త్యాగం తెచ్చిన తంటా.. హైకమాండ్‌పై పోతిన మహేష్ ఒత్తిడి

బీజేపీకి త్యాగం చేసిన విజయవాడ పశ్చిమ సీటు పవన్‌కు కొత్త తలనొప్పి తెచ్చింది. ఆ సీటును తనకే కేటాయించాలంటూ జనసేన నేత పోతిన మహేష్ డిమాండ్ చేస్తున్నారు.

Update: 2024-03-26 07:52 GMT
Source: Twitter

ఆంధ్రలో ప్రస్తుతం అసమ్మతి రాజకీయాలు వెరసిల్లుతున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏదో ఒక పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తూనే ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేనలో ఈ అసమ్మతి స్వరం మరింత గట్టిగా వినిపిస్తోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌కు మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. పొత్తులో భాగంగా తనకు ఇచ్చిన స్థానాల్లో కొన్నింటిని పవన్.. బీజేపీకి త్యాగం చేశారు. ఇప్పుడు ఆ త్యాగమే పవన్‌కు తల పోటుగా మారింది. బీజేపీకి ఇచ్చిన స్థానాల్లో విజయవాడ పశ్చిమం కూడా ఒకటి. ఆ సీటే ప్రస్తుతం పవన్ పంటి కింద రాయిలా తయారైంది. విజయవాడ పశ్చిమ సీటు తనకే దక్కుతుందన్న ఆశతో జనసేన నేత పోతిన మహేష్.. ఆ స్థానాన్ని బీజేపీకి త్యాగం చేయడపం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష కూడా చేపట్టారు. విజయవాడ పశ్చిమ సీటు తనకే ఇవ్వాలంటూ మంకుపట్టుపట్టి కూర్చున్నారు.

ప్రచారం కూడా చేసిన మహేష్
విజయవాడ పశ్చిమ సీటు తనకే వస్తుందని పోతిన మహేష్ ఆఖరి నిమిషం వరకు కూడా ధీమాగా ఉన్నారు. దాంతోనే ఆయన నియోజకవర్గంలో జోరుగా ప్రచారం కూడా ప్రారంభించేశారు. పార్టీ కార్యాలయం, కార్యకలాపాలంటూ బాగానే ఖర్చు కూడా పెట్టారు. పార్టీ అధికార ప్రతినిధిగా పోతినను గౌరవించిన పవన్ సీటు విషయంలో మాత్రం మాటతప్పారు. ముందు వెనకా ఆలోచించకుండా విజయవాడ పశ్చిమ సీటును త్యాగం చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన మహేష్.. ఈ సీటు తనకే ఇవ్వాలంటూ పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తాను, జనసైనికులు ఎంతో కష్టపడ్డారని, రాత్రంబవళ్లు ప్రజల సమస్యల పరిష్కారం కోసం శ్రమించామని చెప్పారాయన.
‘‘పలు వర్గాల్లో మౌలిక వసతుల కల్పన కూడా మా వల్లే సాధ్యమైంది. నియోజకవర్గంలో జనసేన ప్రాభల్యం పెరగడంతోనే వైసీపీ తమ అభ్యర్థిని మార్చేసింది. ఇక్కడి సిట్టింట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను వేరే చోటకు పంపింది. ఇప్పుడు ఈ సీటును బీజేపీకి కేటాయించడం సరైన పని కాదు. ఇది మాకు తీరని అన్యాయం చేయడమే. విజయవాడ పశ్చిమంలో జనసేన నేత కాకుండా కూటమికి చెందిన ఏ ఇతర అభ్యర్థి పోటీ చేసినా గెలుపు సాధ్యం కాదు. ఎవరూ వైసీపీని ఓడించలేదు. వైసీపీని చిత్తు చేయాలంటే నాకే సీటు ఇవ్వాలి’’అని తెలిపారు.
పవన్‌పై నమ్మకం ఉంది
‘‘రెండో జాబితాలో నా పేరు ఉంటుందని చెప్పారు. అందుకే దూకుడుగా పని చేసుకుంటూ వెళ్తున్నా. నాకు పవన్ అన్యాయం చేయరన్న నమ్మకం నాకు ఉంది. నియోజకవర్గ ప్రజలు కూడా ఈ టికెట్ నాకే ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ విషయంపై పవన్ మరోసారి పునరాలోచన చేయాలని కోరుతున్నా. పార్టీ కోసం ఎంతో కష్టపడిన వారికి అన్యాయం చేయొద్దని కోరుకుంటున్నా’’అని వెల్లడించారు పోతిన మహేష్. అయితే విజయవాడ పశ్చిమ సీటును బీజేపీకి ఇచ్చేడంతో అక్కడి అభ్యర్థి విషయంలో పవన్ చేయగలింది ఏమీ లేదని, దీనిని బట్టి చూస్తుంటే పోతిన మహేష్‌కు నిరాశే ఎదురు కావొచ్చని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టికెట్ రాని పక్షంలో పోతిన మహేష్ పార్టీ మారుతారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఏది ఏమైనా జనసేన తరపునే మహేష్ నిలుస్తారని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి టికెట్ రాని పక్షంలో మహేష్ ఏం చేస్తారో వేచి చూడాలి.
Tags:    

Similar News