పల్లెకు పండగ వచ్చినట్లేనా?
పల్లెల్లో పండగ వాతావరణం ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో ఒక్క పని కూడా పంచాయతీల్లో జరగలేదు. నిధులు కేవలం డీబీటీలకే సరిపోయాయి. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారుతున్నాయి.
Byline : G.P Venkateswarlu
Update: 2024-10-16 03:49 GMT
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకొస్తారా? కేవలం మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటాడా? అనే చర్చ పల్లెల్లో మొదలైంది. పంచాయతీలు బలంగా ఉంటే గ్రామాల్లో కావాల్సిన సౌకర్యాలు ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారని గాంధీజీ భావించారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం శుభపరిణామంగా చెప్పొచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అడుడగులు పడుతున్నాయి. గత నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పనులు చేపట్టేందుకు గ్రామ సభలు నిర్వహించారు. ఆ సభల్లో ఎక్కడెక్కడ ఏమి పనులు కావాలో గ్రామ సభల్లో ప్రజలే నిర్ణయించారు. ఈ మేరకు పనులు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్‌ల నుంచి పరిపాలనా ఆమోదం కూడా వచ్చింది. రూ. 4,500 కోట్లతో 30 వేల పనులు చేపడుతున్నారు.
వచ్చే ఆదివారం వరకు అంటే వారం రోజుల పాటు శంకుస్థాపనలు జరగనున్నాయి. సంక్రాంతి నాటికి పనులు పూర్తి కావాలన్నదే లక్ష్యం. కీలకమైన పనులన్నీ ఇప్పటికే గుర్తించారు. దానికి కలెక్టర్లు పరిపాలన ఆమోదాలు ఇచ్చారు. దీంతో పనులన్నీ మొదలు కానున్నాయి. ప్రతి పనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేలా సమాచార బోర్టులు ఏర్పాటు చేయనున్నారు. శంకుస్థాపన చేసిన దగ్గరే ఆయా పనుల పూర్తి వివరాలు బోర్డులో ఉంటాయి. సామాన్యుడు సైతం సులభంగా పనులు, నిధులు, నాణ్యత తెలుసుకునేలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
వారం రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో పనులు చేపట్టేందుకు కార్యక్రమాల రూపకల్పన చేపడుతున్నందున గ్రామాల్లో పండగ వాతావరం నెలకొందని చెప్పొచ్చు. ఐదేళ్లు దాటినా కనీసం అక్కడి రాయి ఇక్కడికి కదిలిన దాఖలాలు లేవు. పంచాయతీల సర్పంచ్‌లు కూడా నిధులు లేక నీరసంగా ఉండిపోయారు. ఉపాధిహామీ నిధులు దారి మల్లకుండా పంచాయతీలకు నేరుగా రావడం వల్ల సర్పంచ్‌లు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో గ్రామ సభలు నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రజలు పనులు చేసేందుకు తీర్మానం కాదు కదా... పనులు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని అర్జీ ఇచ్చినా పరిష్కరించిన దాఖలాలు లేవు. అసలు పంచాయతీరాజ్ నిధులు ఏమయ్యాయో కూడా తెలీదు. కూటమి ప్రభుత్వంలో ప్రతి పని ప్రజలకు తెలియాలి. ప్రజలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయంతో గ్రామ సభలను రికార్డు స్థాయిలో నిర్వహించాం. గ్రామాల్లో ప్రాధాన్యతలను బట్టి ఏ పనులు చేయాలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు చేసిన తీర్మానాలతోనే ఇప్పుడు పనులు మొదలు పెడుతున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కేంద్రం సహకరించడం రాష్ట్రానికి అదనపు బలంగా చెప్పొచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశా నిర్దేశం, కేంద్ర సహకారంతో ముందడుగు వేస్తున్నామని పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నారు.
దాదాపు 10 శాఖలను జాగ్రత్తగా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తేనే పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ఉపాధి హామీ పథకం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా ప్రజలు భావిస్తున్నారు. దానిని సరిగా వినియోగించుకుంటే గ్రామాల్లో చాలా పనులు చేసుకోవచ్చు. కేంద్రం దీనికి వెచ్చిస్తున్న నిధులను, పనిదినాలను గ్రామీణుల జీవన స్థితిగతులు మార్చడానికి ఉపయోగ పడతాయి.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎదురుమొండి – గొల్లమంద పరిధిలోని లంక గ్రామాకు రహదారులు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ వద్ద ప్రతిపాదించారు. ఈ పనులను కూడా పూర్తి చేసేందుకు పవన్ ఆదేశాలు ఇచ్చారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని 43 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని, అక్కడ నీటిని ఓ బాటిల్‌లో పట్టి పవన్ కళ్యాణ్‌కు వివరించారు. దీనిపై గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్కడి సమస్యను తీర్చాలని పవన్ ఆదేశించారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారం అయినట్లైంది. మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైను విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామాల కలలు సాకారం కావాలి, చిత్తశుద్ధి, పారదర్శకత, అభివృద్ధి కాంక్షతో పనులన్నీ చేపడితే ప్రజలకు గ్రామాల్లో కావాల్సిన సౌకర్యాలు ఏర్పడతాయని పలువురు గ్రామ నాయకులు చెబుతున్నారు. రోడ్లు, పాఠశాలలకు ప్రహరీలు, ఉద్యానవనాలు, ట్రెంచ్‌లు, రూఫ్‌టాప్ లు, పారిశుద్ధ్య పనులు ఇలా ప్రాధాన్యం ఉన్న పనులన్నీ ప్రభుత్వం చేపడుతోంది. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 120 పాఠశాలలకు ప్రహరీలు, ప్రభుత్వ కార్యాలయ భవనాలకు రూఫ్ టాప్స్, సామాజిక భవనాలు జరగాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా తయారు చేశారు.
అలాగే ఆర్థిక సంవత్సరంలో రూ. 25.50 కోట్ల పని దినాలు, 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని ఉపాధిహామీ ద్వారా జరగాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టకున్నది. ఊరి అభివద్ధి కోసం జరుగుతున్న పల్లె పండగలో గ్రామస్థులంతా ఉమ్మడిగా పాలు పంచుకోవాలని ప్రభుత్వం పిలుపు నిచ్చింది. దీనిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామం కోసం కదిలితే తప్పకుండా పనులు పూర్తవుతాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు ముందుండి నడిపించాలని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు.