ఆవేశం ఎక్కువ, అర్థం తక్కువ: ప్రజాగళంలో పవన్ ప్రసంగం
ప్రజాగళం సభలో పవన్ కల్యాణ్ ఇచ్చిన ప్రసంగం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రసంగమంతా మోదీ పొగడ్తలే ఉన్నాయి. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే..
By : The Federal
Update: 2024-03-17 12:32 GMT
చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ఏర్పాటయిన బీజేపీ-టీడీపీ-జనసేన సంయుక్త ‘ప్రజాగళం’ సభలో పవన్ కల్యాణ్ ఇచ్చిన ప్రసంగం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రసంగమంతా సభలో ఆశీనులై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ పొగడ్తలే ఉన్నాయి. అంతా ఆవేశం. అనవసరమైన ఆవేశం. అర్థం లేని ఆవేశం. ఏదో టెన్షన్ ఆయనను ఆవహించింది. నిజానికి ఆయన ప్రసంగం బాగానే ఉంటుంది. ఈసారి ఎందుకో ఆయన ప్రసంగంలో పస లేదు. ఆయన సహజత్వం కోల్పోయారు. దానికి తోడు మధ్య ప్రధాని తన ఆసనం నుంచి లేచొచ్చి, పవన్ ప్రసంగం ఆపి సభా స్థలంలో ఏర్పాటు చేసి లైటింగ్ మంచెపై ఎక్కిన యువకులను దిగాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఇలా చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే..
టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ‘ప్రజాగళం’ బహిరంగ సభ చిలకలూరిపేటలో అయిదుగంటలకు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. ఈ సభను పవన్ ప్రసంగంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలో ముచ్చటగా మూడోసారి మోడీనే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తును మార్చడంలో మోడీతో కలిసి నడుస్తామని చెప్పారు. ప్రజలకు ఏం చేస్తాం అన్న అంశాలను ఆయన కనీసం టచ్ కూడా చేయలేదు. ఐదు నిమిషాలు ఇచ్చిన ప్రసంగంలో మోదీపై కురిపించిన పొగడ్తలే ఉన్నాయి. సభకు హాజరైన వారి నుంచి పవన్ ప్రసంగానికి ఆశించిన స్పందనా రాలేదు. ఎప్పుడూ పవన్ ప్రసంగం అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రజల హర్షద్వానాలు, కరతాళ ధ్వనులు, కేరింతలు ఈరోజు సభలో కరువయ్యాయి.
ఐదు కోట్ల మంది కల
ఎన్‌డీయే కూటమి మళ్లీ కలవాలన్నది ఐదుకోట్ల మంది కన్న కల అని పవన్ కల్యాణ్ అన్నారు. వారు కోరుకున్నట్లుగానే ఎన్‌డీయే మళ్ళీ మరోసారి కలిసిందని, అమరావతికి అండగా ఉంటానని మోదీ హామీ ఇచ్చారని వెల్లడించారు. ‘‘2014లో తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా మొదలైన పొత్తు ఇప్పుడు మళ్లీ 2024లో విజయవాడ దుర్గమ్మ సాక్షిగా ఒక్కటైంది. ఆంధ్రకు ఈ కూటమి కొత్త రూపు తీసుకురానుంది. ఎన్‌డీఏ ప్రభుత్వంలో అమరావతి దేదీప్యమానంగా వెలిగిపోతుంది’’అని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో ఆంధ్రలో ఎన్‌డీయే కూటమి అధికారంలోకి వస్తుందని, ఆ నమ్మకం తనకు వంద శాతం ఉందని అన్నారు. త్వరలోనే ఆంధ్రలో దుష్ట పాలన అంతం కాబోతోందని తెలిపారు.
ఎన్‌డీఏ విజయం తథ్యం
త్వరలో జరిగే ఎన్నికల్లో ఎన్‌డీయే కూటమే అధికారంలోకి వస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారిగా మారారు. ఏపీలో దుష్టపాలన సాగుతోంది. వైసీపీ హయాంలో రాష్ట్రం రావణకాష్టంలా మారింది. వారిని తప్పకుండా తొలగిస్తాం.అయోధ్యకే రాముడిని తీసుకువచ్చిన మోడీ ఇక్కడున్నారు. చిటికెన వేలంత జగన్ రెడ్డిని ఇంటికి పంపడం ఆయనకు కష్టమేం కాదు. వైసీపీ ప్రభుత్వ పాలన సమయంలో రాష్ట్రంలో అక్రమాలు అధికం అయ్యాయి. ప్రపంచవ్యాపత్ంగా ఉన్న పెద్దపెద్ద సంస్థలన్నీ పెట్టుబడులు పెట్టడానికి భారత్ వస్తుంటే ఆంధ్రలో మాత్రం ఉన్న సంస్థలకు కూడా రాష్ట్రం నుంచి పారిపోతున్నాయి. రావాల్సిన అనేక సంస్థలు కూడా ఇక్కడి పరిస్థితులను చూడగానే వేరే రాష్ట్రాన్ని వెతుక్కునే పనిలో పడుతున్నాయి. వాటన్నింటికీ అధికారంలోకి రాగానే ఎన్‌డీఏ చెక్ చెప్తుంది. అయోధ్య నుంచి ప్రధాని మోదీ పాంచజన్యాన్ని పూరిస్తారు. ’’అని వెల్లడించారు పవన్.