెలలకు ఒకసారి వీధి వ్యాపారుల ప్రతినిధులతో కూడిన కమిటీల మీటింగులు జరిపి, అధికారులు వారి వ్యక్తిగత, సంఘటిత సమస్యల పరిష్కారాలను అమలు చేయాలి.
మునిసిపాలిటీలలో ప్రతి వార్డులో రిజిస్టర్ అయిన వీధి వ్యాపారులకు స్థలాలను కేటాయించాలి.
ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించకుండా అధికారులు చిరువ్యాపారులను నిర్వాసితులను చేయకూడదు. ఆ విషయంలో ఉల్లంఘన జరిగితే బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి.
ప్రధానమంత్రి సహాయనిధి కింద ప్రతి వ్యాపారికి, ఆర్థిక సహాయం అందచేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాలి
రాష్ట్రస్థాయిలో, వీధి వ్యాపారుల సంక్షేమం విషయంలో, వారి సమస్యల గురించి పర్యవేక్షణ కోసం, ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించాలి. ఆ కమిటీలో వీధి వ్యాపారులకు ప్రాతినిధ్యం కలిగించాలి.
ఇప్పటికైనా, మీరు ఈ విషయం మీద దృష్టి పెట్టి, రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది వీధి వ్యాపారులకు, మీద సూచించిన విధంగా పరిరక్షణ కలిగిస్తారని ఆశిస్తున్నాను.
ఇట్లు,
ఈఏఎస్ శర్మ.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన కొత్తలో అంటే ఆగస్టు 4, 2024లోనూ పవన్ కల్యాణ్ కి రాష్ట్రంలో వీధి వ్యాపారుల సమస్యలపై లేఖ రాశారు. రాష్ట్రంలో లక్షలాది మంది చిరు వ్యాపారులు పట్టణాలు, నగరాలలో బళ్ల మీద, ఫుట్ పాత్ ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ పొట్టబోసుకుంటుంటారని, అటువంటి వారి జీవనోపాధి దెబ్బతినేలా వ్యవహరించవద్దని కోరారు. ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. వాళ్లను కబ్జాదారులు గా పరిగణించవద్దన్నారు.
ఉదాహరణకు, విశాఖపట్నం లో 2024 ఆగస్టు 3న 23వ వార్డులో కోర్టు ఉత్తర్వుల పేరిట 500మంది వీధి వ్యాపారుల కుటుంబాలను బలప్రయోగంతో నిర్వాసితుల్ని చేశారు. విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని కూడా వాళ్లపై ఆరోపణ చేశారు. అటువంటి చిన్నకారు వ్యాపారులలో ఎంతమంది ధనికుల బినామీలు, ఎంతమంది నిజమైన చిరు వ్యాపారస్థులు ఉన్నారో గమనించి అర్హులైన వారికి కేంద్ర చట్టం ఆధారంగా రక్షణ కల్పించాలని శర్మ కోరారు. మున్సిపల్ అధికారులు కోర్టు ముందు సరైన సమాచారం ఉంచడం లేదన్న అనుమానాన్ని కూడా ఆయన పవన్ కల్యాణ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు 2024 ఏప్రిల్ 3న పిఠాపురం సమీపంలో వీధి వ్యాపారులకు ఇచ్చిన హామీని, 2019లో ఇదే విషయమై మాట్లాడిన విషయాలను దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ కు ఈ లేఖలు రాసినట్టు వివరించారు. ఆరు నెలలలో ప్రతి మునిసిపాలిటీ లో వీధి వ్యాపారులనందరినీ 2014 చట్టం క్రింద గుర్తించి, రిజిస్టర్ చేయాలన్నారు. ప్రతి మునిసిపాలిటీ లో కనీసం మూడు నెలలకు ఒకసారి వీధి వ్యాపారుల ప్రతినిధులతో కూడిన కమిటీల మీటింగులు జరిపి, అధికారులు వారి వ్యక్తిగత, సంఘటిత సమస్యల పరిష్కారాలను అమలు చేయాలన్నారు శర్మ.