జగన్‌కు తెలుసని సిట్ అధికారులను మార్చారు
డీఎస్పీలను మార్చి, వారికి బదులుగా వేరే అధికారులను సిట్‌లో సభ్యులుగా చేర్చారు.;
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)లో మార్చులు చేశారు. సిట్‌లో నియమించిన కొంత మంది అధికారులకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సబంధాలు ఉన్నాయని ఈ మార్పులు చేపట్టారు. ఏకంగా నలుగురు డీఎస్పీలను సిట్ నుంచి తొలగించారు. ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా మీద ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఈ సిట్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వరరావుతో పాటు నలుగురు డిఎస్పీలను సభ్యులుగా నియమించారు. విచారణ చేపట్టి నివేదికను సమర్పించాలని ఈ బృందాన్ని ప్రభుత్వం ఆదేశించింది.
అయితే సిట్‌లో సభ్యులుగా ఉన్న డిఎస్పీలు టీ అశోక్‌వర్థన్‌రెడ్డి, ఎం బాలసుందరరావు, ఆర్ గోవిందరావుతో మరో డిఎస్పీకి మాజీ సీఎం జగన్‌కి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో సత్ససంబంధాలు ఉన్నాయని, వారికి అనుకూలంగా ఉన్నారనే కారణంతో వీరిని తొలగించారు. వీరికి బదులుగా వేరే అధికారులను సభ్యులుగా నియమించారు. ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ నుంచి ఒక డిఎస్‌ఓ, ఒక డీఎంను సిట్ సభ్యులుగా నియమించారు. కాకినాడలో పని చేస్తున్న బీసీ సంక్షేమ శాఖ ఈడీ ఎ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ కర్నూలు జిల్లా జాయింట్ డైరెక్టర్ పి రోహిణి, విజయనగరం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కే మధుసూదన్‌రావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎం బాలసరస్వతిలను సిట్ సభ్యులుగా నియమించారు. కాకినాడ జిల్లాలోని కరప, కోరింగ, పోర్టు, ఇంద్రపాలెం తదితర పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నమోదైన కేసులతో పాటు వాటికి సంబంధం ఉన్న పలు రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులను కూడా ఈ సిట్ విచారణ చేపట్టనుంది.