ఘోర రోడ్డు ప్రమాదం.. నవ దంపతులు మృతి
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. ఈ ప్రమాదానికి నిద్రమత్తే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
By : The Federal
Update: 2024-03-06 06:10 GMT
పెళ్లి అనేది నూరేళ్ల బంధం అంటారు. కానీ ఓ నవ దంపతుల జంటను రోడ్డు ప్రమాదం కబళించింది. పెళ్లి జరిగిందన్న ఆనందాన్ని మూణ్ణాళ్లు కూడా ఉండనీయకుండా అనంతలోకాలకు పంపింది. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. దైవ దర్శనం చేసుకుని వస్తున్న నవ దంపతులు, వాళ్ల కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం మింగేసింది. దీంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తమ భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వారు వెల్లడించారు.
లారీని ఢీకొట్టిన కారు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని అయిదుగురు అక్కడిక్కడే మరణించారు. కొత్తగా పెళ్లైన కొడుకు, కోడలిని తీసుకుని తిరుపతి స్వామి వారిని దర్శించుకుని వస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించేసింది. వారు ప్రయాణిస్తున్న కారు ఆళ్లగడ్డ రహదారిపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు అక్కడిక్కడే మరణించారు.
నిద్రమత్తే కారణం
స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డును క్లియర్ చేసి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, మృతుల బంధువులకు సమాచారం అందిస్తున్నామని చెప్పారు. నిద్రమత్తు, అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు వారు వెల్లడించారు. ఈ ప్రమాదంలో రవీందర్, లక్ష్మీ దంపతులు, బాల కిరణ్, సాయికిరణ్, కోడలు కావ్య అక్కడిక్కడే మరణించారని పోలీసులు తెలిపారు.
ఆ ప్రాంతానికి చెందిన వారే
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారు సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతులలోని బాల కిరణ్, కావ్యకు గత నెల గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలోనే నవ దంపతులను తీసుకుని కుటుంబమంతా తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి వెళ్లింది. అలా వెళ్లి తిరిగి వస్తున్న సమయంలోనే వారు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది.