జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం వ్యవహారంలో జనసేన క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉంటుందని తొలుత ఆ పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అందులోభాగంగా ఇటీవల విశాఖలో ఆయన జనసేన కార్పొరేటర్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అదే విషయాన్ని వారికి చెప్పారు. మరోవైపు జనసేన అధినేత కూడా తమ కార్పొరేటర్లను శిబిరాలకు వెళ్లవద్దని ఆదేశించారు. తొలుత అలాగేనంటూ తలూపిన వీరు ఆ తర్వాత కూటమి పెద్దల ఆఫర్లకు తలొగ్గారు. జీవీఎంసీకి 2021లో జరిగిన ఎన్నికల్లో జనసేన నుంచి ముగ్గురు కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పరిణామాల నేపథ్యంలో ఎనిమిది మంది వైసీపీ నుంచి జనసేనలో చేరిపోయారు. దీంతో ఇప్పుడు కౌన్సిల్‌లో జనసేన కార్పొరేటర్ల సంఖ్య పదకొండుకు పెరిగింది. అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తూ మలేసియాకు తొలి ట్రిప్పులోనే వైసీపీ నుంచి జంప్ చేసిన ఎనిమిది మంది చెక్కేశారు. అయితే తొలుత పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ముగ్గురు కార్పొరేటర్లు పీతల మూర్తి యాదవ్, వసంతలక్ష్మి, దల్లి గోవిందరెడ్డిలు మాత్రం పార్టీ ఆదేశాలకు కట్టుబడి విశాఖలోనే ఉండిపోయారు.
మ్యాజిక్ ఫిగర్ 74..
విశాఖ జీవీఎంసీలో మొత్తం సభ్యుల సంఖ్య 98. ఎక్స్ అఫీషియో సభ్యలతె కలిపి 111 మంది సభ్యలున్నారు. నిబంధనల ప్రకారం మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2/3 వంతు సభ్యుల మద్దతు అంటే.. కూటమికి 74 మంది సభ్యుల బలం అవసరం. ఇలా మ్యాజిక్ ఫిగర్ 74ను అధిగమిస్తేనే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది. లేదంటే వీగిపోతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం కూటమికి 70 మంది వరకు సభ్యులున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ లెక్కన వైసీపీ నుంచి మరో నలుగురు కార్పొరేటర్లు కావలసి ఉంటుంది. దీంతో ఇప్పడు ఆ నలుగురి సంఖ్యే కీలకంగా మారింది. ఆ నలుగురిని ఎలాగైనా తన్నుకు పోవాలని కూటమి నేతలు, ఆ అవకాశం కూటమికి ఇవ్వకూడదని వైసీపీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. సీపీఐ, సీపీఐ(ఎం)ల నుంచి గెలిచిన ఇద్దరు కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉంటారని చెబుతున్నారు. అయితే వీరిలో సీపీఐ కార్పొరేటర్ తమకు అనుకూలంగా ఓటేస్తారన్న ధీమాతో కూటమి నేతలున్నారు.
కార్పొరేటర్లకు రూ.లక్షల్లో ఆఫర్లు..
మేయర్‌పై అవిశ్వాస తీర్మానం వ్యవహారం కార్పొరేటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలన్నా, ఓడాలన్నా ఈ కార్పొరేటర్లే కీలకం. దీంతో వీరికి టీడీపీ, వైసీపీ నుంచి బంపర్ ఆఫర్లు ఇచ్చారు. తమకు అనుకూలంగా వ్యవహరిస్తే రూ.10 నుంచి 20 లక్షల వరకు ఇరు పార్టీలు ఆఫర్లు ఇచ్చినట్టు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. విదేశాల్లో విహార యాత్రలతో పాటు ఇతర బహుళ ప్రయోజనాలు సమకూరుస్తామని గట్టి హామీలే ఇచ్చారు. దీంతో ఇప్పడు ఓటింగ్‌కు వచ్చినా, రాకపోయినా ఈ కార్పొరేటర్లు జాక్ పాట్ కొడతారన్న మాట!
ఏడాది పదవి కోసం.. అవిశ్వాసం!
జీవీఎంసీ పాలకవర్గానికి ఇప్పటికే నాలుగేళ్లు పూర్తయ్యాయి. మరో ఏడాదిలో పాలకవర్గ పదవీకాలం ముగిసిపోతుంది. కేవలం ఒక్క ఏడాది కాలానికే అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్‌ను దించేసి కూటమి కార్పొరేటర్లలో ఒకరిని గద్దె నెక్కించడానికి తెగ తంటాలు పడుతున్నారు. ఒకవేళ్ల అవిశ్వాస తీర్మానం నెగ్గితే టీడీపీ 66వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ మేయర్ పీఠం ఎక్కడానికి తహతహలాడుతున్నారు. ఆర్థికంగా స్థితిమంతుడైన ఈయనే కార్పొరేటర్ల కొనుగోళ్లు, విదేశాల్లో విహార యాత్రలకయ్యే ఖర్చును ఆయనే భరిస్తున్నారని కూటమి నేతలు బాహాటంగానే చెబుతున్నారు.
డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ..
జీవీఎంసీలో ఇద్దరు డిప్యూటీ మేయర్లున్నారు. వీరిద్దరూ వైసీపీకి చెందిన వారే. ఇప్పడు మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్లను కూడా పదవీచ్యుతులను చేయాలని కూటమి నేతలు డిసైడ్ అయ్యారు. ఇదివరకే మేయర్‌పై అవిశ్వాసానికి కలెక్టర్‌కు నోటీసు ఇవ్వగా, తాజాగా డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పైనా అవిశ్వాస నోటీసును ఇచ్చారు. మరో డిప్యూటీ మేయర్ సతీష్ ఆలస్యంగా ప్రమాణ స్వీకారం చేయడం వల్ల నిబంధనల ప్రకారం నోటీసు ఇవ్వడానికి మరికొంత సమయం ఉంది. కొద్దిరోజుల్లోనే సతీష్‌పై కూడా అవిశ్వాస తీర్మానం నోటీసును కలెక్టర్‌కు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం నెగ్గితే మేయర్‌గా పీలా శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఇక రెండు డిప్యూటీ మేయర్ పదవుల విషయంలో కూటమిలో టీడీపీ నుంచి ఆరుగురు, జనసేన నుంచి ఆరుగురు పోటీ పడుతున్నారు.
విదేశాల నుంచి ఎప్పుడొస్తారు?
మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి వీలుగా ఈనెల 19 ఉదయం 11 గంటలకు కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల విదేశాల్లో విహార యాత్ర పూర్తి చేసుకుని కూటమి కార్పొరేటర్లు ఈనెల 18 రాత్రికి విశాఖకు తీసుకురానున్నారు. అయితే అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉండే వైసీపీ కార్పొరేటర్లు మాత్రం 20వ తేదీన గాని ఆ తర్వాత గాని వస్తారు. కూటమి నేతల స్వార్థ రాజకీయాల పుణ్యమాని కొన్ని నెలల నుంచి జీవీఎంసీలో పాలన గాలికొదిలేసి విదేశాల్లో విందు, వినోదాల్లో మునిగి తేలుతున్నారంటూ విశాఖ వాసులు మండి పడుతున్నారు.