ఈ నెల 8న జగన్ అనంతపురం జిల్లా టూర్
పరిటాల రవి హత్య వెనుక జగన్‌మోహన్‌రెడ్డి హస్తం ఉందని ఇటీవలె పరిటాల సునీత వ్యాఖ్యలు చేశారు.;
By : The Federal
Update: 2025-04-05 08:47 GMT
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటించనున్న నేపథ్యంలో మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే, పరిటా రవి భార్య, పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పరిటాల హత్య వెనుక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హస్తం ఉందని, ఈ కేసులో జగన్‌ను సీబీఐ కూడా విచారించిందని పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తాజాగా చర్చనీయాంశంగా మారాయి.
మరో వైపు పరిటాల రవికి, ఆ కుటుంబానికి చిరకాల ప్రత్యర్థి అయిన మద్దెలచెరువు సూరీ భార్య గంగుల భానుమతి రంగంలోకి దిగారు. పరిటాల హత్య గురించి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పరిటాల రవి హత్య వెనుక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హస్తం లేదని, పరిటాల రవి హత్యతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధం లేదని భానుమతి వెల్లడించారు.
హత్యలు చేయడం, తర్వాత వారికి సానుభూతి తెలపడం పరిటాల కుటుంబానికి అలవాటేనని మండిపడ్డారు. తన భర్త మద్దెలచెరువు సూరీ, సానే చెన్నారెడ్డి కుటుంబాలను అడ్డుపెట్టుకుని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు తోపుతుర్తి ప్రకాశ్‌రెడ్డి రాజకీయాలు చేస్తున్నరన్న పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపైన కూడా గంగుల భానుమతి స్పందించారు. ఇవి అర్థరహితమని ఆమె కొట్టిపడేశారు. అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నాయకుడు కురుబ మజ్జిగ లింగయ్యను పరిటాల సునీత కుటుంబ బంధువులే చంపారని సంచలన ఆరోపణలు చేశారు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల రవి హత్య గురించి గురువారం మాట్లాడుతూ ఈ వివాదాలకు తెరలేపారు. టీవీ బాంబు గురించే తోపుతుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరులు మాట్లాడుతున్నారని, కారు బాంబు గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని, ఈ కేసులో ప్రకాశ్‌రెడ్డి సోదరులు జైలుకు కూడా వెళ్లొచ్చారని పరిటాల సునీత మాట్లాడారు. కారు బాంబుతో పాటు టీవీ బాంబు ఘటనల్లో 45 మందిని ప్రకాశ్‌రెడ్డి సోదరులు పొట్టన పెట్టుకున్నారని, దీనికి సమాధానం చెప్పిన తర్వాతే జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో అడుగు పెట్టాలని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 8న శ్రీసత్యసాయి జిల్లాలో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. రాప్తాడు నియోజక వర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. ఆ మేరకు పర్యటన ఖరారైనట్లు మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి శనివారం ప్రకటించారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి మాజీ ఎమ్మెల్యేలు తోపుతుర్తి ప్రకాశ్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశరరెడ్డి, శంకర నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్యతో చర్చించనట్లు తెలిపారు. అయితే వైసీపీ నాయకుడు కురుబ మజ్జిగ లింగమయ్య ఉగాది నాడు టీడీపీ శ్రేణుల చేతుల్లో హత్యకు గురయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలు మరో సారి గుప్పుమన్నాయి. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నాయకుడు కురుబ లింగమయ్య హత్యతో ఇవి మరో సారి తెరపైకొచ్చాయి. ఈ క్రమంలో అటు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ, ఇటు అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఆదిపత్య పోరులో ఇంకా ఎన్ని హత్యలు చోటు చేసుకుంటాయో అన్న ఆందోళన అనంతపురం జిల్లా వాసుల్లో నెలకొంది. దీంతో ఈ నెల 8న జగన్ పర్యటన సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయో అనే ఆందోళన నెలకొంది.