బాబూ, వంశీ.. ఆ ఫోన్ ఎక్కడుందో చెప్పు నాయనా!
'బాబూ వంశీ, నీ మొబల్ ఫోన్ ఇస్తే మిగతా వ్యవహారాలు మేము చూస్కుంటాం' అంటూ పోలీసులు వంశీని నయానా భయానా అడుగుతున్నారట.;
By : The Federal
Update: 2025-02-16 02:45 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రతీకార రాజకీయాలతో అట్టుడుకుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్లను అరెస్ట్ చేసినట్టే ఇప్పుడు టీడీపీ- వైసీపీ వాళ్లను వెంటాడుతోంది. తాజాగా గన్నవరం మాజీ ఎంఎల్ఏ, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారం తాజా ముచ్చట. ఏ ఇద్దరు గుమికూడినా ఇదే చర్చ. వంశీని ఏంచేస్తారోనని ఒకరు, ఆ.. ఏమవుతుందిలే ఐదారు నెల్లు జైల్లో ఉండొస్తారని మరొకరు వ్యాఖ్యానించుకోవడం చాలా మామూలు విషయంగా మాట్లాడుకుంటున్నారు. ఇదొక పక్క సాగుతుంటే మరోపక్క.. వంశీ సెల్ ఫోన్ కోసం పోలీసులు వెంటాడుతున్నారు. 'బాబూ వంశీ, నీ మొబల్ ఫోన్ ఇస్తే మిగతా వ్యవహారాలు మేము చూస్కుంటాం' అంటూ పోలీసులు వంశీని నయానా భయానా అడుగుతున్నారట. పోలీసు కస్టడీకి ఇచ్చే లోపు ఆ ఫోన్ సంగతి చెప్పమంటున్నారట. మొత్తానికి వంశీ మొబైల్ ఫోన్ ఇప్పుడు కీలకం అయింది.
ఇక టీడీపీ శ్రేణులు మాత్రం కేరింతలు కొడుతున్నాయి. "ఎలాగైతేనేం.. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ తమ కక్ష తీర్చుకున్నారు" అని బాహాటంగానే చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం గతంలో పీవీ నరసింహారావు మాదిరి చట్టం తన పని తాను చేసుకుపోతుందనే లెవెల్లో.. తనకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. లోకేశ్ రెడ్ బుక్ ను కచ్చితంగా అమలు చేస్తామని గతంలో చెప్పారు. అందువల్ల భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.
ఇంకోపక్క వైసీపీ వాదన ఎలా ఉందంటే..
వల్లభనేని వంశీ తప్పు చేశాడా? లేదా? అనేది ప్రధానం కాదని, అసాధారణమైన రీతిలో ఏపీ పోలీసులు స్పందిస్తున్న తీరు, డీజీపీ స్థాయిలో ఉన్నవారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు.
వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్(Gannavaram TDP Office)పై దాడి చేయించారన్నది అభియోగం. దానిపై కేసు పెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి?. వంశీనికాని, గన్నవరం వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాని టీడీపీ నేతలు రెచ్చగొట్టారా? లేదా?. వంశీని అనరాని మాటలు అన్నారా? లేదా?. అయినా టీడీపీ ఆఫీస్ పై దాడి చేయాలని ఎవరూ చెప్పరు. అప్పట్లో విజయవాడ నుంచి ఒక టీడీపీ నేత గన్నవరం దండెత్తివెళ్లారా? లేదా?. ఫలితంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయా? లేదా?. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభ్యంతరకర భాషలో ఆ టీడీపీ నేత దూషించారా? లేదా?. చివరికి ఈ గొడవలు చిలికి, చిలికివానగా మారి వంశీ కుటుంబ సభ్యులను టీడీపీ సోషల్ మీడియాలో అనరాని మాటలతో వేధించారు. ఆ క్రమంలో చంద్రబాబు(Chandrababu) కుటుంబ సభ్యులపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత ఆయన రియలైజ్ అయి క్షమాపణ కూడా చెప్పారు. అయినా టీడీపీ నేతలు ఆయనను వెంటాడుతూనే ఉన్నారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.
గత సీఎం జగన్‌ను చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఎన్నెన్నో మాటలన్నారని, ‘సైకో’ అనే తిట్టేవారని, అయినా వాళ్ల జోలికి జగన్ పోయారా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ కూడా స్కిల్ డెవలప్ మెంట్ కేసే గాని ఇలాంటి తిట్లు, శాపనార్థాలకు సంబంధించినది కాదని చెబుతున్నారు. ప్రభుత్వ నిధులు అక్రమ మార్గాల ద్వారా టిడిపి ఆఫీస్ అక్కౌంట్ కు చేరాయని సిఐడి విచారణలో తేలిందా?లేదా?. ఆ విషయంపై ఇంతవరకు టీడీపీ సమాధానం ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు.
చంద్రబాబు కేసెందుకు పెట్టలేదని వైసీపీ ప్రశ్న...
చంద్రబాబు భారను వంశీ అవమానించారనుకుంటే, చంద్రబాబు,లోకేశ్ నిజంగానే తమ మనోభావాలు గాయపడ్డాయని అనుకుంటే తమ కుటుంబంలోని వారిపై చేసిన వ్యాఖ్యల మీద కేసు పెట్టాలి గాని టీడీపీ కార్యకర్తలతో కేసులు పెట్టించడమేమిటని వైసీపీ వాళ్లు కొత్త వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు. "వంశీ కుటుంబ సభ్యులపై టీడీపీవారు చేసిన అసభ్యకర, అసహ్యకర పోస్టింగ్‌లు, మాజీ సీఎం జగన్ కుటుంబంపై పెట్టిన నీచాతినీచ పోస్టింగులు అన్ని జనం దృష్టికి వస్తాయని సందేహించారా?. చంద్రబాబు,లోకేశ్ లకు చిత్తశుద్ది ఉంటే తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టి ఉండాలి. అలాగే వంశీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు కూడా తీసుకోవాలని చెప్పగలగాలి. ఆ పని చేయకుండా ఏదో ఒక పిచ్చి కేసులో వంశిని ఇరికించాలని చూడడం పిరికితనంగా కనిపిస్తుందని" వైసీపీకి మద్దతు ఇస్తున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ ఆఫీస్(TDP Office) పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారు ఎదురుతిరిగారు. దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు సర్కార్ హుటాహుటిన పోలీసులను రంగంలోకి దించి వంశీని అరెస్టు చేసింది. వంశీపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో రాశారు. టీడీపీ నేతలు కొందరు వంశీని పశువు అని, అదని ఇదని తిడుతున్నారు. మరి అదే నిజమైతే ఆ పశువుతో పాటు సుమారు రెండు దశాబ్దాలు కలిసి నడిచినవారు ఏమవుతారు!. అసలు దాడి కేసు ఏమిటి?. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం ఏమిటి?ఈ చట్టం కింద అయితే వెంటనే బెయిల్ రాకుండా చేయవచ్చన్నది వ్యూహం. ఇందుకోసం పనికట్టుకుని ఆ వర్గానికి చెందినవారిని తీసుకు వచ్చి కేసులు పెట్టిస్తున్నారన్న అభిప్రాయాన్ని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
వేట ముమ్మరమైందీ..
ఏది ఏమైనా, తెలుగుదేశం ప్రభుత్వం వంశీ అరెస్ట్ తో ఆగదు. కొడాలి నాని ,పేర్ని నాని, అంబటి రాంబాబు వంటివారి వరకు కొనసాగవచ్చు. వైసీపీ నేతల అరెస్టుల పర్వం మున్ముందు మరింత వేగంగా సాగవచ్చు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్‌ను అపహరించి దాడి చేసిన కేసులో మరిన్ని వివరాలు బయటకు వస్తాయి. అందుకే వంశీ సెల్ ఫోన్ కీలకం అయింది. హైదరాబాద్‌లో అరెస్టు చేసే సమయంలో ఆయన సెల్‌ఫోన్ దొరకలేదు. వ్యక్తిగత సహాయకుడి ఫోన్‌ను గురువారం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు
అరెస్టు చేసేందుకు వంశీ నివాసానికి పోలీసులు వెళ్లినప్పుడు.. దుస్తులు మార్చుకుని వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్లిన ఆయన దాదాపు గంట పాటు ఫోన్‌లో మాట్లాడినట్టు గుర్తించారు. గంట సేపు ఎవరితో మాట్లాడారు? ఏం మాట్లాడారనే విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వంశీ నివాసమంతా రెండు గంటల పాటు పోలీసులు జల్లెడ పట్టినా ఫోన్ దొరకలేదు. వంశీని అరెస్టు చేసిన తర్వాత చివరిగా సెల్ ఫోన్ టవర్ లొకేషన్ రాయదుర్గంలోని ఆయన నివాసంలోనే చూపించింది. కానీ, ఇంట్లో మొబైల్ దొరక్క పోవడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సమయంలో సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోయారు. ఇందు కోసం కోర్టు అనుమతి కోరుతూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఇప్పటికే పిటిషన్ వేశారు. ఫోన్ తమ చేతికి వస్తే గుట్టు వీడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే మరిన్ని ఆధారాలు లభిస్తాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసుల దృష్టి నుంచి తప్పించుకునేందుకు వంశీ రెగ్యులర్ కాల్స్ కాకుండా వాట్సప్‌లో మాట్లాడుతుంటారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఫోన్‌కు సంబంధించి ఐపీడీఆర్ వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఆయన ఎవరెవరితో టచ్‌లో ఉన్నారన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర నిందితుల గాలింపులో ఈ సెల్‌ఫోన్ కీలకం కానుంది. పరారీలో ఉన్న నిందితుల కోసం మరో బృందం గాలింపు చేపడుతోంది.