జగన్ ఓదార్పు రాజకీయం: వంశీపై అంత ప్రేమెందుకు?

తనను నమ్మి వచ్చిన కమ్మ సామాజికవర్గం వెనుక నేనున్నాననే భరోసా కల్పించడం కోసమే వైఎస్ జగన్ విజయవాడ జైలుకు వెళ్లి వంశీని పరామర్శిస్తున్నారా?;

Update: 2025-02-18 06:09 GMT
YS jagan with Vamsi and Nandigam suresh
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై తాజాగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమ పార్టీలో కీలక నేతలుగా ఉన్న రెండు వర్గాల నేతల్ని ఓదార్చడంలో తేడాలున్నాయన్న గుసగుసలు వినపడుతున్నాయి. దళిత నాయకుడు నందిగం సురేశ్ అరెస్ట్ అయినపుడు ఎంతోకాలానికి గాని పరామర్శించని జగన్ ఇప్పుడు బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆఘమేఘాల మీద వచ్చి పరామర్శించడంలో మతలబు ఏమిటన్న దానిపై వైసీపీలోనే చర్చ సాగుతోంది. ఇద్దరూ వివిధ కేసుల నేపథ్యంలో కష్టాల్లో ఉన్నవారే. ఇద్దరూ టీడీపీ కార్యాలయాలపై దాడుల కేసుల్లో నిందితులే. నందిగం సురేశ్ టీడీపీ మంగళగిరి కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ కాగా, ఇప్పుడు వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయ్యారు. జగన్ వారిపై చూపుతున్న తీరులో తేడా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ నేతలు వైసీపీ అధినేత జగన్ తీరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
"అనేక కేసుల్లో ముద్దాయి, అసాంఘిక శక్తిగా పేరుగాంచి, మహిళల వ్యక్తిత్వ హననం చేసిన వంశీని జైల్లో పరామర్శించేందుకు జగన్‌ వెళ్లడం మహిళలను, దళితులను అవమానించడమే" అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. వంశీ పట్ల జగన్‌ చూపిస్తున్న ప్రేమ వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. జగన్‌కు దళితులంటే చిన్నచూపు అని, అందుకే తన కోసం పనిచేసిన దళిత రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ విజయపాల్‌ జైలుకు వెళితే ఆయన పరామర్శకు వెళ్లలేదని వర్ల రామయ్య ఆరోపించారు.
నందిగం సురేష్ పై జగన్ నిర్లక్ష్యమేనా?
నందిగం సురేష్, గుంటూరు జిల్లా బాపట్ల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఎంపీగా గెలిచిన దళిత నేత. జగన్ చేపట్టిన పాదయాత్ర మొదలు అమరావతి రాజధాని రైతుల వ్యతిరేక పోరాటం వరకు అనేక అంశాలలో జగన్ కు తోడూనీడగా ఉన్నవారు. ఆయనపై నమోదైన కేసులతో ఇటీవల అరెస్టయ్యారు. పోలీసులు నానా విధాలుగా వేధించారు. ఆ కేసుల్లో వైసీపీ నుంచి గట్టి స్పందన రాలేదని, జగన్ సహా పార్టీలోని ఒకరిద్దరు మాత్రమే కంటితుడుపుగా వచ్చి సురేశ్ ను పరామర్శించి వెళ్లారన్నది దళితవర్గాల వాదనగా ఉంది. నిజానికి జగన్ వ్యక్తిగతంగా గుంటూరు జైలుకి వెళ్లి సురేష్‌ను పరామర్శించి వచ్చారు.
వైఎస్ జగన్ 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తరచూ చెప్పిన మాట.."నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు"అని. ఓరకంగా అది నిజమేనని ఆయన పార్టీకి వచ్చిన 40.9 శాతం ఓట్లు నిరూపిస్తుంటాయి. మరి అటువంటి వర్గానికి చెందిన సురేశ్ ను జగన్ విస్మరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా కక్షసాధింపులకు గురవుతున్న వారు కూడా ఈ వర్గాల వారే అన్నారు గుంటూరు జిల్లాకే చెందిన రిటైర్డ్ టీచర్ జి.శౌరయ్య.
ప్రజాస్వామ్యంలో దళిత నేతలకు సమాన స్థాయిలో మద్దతు ఇవ్వాలని చెబుతున్న వైసీపీ, ఇదే సందర్భంలో తన దళిత నేతల్ని రక్షించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయకపోవడం టీడీపీకి ఆయుధంగా మారింది.
వల్లభనేని వంశీని పరామర్శించడమేంటి?
నిజానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ నాయకుడు కాదు. టీడీపీ టికెట్ పై గెలిచి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్ఠీ ఫిరాయించిన వ్యక్తి. ఆ తర్వాత ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానీతో కలిసి నానా తిట్లు తిట్టారు. ఒక దశలో చంద్రబాబు భార్య భువనేశ్వరిని కించపరిచేలా కామెంట్లు చేశారు. దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు మండిపడడంతో క్షమాపణ చెప్పారు. చంద్రబాబు, వంశీ, కొడాలి నానీ ఒకే సామాజికవర్గానికి చెందిన వారే అయినా ఎక్కడ తేడా వచ్చిందో గాని విమర్శలు మాత్రం తారాస్థాయిలో ఉండేవి. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పై వ్యక్తిగతంగానూ విమర్శలు చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. వంశీపై వివిధ కేసులు నమోదయ్యాయి.
తాజాగా, భూ కబ్జాలు, కిడ్నాప్, టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసుల్లో ఆయన జైలులో ఉన్నారు. అయితే, ఈ సందర్భంలో జగన్ వెంటనే స్పందించి వంశీని పరామర్శించడానికి సిద్ధమవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
వంశీని పరామర్శించడానికి జగన్ వెళుతున్నట్లు సమాచారం రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇందులో కొన్ని ముఖ్య కారణాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు:
తెలుగుదేశంపై ప్రభావం చూపే వ్యూహం
తాను అధికారం కోల్పోయిన తర్వాత కూడా వంశీకి మద్దతుగా ఉండటం ద్వారా జగన్, పార్టీ అనుబంధాన్ని, విశ్వాసాన్ని చూపించాలనుకుంటున్నారని అనుకోవచ్చు.
వంశీకి మద్దతుగా నిలబడటం ద్వారా, టీడీపీ మాజీ నేతలను వైసీపీ కాపాడుతుందనే నమ్మకాన్ని కలిగించడం, ఆర్ధికంగా బలమైన కమ్మ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలన్న వ్యూహాత్మక దృష్టితో జగన్ ఉండొచ్చని అర్థం అవుతోంది.
వంశీ సామాజికవర్గానికి అనేక నియోజకవర్గాల్లో ప్రభావం ఉంది. అలాంటి నేతను పూర్తిగా మర్చిపోవడం కన్నా, అతనికి మద్దతు ఇచ్చినట్లయితే సమాజంలో ఓటర్లకు సానుకూల సంకేతాలు పంపే అవకాశముంది.
తన పరామర్శల విషయంలో ఎక్కడా సెంటిమెంట్‌ను ఆధారం చేసుకోకుండా, పూర్తిగా రాజకీయ లెక్కలతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు, వర్గాల సమీకరణలు, భవిష్యత్తులో పార్టీకి కలిగే లాభనష్టాలు చూసే జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రస్తుత రాజకీయ సమీకరణాలను సూచిస్తున్నప్పటికీ వైసీపీ వర్గాల్లో ఈ వ్యూహంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
Tags:    

Similar News