రాజ్ కసిరెడ్డి అరెస్ట్ సక్రమమే, సజ్జల కుమారుడికి బెయిల్ ఇవ్వలేం
ఒకే రోజు ఇద్దరు వైసీపీ కీలక వ్యక్తులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.;
By : The Federal
Update: 2025-05-23 12:45 GMT
ఒకే రోజు ఇద్దరు వైసీపీ కీలక వ్యక్తులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రెండు వేర్వేరు కేసులు అయినప్పటికీ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మద్యం కుంభకోణంలో తన అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన రాజ్ కసిరెడ్డికి, సోషల్ మీడియా పోస్టింగుల కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి చుక్కెదురైంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇద్దరూ కీలక పదవుల్లో ఉన్నవారే. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి అరెస్టును సుప్రీం కోర్టు సమర్థించగా, వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి ముందస్తు బెయిల్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
మద్యం స్కాంలో రాజ్ కసిరెడ్డి అరెస్ట్ సక్రమమే
రూ.3,200 కోట్ల మద్యం స్కాం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి అరెస్టు చట్టబద్ధమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తన అరెస్ట్ అక్రమం అంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ వాదనకు "విలువ లేదు" అంటూ కొట్టివేసింది. అయితే, సాధారణ బెయిల్ కోసం కిందికోర్టుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
SIT రిపోర్ట్ ప్రకారం, 2019–2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో లంచాల ఆధారంగా జరిగిన మద్యం కొనుగోలు, విక్రయ వ్యవస్థలో రాజ్ కసిరెడ్డి కీలకపాత్ర పోషించారు. పేరున్న మద్యం బ్రాండ్లను తొలగించి, ప్రత్యేకంగా ప్రోత్సహించిన బ్రాండ్లకు భారీగా ఆర్డర్లు పెట్టి, లంచాలు వసూలు చేసి, వాటిని వైఎస్సార్సీపీ నేతలకు అందించారని ఆరోపణలు ఉన్నాయి.
సజ్జల కుమారుడి పోస్టులపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
మరోవైపు, వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డిపై అసభ్యకర సోషల్ మీడియా పోస్టుల కేసులో ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం ఈ సందర్భంగా భార్గవ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
“మీరు పోస్టులు పెట్టేటప్పుడు ఆలోచించరా? ఇవి భరించలేని స్థాయికి వెళ్లాయి. ఎవరి చేసినా తప్పే. వీటిని వ్యవస్థ క్షమించదు. ఇలా చేస్తే ప్రతి ఒక్కరూ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తారు. సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో బెయిల్ త్వరగా వస్తుందని ఊహించొద్దు,” అని బెంచ్ స్పష్టం చేసింది.
అయితే భార్గవ్ ను అరెస్టు చేయకుండా రెండు వారాల మధ్యంతర ఉపశమనం కల్పించింది. ఆలోపు ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
ఒత్తిడులు పెరుగుతున్నాయా?
ఈ రెండు కీలక తీర్పులతో వైసీపీ పాలనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు నేరారోపణల నేపథ్యంలో కోర్టుల నుంచి ఉపశమనం పొందవచ్చుననే ఆలోచనకు స్వస్తి పలుకుతారా అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మద్యం స్కాం వ్యవహారంలో ఆరోపణలు, మరోవైపు సోషల్ మీడియా దుర్వినియోగం కేసులు – ఈ రెండూ వ్యవస్థపై అధికారం దుర్వినియోగానికి సంకేతమా? అన్న చర్చను మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి.