పొట్టి శ్రీరాములు త్యాగం నీరుగారినట్టేనా?
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు. ఆయన చేసిన త్యాగం నీరుగారినట్టేనా..
Update: 2024-03-16 11:09 GMT
పొట్టి శ్రీరాములు.. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేసిన అమరజీవి. ఈయన గురించి తెలియని తెలుగువాళ్లు ఉండరనడం అతిశయోక్తేమీ కాదు. ఈయన గురించి ప్రతి ఒక్కరు తమ విద్యార్థి దశలోనే నేర్చుకుంటారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన ఉద్యమాలు, పడిన కష్టాలు అన్నింటి గురించి పాఠశాలల్లో నేర్చుకునే ఉంటారు. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు జార్జిటౌన్‌లో అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నెంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు ఆయన జన్మించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ఏం చేశారో మరోసారి స్మరించుకుందాం.. ఆయన జ్ఞాపకాలు నేటికీ తమిళనాడులో ఉన్నాయి. ఒకనాడు తెలుగు ప్రజలకు ప్రధాన పట్టణం మద్రాసులోనే ఆయన తన దీక్షను ప్రారంభించారు. ఆయన స్మారకార్థం 1956లో మైలాపూర్, 215 రాయపేట హైరోడ్డు వద్ద ఆయన అద్దెకు ఉన్న ఇంటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2001లో అక్కడ మూడంతస్తుల భవనాన్ని నిర్మించింది.
రగిలిన ప్రత్యేకాంధ్ర ఉద్యమం
1952లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక తెలుగు రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టారు. ప్రారంభంలో ఎవరూ ఈ దీక్షను పట్టించుకోలేదు. ఇలాంటి ఉద్యమాలు షరా మామూలే అనుకున్నారంతా. కానీ దీక్షలో భాగంగా పొట్టి శ్రీరాములు ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతున్న కొద్దీ రాష్ట్రంలో అక్కడక్కడా ప్రజల నుంచి ఆయన దీక్షకు విశేష స్పందన వచ్చింది. నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. పత్రికల దృష్టి కూడా ఈ ఉద్యమంపై పడింది. ఆయన దీక్ష ప్రారంభించిన 40 రోజుల తర్వాత కేంద్రం కూడా దిగొచ్చింది. తమ దూతగా నీలం సంజీవరెడ్డిని పంపి నిరాహార దీక్ష విరమించాలని శ్రీరాములను కోరింది. కానీ తన లక్ష్యం నెరవేరే వరకు దీక్షను విరమించేది లేదని శ్రీరాములు స్పష్టం చేశారు. ‘‘నేను గాంధీ అనుచరుడిని అందుకే ఎక్కడా ఘర్షణలు జరగకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం శాంతియుతంగా పోరాడాలి’’ అనే సందేశాన్ని తెలుగు ప్రజలకు పంపించారు శ్రీరాములు. 1952 డిసెంబర్ 15న ఆయన దీక్షలోనే తుదిశ్వాస విడిచారు.
మద్రాసుకు కదిలిన ఆంధ్ర రాష్ట్రం
పొట్టి శ్రీరాములు మరణ వార్త తెలిసిన వెంటనే తెలుగు ప్రజలంతా మద్రాసుకు చేరుకున్నారు. మరుసటి రోజు అనగా 1952 డిసెంబర్ 16 మధ్యాహ్నం 2గంటలకు పొట్టి శ్రీరాములు అంతిమయాత్రను ప్రారంభించారు. ఆ సమయంలో ఆంధ్రలో అనేక ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ఆ అల్లర్లు అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు. వాటిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఉద్యమానికి గుర్తుగానే ఆంధ్ర రాష్ట్ర పితగా ఆయనను పేర్కొంటారు.
ఆఖరి రోజు ఇలా
తన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నా దీక్షను మాత్రం విరమించుకోలేదు పొట్టి శ్రీరాములు. ఆరోగ్యం క్షీణించే కొద్దీ ఆయనలోని పట్టుదల పెరుగుతూనే వచ్చింది. తన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన తన ఉత్తరాల్లో చెప్పేవారు. 15 డిసెంబర్ 1952.. శ్రీరాములు ఆత్మార్పణ చేసిన రోజు. ఆ రోజు ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. చేయి కదిలించడానికి కూడా ఓపిక లేదు. 40 రోజుల్లోనే ఆయన 15.8 కిలోల బరువు తగ్గారు. నాడి, శ్వాసలో కూడా మార్పు వచ్చింది. సుమారు 16 గంటల పాటు మూత్రం స్తంభించింది. దీంతో ఆయన సందర్శకులను నిలిపివేశారు. ఆయన నోట మాట రావడం కూడా చాలా కష్టంగా మారింది. సాయంత్రం సమయంలో తన దగ్గరకు వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు, ఆయన సతీమణిని ఆయన చిరునవ్వుతోనే పలకరించారు. అప్పటి నుంచి ఆయన శరీరం మెల్లగా చట్టబడటం ప్రారంభమైంది. సుమారు రాత్రి 11:23 గంటలకు ఆంధ్ర రాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకున్నారు.
పర్యవసానాలు
పొట్టి శ్రీరాములు ప్రాణాలు కోల్పోయారు అన్న వార్త విన్న ప్రతి ఆంధ్రుడు ఆగ్రహంతో ఊగిపోయారు. రాష్ట్రమంతా ఆందోళనలు, అల్లర్లకు దిగారు. పొట్టి శ్రీరాములు అంతిమయాత్రలో కూడా వారు నినాదాలు చేయడంతో పాటు ఆయన చేసిన త్యాగాన్ని కొనియాడారు. అప్పుడు రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లతో ప్రభుత్వం కూడా దిగొచ్చింది. డిసెంబర్ 19న ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించారు. అనంతరం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రులు ఒక్కరోజు కూడా మద్రాసులో ఉండకూడదని, మద్రాసును ఒక్క క్షణం కూడా రాజధానిగా ఉంచుకోకూడదంటూ చక్రవర్తుల రాజగోపాలాచారి తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఏడాది 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా బళ్ళారి, బరంపురం, హోస్సేట, తిరువళ్ళూరు వంటి తెలుగు ప్రాంతాలను వదులుకుని ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు.